Updated : 29/06/2021 06:02 IST

కన్నవారు కాదనుకుంటే.. పెంచినవారికి పేరు తెచ్చింది

పోషించే స్థోమత లేదని అమ్మానాన్నా అనాథాశ్రమంలో వదిలేశారు. వారాల వయసున్న పసికందును ఓ దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఆసక్తి చూపితే క్రికెట్‌ను నేర్పించారు. ఆ అమ్మాయి అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టింది. దానికి నాయకత్వం వహించడమే కాకుండా పెరిగిన దేశానికి ప్రపంచ కప్పునూ అందించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ లిసా కాప్రినీ స్తాలేకర్‌ కథే ఇది.

లిసాది పుణె. మూడు వారాల పసికందుగా ఉన్నప్పుడే పెంచే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు తనని అనాథాశ్రమం మెట్లపై వదిలేశారు. ఆమె పేరు లైలా అనీ, పుట్టిన తేదీ ఫలానా అని మాత్రం చీటీ మీద రాసి ఉంచారు. ఆ ఆశ్రమానికి హారెన్‌, సూ స్తాలేకర్‌ అనే ఒక ఇండో ఆస్ట్రేలియన్‌ జంట దత్తత తీసుకోవడానికి వచ్చింది. వాళ్లకి ఇదివరకే ఒక అమ్మాయి. బాబును దత్తత తీసుకోవాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఉయ్యాల్లో పెద్ద కళ్లతో తమనే చూస్తూ నవ్వుతున్న ఓ పాప వాళ్లని ఆకర్షించింది. ఆమెను దత్తత తీసుకుని, లిసా స్తాలేకర్‌గా పేరు మార్చారు. ఆమెను తీసుకుని యూఎస్‌కి వెళ్లిపోయారు. కన్నబిడ్డలా చూసుకున్నారు. లిసాకు నాలుగేళ్లు వచ్చేసరికి వాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చేశారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులిద్దరికీ ఆస్ట్రేలియన్‌ పౌరసత్వం ఉంది. ఆమెకీ అక్కడే పౌరసత్వం ఇప్పించారు. తనకు ఊహ తెలిశాక దత్తత విషయాన్ని ఆమెకు చెప్పారు. వేరే వాళ్ల ద్వారా తెలిస్తే ఆమె తట్టుకోలేదన్నది వాళ్ల ఉద్దేశం. ప్రేమ విషయంలో కానీ అన్నింటినీ సమకూర్చడంలో కానీ ఎప్పుడూ ఆ భావన కలగకుండా పెంచారంటుంది లిసా. ఆమే అది విని కుంగిపోకుండా ఎప్పుడూ ఏదైనా సాధించి తనను తాను నిరూపించుకోవాలనుకునేదట. ఓసారి ఇంటివెనుక కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడటం గమనించింది. తనూ ఆడతానంటే తండ్రి ఒప్పుకున్నాడు. బాగా ఆడుతుండటం, ఆమె ఆసక్తి గమనించి శిక్షణనూ ఇప్పించాడు. అప్పటివరకూ విమెన్‌ క్రికెట్‌ సంగతే ఆమెకు తెలియదు. కేవలం ఆడాలనుకుందంతే.

ఓరోజు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్‌ మహిళల క్రికెట్‌ చూడటానికి లిసాను తీసుకెళ్లాడాయన. మగవాళ్లతోపాటు ఆడవాళ్లూ ఆడతారని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తనూ దేశం కోసం ఆడాలనుకుంది. ఇదే తనకు తగినదనుకుని పట్టుదలతో ఆడి ఆల్‌ రౌండర్‌గా ఎదిగింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నాలుగు ప్రపంచకప్‌లు గెలవడంలో పాత్ర పోషించింది. వన్డేల్లో 1000 పరుగులతోపాటు 100 వికెట్లు సాధించిన మొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. అంతేకాదు జట్టుకు నాయకురాలై ముందుండి నడిపించింది. ఈ ప్రయాణంలో ఎన్నో అవార్డులూ అందుకుంది. 2013లో వన్డే ప్రపంచకప్‌ను అందుకున్నాక ఆటకు వీడ్కోలు పలికింది. అది భారత్‌లోనే జరగడం విశేషం. ప్రస్తుతం 41 ఏళ్ల లిసా క్రికెట్‌ కామెంటేటర్‌గా చేస్తోంది. తనను కన్నవారి గురించి తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అని చాలామంది లిసాను అడుగుతుంటారు. దానికి ఆమె.. ‘నాకు ఎంతో ప్రేమను అందించే తల్లిదండ్రులున్నారు. వాళ్లెప్పుడూ నన్ను వేరుగా చూడలేదు. అలాంటప్పుడు నన్ను వద్దనుకున్నవాళ్ల కోసం ఎందుకు తాపత్రయపడాలి? నన్ను పెంచిన వారికి అది అవమానం కదా?’ అంటుంది. లిసా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌కు మహిళా బోర్డ్‌ మెంబర్‌గా పనిచేసింది. విమెన్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ ఫౌండర్‌ కూడా. ఈ ఏడాది క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈమెకు స్థానం కల్పిస్తున్నట్లు ఆ దేశ బోర్డు ప్రకటించింది. ఈమె కథనంతా తాజాగా ట్విటర్‌లో ఎవరో పంచుకోగా అది వైరల్‌ అయ్యింది. తన గతాన్ని తెలుసుకుని కుంగిపోకుండా ముందుకు సాగడమే కాకుండా పెంచినవారినీ గర్వించేలా చేసిందని చదివిన వారంతా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు తన స్ఫూర్తి కథనాన్ని తమ పిల్లలతో పంచుకుంటామనీ అంటున్నారు. నిజమే వద్దనుకున్న స్థాయి నుంచి అందరూ గర్వించే స్థాయికి ఎదగడం స్ఫూర్తిమంతమే కదూ!


మంచిమాట

చాలామంది మహిళలు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. మన నైపుణ్యాలను మనం గుర్తించి గౌరవించుకోవాలి.

- బార్బరా కొర్కొరన్‌, వ్యాపారవేత్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని