చిన్న వయసు...పెద్ద మనసు!

ఇరవై ఏళ్ల అమ్మాయి. ఏం చేస్తుంది? చదవడమో, సరదాగా కాలక్షేపమో అంటారా. కానీ ప్రియా పాటిల్‌ ఏం చేస్తోందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Updated : 01 Jul 2021 04:50 IST

ఇరవై ఏళ్ల అమ్మాయి. ఏం చేస్తుంది? చదవడమో, సరదాగా కాలక్షేపమో అంటారా. కానీ ప్రియా పాటిల్‌ ఏం చేస్తోందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రియా పాటిల్‌ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొవిడ్‌ కారణంగా తరగతులన్నీ ఆన్‌లైనే. దీంతో చాలా ఖాళీ ఉండేది. దీన్ని సమాజ సేవకు ఉపయోగిద్దామనుకుంది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం అంబులెన్స్‌ డ్రైవింగ్‌. ఈమెది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌. తండ్రి షిరోలీలోని ఇండస్ట్రియల్‌ యూనిట్‌లో, తల్లి ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె తన నిర్ణయాన్ని వాళ్లతో పంచుకున్నపుడు వాళ్లూ సమ్మతించారు. ఆమెకు డ్రైవింగ్‌ వచ్చు. తను నివసించే జాదవ్‌వాడికి దగ్గర్లో ప్రభుత్వాసుపత్రి ఉంది. అక్కడ అంబులెన్స్‌ నడపడానికి చేరింది. కొవిడ్‌ కారణంగా మృతిచెందిన వారిని శ్మశానవాటికలకు తరలిస్తోంది.
రోజూ ఉదయం 9 గం. నుంచి రాత్రి 9 గం. వరకు ప్రియ ఈ సేవలందిస్తోంది. అంతేకాదు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందికి చితిని పేర్చడంలోనూ సాయమందిస్తోంది. దేశంలో శ్మశానవాటికల్లో అమ్మాయిలకు అనుమతి తక్కువ. పైగా కొవిడ్‌ ఉందని కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్న సమయంలో ఈమె ధైర్యంగా ముందుకొచ్చి సేవలందిస్తోంది.
‘మొదటిసారి పీపీఈ కిట్‌ ధరించి అంబులెన్స్‌ డ్రైవర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొంత భయపడ్డా. తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించడం నాకు ప్రోత్సాహాన్నిచ్చింది. చేరి కొద్దిరోజులే అయినా వంద మంది మందిని శ్మశానవాటికలకు తరలించాను. వారిని జాగ్రత్తగా తుది మజిలీకి పంపడం సంతృప్తినిస్తోంది’ అంటోంది ప్రియ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్