Updated : 25/06/2021 22:35 IST

డబ్బు దానంతట అదే వస్తుందన్నారు!

బురఖా లేనిదే బయటికి రాకూడదన్న కఠిన నిబంధనలుండే కుటుంబంలో పుట్టిందా అమ్మాయి. పైగా ఎప్పుడూ అవే దుస్తులు. ఈ పద్ధతిని మార్చాలనుకుంది. చిన్న వయసులోనే సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌తో ఆకట్టుకుంది. అంతటితో ఆగలేదు... ప్రతి రంగంలోనూ తన ముద్ర వేయాలని తపించింది. 34 ఏళ్లొచ్చేసరికి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆమే సారా అల్‌ మదానీ..

టీనేజీలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టిన సారా ఆ తర్వాత రెండు దశాబ్దాల్లోనే ఎన్నో వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ శెభాష్‌ అనిపించుకుంటోంది. గత రెండేళ్లలో 182 కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా ప్రసంగించిందంటే... దుబాయ్‌లో ఆమెకున్న ఆదరణ అర్థమవుతుంది. సారా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌. షార్జాలో పుట్టిపెరిగిన సారా అరబ్‌ మహిళల వస్త్రధారణలో మార్పుతేవాలన్న లక్ష్యంతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ తెరపైకి తెచ్చింది. 15 ఏళ్లకే సారా అల్‌ మదానీ పేరుతో డిజైనింగ్‌ కంపెనీ ప్రారంభించింది. తన వస్త్రశ్రేణి యూఏఈలోనే కాదు ఆఫ్రికా, మధ్యతూర్పు దేశాల్లోని మహిళలనూ విపరీతంగా ఆకట్టుకుంది. అది విజయవంతం అయ్యాక రెస్టారెంట్లనూ తెరిచింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టకపోతే... అదే మరొకరికి గుర్తింపు తెచ్చిపెట్టవచ్చు. అందుకే.. లాభనష్టాల గురించి ఆలోచించకుండా ధైర్యంగా ముందడుగు వేయాలంటుంది సారా. ఓ సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడెవరో.. సాంకేతిక రంగం మగవారి కోసమే అన్నారు. అది తనలో పట్టుదలను తెచ్చింది. వెంటనే ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం సారా నడుపుతున్న వాటిలో మూడింట రెండొంతులు టెక్‌ సంస్థలే. ‘సోషల్‌ఫిష్‌’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో సంస్థలకు ప్రచారం కల్పించే, ఓ మార్కెటింగ్‌ సంస్థ, వేడుకలు నిర్వహించే ప్రపోజల్‌ క్యుపిడ్‌ సంస్థలనూ స్థాపించింది సారా. మంచి ఆలోచనలు తడితే మరో 10 సంస్థలు స్థాపించేందుకూ సిద్ధం అంటోంది. సామాజిక మాధ్యమాల్లోనూ లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది.

విమర్శలు, నష్టాలను స్వీకరిస్తూ... చేస్తున్న పని పట్ల గౌరవంతో, తననుంచి తానే స్ఫూర్తి పొందుతూ ధైర్యంగా ముందుకెళ్లడమే తన గెలుపు మంత్రమంటోంది సారా. మహిళాశక్తికి ప్రతి రూపంలా నిలుస్తున్న సారాను... యూఏఈ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాల కౌన్సిల్‌ బోర్డు సభ్యురాలిగా నియమించింది. సాధికారత ఎవరో తెచ్చిపెట్టేది కాదనీ, స్వయంగా సంపాదించుకోవాలనీ సూచిస్తోంది తను.

సారా వాళ్ల అమ్మ టీచర్‌. నాన్న ఇంజినీర్‌. తనకో అక్క. అమ్మానాన్న తనతో ఒక మాట తరచూ అనేవారట. ‘‘డబ్బు కోసం కాదు. నచ్చిన పని చేయి. డబ్బు దానంతట అదే వస్తుందని అనేవారు. ఇదే నా గెలుపు మంత్రం కూడా. ఖాళీ కప్పుతో ఏం ప్రయోజనం ఉంటుంది. అందుకే నా మనసుని సానుకూల ఆలోచనలతో నిండుగా ఉంచుకుంటాను. ఇన్ని వ్యాపారాలు ఎలా? ఇంటినీ, వృత్తినీ ఎలా సమన్వయం చేసుకుంటున్నావ్‌ అంటారు. నిద్రపోవడానికి ముందు మనం సంతోషంగా ఉంటే వృత్తినీ, జీవితాన్నీ సరిగా బ్యాలెన్స్‌ చేసినట్టే లెక్క. నా భర్త ముస్తఫా వ్యాపారవేత్త. మాకో అబ్బాయి. వాడితో ఆడుకుంటే మరో ప్రపంచం ఉందన్న విషయమే గుర్తుకు రాదు...’’ అంటున్న సారా పరవళ్లు తొక్కే విజయోత్సాహానికి ప్రతీకలా లేదూ.


బాధాకరమైన విషయం ఏమంటే అనేక సందర్భాల్లో మహిళలు తమ అధికారాన్ని తామే వదిలేసుకుంటారు... తమకు అంత అర్హత లేదనుకుని.

- ఆలిస్‌ వాకర్‌, పులిట్జర్‌ బహుమతి గ్రహీత, సామాజిక కార్యకర్త


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని