పసుపు పాఠాలకు పద్మశ్రీ వచ్చింది

మేఘాలయలోని జెయింటియా పర్వతప్రాంతాలకు చెందిన గిరిజన మహిళ ట్రినిటీ సాయీవూ. వృత్తిరీత్యా టీచర్‌. అంతే కాదు పసుపు పంట ద్వారా వేల మంది మహిళలు ఆర్థిక, సామాజికపరంగా

Published : 25 Jun 2021 01:37 IST

మేఘాలయలోని జెయింటియా పర్వతప్రాంతాలకు చెందిన గిరిజన మహిళ ట్రినిటీ సాయీవూ. వృత్తిరీత్యా టీచర్‌. అంతే కాదు పసుపు పంట ద్వారా వేల మంది మహిళలు ఆర్థిక, సామాజికపరంగా స్వావలంబన పొందేలా కృషి చేస్తోంది. తన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో వరించాయి..
లకాడంగ్‌ పసుపు అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకం. ఇది మేఘాలయలో మాత్రమే పండుతుంది. అక్కడి ముల్లీ గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పుట్టింది ట్రినిటీ. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పడంలో ఆసక్తి ఉండటంతో, చదువు పూర్తయిన తర్వాత టీచర్‌గా మారింది. 2003లో స్పైసెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు ట్రినిటీ నివసించే ప్రాంతానికి వచ్చారు. అక్కడ పండే లకాడంగ్‌ పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అందరికీ అవగాహన కలిగించారు. దాంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్ట్‌లా అక్కడ ఈ పంటను పండించడానికి స్థానికులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆరోగ్యపరంగా ఈ పసుపు ఎలా ఉపయోగపడుతుందో అప్పటికే ట్రినిటీకి అవగాహన ఉంది. ఎందుకంటే బాల్యం నుంచి వ్యవసాయాన్ని చూస్తూ పెరిగింది. ఆహారంలో వాడే దీని విలువ తెలుసామెకు. దాంతో ఏడుగురు మహిళలతో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో ఈమె భాగమైంది. స్థానికులు, ప్రభుత్వ అధికారుల మధ్య ఆంగ్లం, హిందీ మాట్లాడుతూ అనుసంధానంగా నిలిచింది. మూడేళ్లపాటు చేపట్టిన ఈ స్కీంలో భాగంగా చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ పర్యటించేది ట్రినిటీ. సంప్రదాయ, సేంద్రియ పద్ధతుల్లో పంట దిగుబడిని ఎలా పెంచాలో నేర్పించేది. అలా సేంద్రియ పద్ధతుల్లో పసుపు పంట పండించడంలో వేల మంది గిరిజన మహిళలకు శిక్షణనందించింది.

‘అప్పుడు వచ్చిన ఆలోచనే... మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటు. పసుపు వ్యవసాయాన్ని మహిళల నేతృత్వంలో నడిచేలా చేయాలనుకున్నా. అలా మొదలైన బృందాలు ఇప్పుడు 100కు పైగా పెరిగాయి. దాంతోపాటు హిల్స్‌ కర్‌క్యుమిన్‌, స్పైస్‌ ప్రొడ్యూసర్‌ సొసైటీను రూపొందించా. నేను దీనికి అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. స్వయం సహాయక బృంద సభ్యుల సంఖ్య వెయ్యికి చేరింది. ఈ బృందాలన్నీ ఈ సొసైటీ ద్వారానే పసుపును పండిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా 30 మెట్రిక్‌ టన్నుల పసుపు ఎగుమతి చేయగలుగుతున్నాం. అనుకున్నంత సులువు కాలేదు మా వ్యవసాయం. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేసుకోవడం, మహిళా రైతులకు పంట వేయడం కోసం నగదు ఏర్పాటు చేయడం వంటివి ఛాలెంజ్‌గా మారేవి. వాటన్నింటినీ అధిగమించి ముందడుగు వేశాం. సొంతంగా మొలకలను వారే పెంచుకునేలా, పురుగులు పట్టకుండా పర్యవేక్షించుకునేలా శిక్షణనిచ్చేదాన్ని. అంతేకాదు, పంట పూర్తయిన తర్వాత దాన్ని పొడిగా మార్చడానికి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశా. క్రమేపీ అల్లాన్ని కూడా పండించడం మొదలుపెట్టాం. దీన్ని ఎండబెట్టి శొంఠిగా మారుస్తాం. మూడు మెట్రిక్‌ టన్నుల శొంఠి పొడిని ఎగుమతి చేస్తున్నాం. గతేడాది పద్మశ్రీ పరస్కారం నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నా’ అని అంటుంది ట్రినిటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్