‘సహజ’మే ఆమె బ్రాండ్‌

‘తక్కువ సమయంలో ఫలితం రావాలని చాలా మంది ఆశిస్తారు. అందుకు ఖరీదైన సౌందర్య ఉత్పత్తులే మార్గమనుకుంటారు. అందుకే ఖర్చుకు వెనుకాడరు. మరి వాటిలో ఉండే రసాయనాల సంగతేంటి?’ అని ప్రశ్నిస్తోంది నందీత మన్‌చన్‌దా. అందుకు కారణం లేకపోలేదు. సౌందర్య ఉత్పత్తుల్లోని రసాయనాల కారణంగా

Updated : 15 Jun 2021 04:51 IST

‘తక్కువ సమయంలో ఫలితం రావాలని చాలా మంది ఆశిస్తారు. అందుకు ఖరీదైన సౌందర్య ఉత్పత్తులే మార్గమనుకుంటారు. అందుకే ఖర్చుకు వెనుకాడరు. మరి వాటిలో ఉండే రసాయనాల సంగతేంటి?’ అని ప్రశ్నిస్తోంది నందీత మన్‌చన్‌దా. అందుకు కారణం లేకపోలేదు. సౌందర్య ఉత్పత్తుల్లోని రసాయనాల కారణంగా తన స్నేహితురాలు క్యాన్సర్‌కి గురయ్యింది. సహజసిద్ధ ఉత్పత్తులతో ఈ సమస్య ఉండదు కదా అని ఆలోచించింది. అనుకోవడమే కాదు.. ఏకంగా ఒక బ్రాండ్‌నే ఏర్పాటు చేసింది.
నందీతా మన్‌చన్‌దా... యూఎస్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. అక్కడ చదువుతున్నపుడు తన స్నేహితురాలికి చర్మ క్యాన్సర్‌ అని తేలింది. ఆ అమ్మాయికి అప్పటికి 21 ఏళ్లే. ఆమెను థెరపీలు, చికిత్సకు నందీతానే తీసుకెళ్లేది. డెర్మటాలజిస్ట్‌ ఆమె ఉపయోగించిన సౌందర్య ఉత్పత్తులోని రసాయనం క్యాన్సర్‌కి కారణమైందని చెప్పారు. దాంతో ఆమె మనసు సౌందర్యోత్పత్తుల్లోని కెమికల్స్‌పైనే ఆగిపోయింది.
2010లో ఆమె భారత్‌కు తిరిగొచ్చినా.. ఈ ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. తర్వాత పెళ్లైంది, సొంత బ్యూటీ సెలూన్‌నూ ఏర్పాటు చేసుకుంది. కస్టమర్ల కోసం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలుండేవి. కొంతమంది రసాయనాలు లేకుండా ఉంటే బాగుండనే అనుకునేవారు. అదేదో తనే చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దాని ఫలితమే ‘ఎన్స్‌ క్లోజెట్‌’. ఇది సాకారం కావడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. కస్టమర్ల అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు తన అనుభవాలనూ జోడించి పరిశోధన జరిపింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధ పదార్థాలతో 2018లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. దీనిలో రసాయనాలు, జంతువుల అవశేషాలు వంటివి లేకుండా చూసుకుంది.
‘నా ఆలోచనలు సంస్థ దిశగా సాగడంలో మా బామ్మదే ప్రధాన పాత్ర. చిన్నప్పటి నుంచి ఆహార పదార్థాలను సౌందర్య పోషణలో ఉపయోగించడం ఆమె నుంచే నేర్చుకున్నాను. పెరుగు, కాఫీ, పండ్లు, గోధుమ పిండి.. ఇలా ప్రతిదాన్నీ ముఖానికీ, జుట్టుకీ పట్టించేవాళ్లం. అదే ఈ ప్రొడక్ట్స్‌ రూపొందించడానికీ సాయపడింది’ అంటుంది 27 ఏళ్ల నందీత. ముందుగా లిప్‌స్టిక్‌ల తయారీపై దృష్టిపెట్టింది. అది మంచి ఫలితాన్నిచ్చాక చర్మం, జుట్టు, కళ్లపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం 60 ప్రొడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. నెయ్యి, పండ్లు, కూరగాయలు, వెన్న, కొబ్బరి.. మొదలైన వాటినే ఉపయోగిస్తుంది. వీటిని కూడా రసాయనాలు వేయకుండా పండించిన వారి నుంచే తీసుకుంటుంది. ప్రస్తుతం నైకా, అమెజాన్‌ వంటి ప్రధాన వెబ్‌సైట్లూ ఆమె ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతున్నాయి.
కానీ.. వ్యాపారంలో విజయం ఆమెకు సులువేమీ కాలేదు. ముడిపదార్థాల విక్రేతలు చిన్న అమ్మాయి, తనకేం తెలుస్తుందిలే అని మోసం చేయాలనుకునే వారు. వాటన్నింటినీ ఆమె అధిగమించింది. ‘కొందరు సరకులు ఇచ్చే వాళ్లూ మొదట ఒకటి చూపించి, తర్వాత నాసిరకం పంపేవాళ్లు. నావద్ద తక్కువకు తీసుకుని ఎక్కువ రేట్లకు అమ్మే వాళ్లు. వీటన్నింటి నుంచి నెమ్మదిగా పాఠాలు నేర్చుకున్నాను’ అంటుందీ దిల్లీ అమ్మాయి. అందం ఒకొక్కరిలో ఒక్కోలా ఉంటుందంటుంది. రంగుకి కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వమంటుంది నందీత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్