మీకొద్దా? అయితే నాకు ఇవ్వండి!

కొన్ని డ్రెస్‌లు వదులయ్యాయనో, నప్పలేదనో వేయడం మానేస్తాం. తీసేద్దామా అంటే మనసొప్పదు. బీరువాలో కొన్నాళ్లపాటు దాచేస్తాం! తీరా వేరే వాళ్లకు ఇచ్చేసే సమయానికి అవి పాతబడతాయి లేదా చిరిగే స్థితికొస్తాయి.

Published : 16 Jun 2021 00:38 IST

కొన్ని డ్రెస్‌లు వదులయ్యాయనో, నప్పలేదనో వేయడం మానేస్తాం. తీసేద్దామా అంటే మనసొప్పదు. బీరువాలో కొన్నాళ్లపాటు దాచేస్తాం! తీరా వేరే వాళ్లకు ఇచ్చేసే సమయానికి అవి పాతబడతాయి లేదా చిరిగే స్థితికొస్తాయి. అలాంటి వాటిని తనకిమ్మంటోంది శ్రేయా చౌహాన్‌. వాటితో పిల్లలకు చదువు, ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చంటోంది. అదెలానో చూద్దామా!

శ్రేయా చౌహాన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. 18 ఏళ్లకే సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకుంది. లాభాలతోపాటు పేరునూ గడించింది. పాతికేళ్లు వచ్చాక తను సంపాదించుకోవడమే కానీ సమాజానికేమీ చేయలేదని అనిపించిందామెకు. తను చేసే సాయం అవసరార్థులు నిలదొక్కుకునేలా ఉపయోగపడాలనుకుంది. అదే సమయంలో ఒక ఎన్‌జీఓను నిర్వహిస్తున్న స్నేహితురాలికి డబ్బు అవసరమైంది. ఆ అమ్మాయి శ్రేయ సహాయాన్ని కోరింది. తను పక్కన పెట్టిన దుస్తులను సామాజిక మాధ్యమాల్లో ‘ద కాజ్‌ వేర్‌’ పేరిట అమ్మకానికి ఉంచింది. మంచి స్పందన వచ్చింది. మరికొందరూ తమ దుస్తులను అందించారు. ఆ అమ్మాయి ఎన్‌జీఓకి అవసరమైన మొత్తం అందింది.

ఓరోజు ఏటా ఫ్యాషన్‌ రంగంలో అమ్ముడవుతున్న వస్త్రాల గురించి తెలుసుకుంది. వీటిని పక్కన పడేయడం వల్ల ఎన్ని వనరులు వృథా అవుతున్నాయో తనకు అవగాహన వచ్చింది. ఇది పర్యావరణానికీ, సమాజానికీ హానికరమని భావించింది. ఈ సమస్యకు ఇంతకు ముందు పాటించిన ‘దుస్తుల సేకరణ- అమ్మకం’ మంచి సమాధానమనిపించింది. ‘ద కాజ్‌ వేర్‌’ పేరిట  2019లో ఆన్‌లైన్‌ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను సేకరిస్తారు. తరువాత వాటిని దశలవారీగా శుభ్రం చేస్తారు. ఆపై తాజా ఫ్యాషన్‌కు అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తారు. ఎక్కువ కాలం వేసుకోవడానికి పనికి రావనుకున్న వాటిని ఇతర రూపాల్లోకి మారుస్తారు. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే అమ్మకానికి ఉంచుతారు. ఇందుకోసం శ్రేయ దేశవ్యాప్తంగా గిడ్డంగులనూ ఏర్పాటు చేసింది. ఈ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని దృష్టి లోపం ఉన్న పిల్లల చదువుకు, ఆర్థికంగా వెనుకబడినవారి ఉపాధికి, ప్రస్తుతం ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్ల కోసం వినియోగిస్తోంది.

‘చాలామంది పేరుకు కొన్నా.. ట్రెండ్‌ మారిందనో, ఎక్కువసార్లు వేసుకోకో పక్కనపెట్టేస్తారు. వేరే వాళ్లకి ఇచ్చేద్దామనుకునే సరికి పనికి రాకుండా పోతాయి. ఇలాంటి వారి కోసమే ‘ద కాజ్‌ వేర్‌’ను మొదలుపెట్టా. బాగున్న వాటిని ఆన్‌లైన్‌లో పెడతాం. ఏమాత్రం పాడైనా రీసైకిల్‌ చేసి, టీ షర్టులుగా మార్చి పేదవారికి ఇస్తున్నాం. వచ్చిన డబ్బులతో క్యాన్సర్‌ సోకిన పిల్లలకు చికిత్స అందిస్తున్నాం. ఆన్‌లైన్‌ చదువు అవసరం ఉండీ సెల్‌ఫోన్‌ లేనివారికి స్మార్ట్‌ఫోన్లు అందించాం. కొందరికి చిన్న చిన్న వ్యాపారాలను పెట్టించాం. ఆక్సిజన్‌ అవసరమైన వారికి సిలిండర్లు, కాన్‌సెన్‌ట్రేటర్లనూ అందిస్తున్నాం’ అంటోందీ చెన్నై అమ్మాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్