వైద్యం మా కల.. నటన అభిరుచి!

‘సినిమాపై ఇష్టంతో చదువు మానేశా’  ‘డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. కానీ.. యాక్టర్‌ అయ్యా’- సాధారణంగా సినిమా తారల నుంచి వినే మాటలివి. కానీ మన ఇద్దరు నాయికలు మాత్రం మా మొదటి ప్రాధాన్యం వైద్యవృత్తే,

Published : 01 Jul 2021 01:35 IST

‘సినిమాపై ఇష్టంతో చదువు మానేశా’  ‘డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. కానీ.. యాక్టర్‌ అయ్యా’- సాధారణంగా సినిమా తారల నుంచి వినే మాటలివి. కానీ మన ఇద్దరు నాయికలు మాత్రం మా మొదటి ప్రాధాన్యం వైద్యవృత్తే, అభిరుచి కొద్దీ సినిమాల్లోకి వచ్చామంటున్నారు. వాళ్లే.. సాయిపల్లవి,  రూపా కొడువయూర్‌. వీళ్లిద్దరిలో ఇంకో పోలికా ఉంది. ఇద్దరూ మంచి డ్యాన్సర్లే.

కార్డియాలజిస్ట్‌ని అవుతా: సాయిపల్లవి

నెమలి నాట్యం, సహజ నటన, మేకప్‌ లేని ముఖం.. సాయిపల్లవి పేరు వినగానే గుర్తొచ్చే అంశాలివి. ఈ తమిళమ్మాయి.. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించి, దక్షిణాదిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయినా వైద్య విద్యాభ్యాసం ఆపలేదు. జార్జియాలోని తబలిసి స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ నుంచి 2016లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. గత ఏడాది తిరుచ్చిలో ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌కూ హాజరైంది. 2015లో మళయాళం ‘ప్రేమమ్‌’తో అందరి చూపూ ఆకర్షించింది. కానీ 2008లోనే ఆమె అరంగ్రేటం చేసింది. కొన్ని డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లతో టీవీ ప్రేక్షకులకీ దగ్గరైంది. అయినా అంత విరామం తీసుకోవడానికి కారణమేంటంటే.. చదువు. మొదటి ప్రాధాన్యం దానికే ఇచ్చింది. ప్రేమమ్‌ నాటికి విద్యాభ్యాసం పూర్తికాలేదు. సినిమాలు చేస్తూనే కొనసాగించింది. కార్డియాలజిస్ట్‌ కావాలన్నది ఆమె కలట. యాక్టర్‌ సాయిపల్లవిని నిజజీవితంలో డాక్టర్‌గానూ చూస్తామన్నమాట.


లాక్‌డౌన్‌లో సేవలు: రూపా కొడువయూర్‌

‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో పరిచయమైన రూపకు డాక్టర్‌ అవ్వడం చిన్నప్పటి నుంచీ లక్ష్యమట. అభిరుచి కొద్దీ సినిమాలు చేస్తున్నానంటోంది. ఈమె గుంటూరు కాటూరి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో హౌజ్‌ సర్జన్‌ పూర్తిచేసింది. గత ఏడాది లాక్‌డౌన్‌ నాటికి ఇంకా చదువు పూర్తికాలేదు. చివరి సంవత్సరం చదువుతోంది. అయినా కొవిడ్‌ బాధితులకు వైద్యం అందించింది. మొదట భయంగా అనిపించినా వైద్యుల లక్ష్యం రోగులను కాపాడటమే కాబట్టి ధైర్యంగా కొనసాగించానంటోంది. అంతేకాదు.. కరోనా సమయంలో వైద్యులు చేస్తున్న కృషిని తెలియజెప్పేలా రూపొందించిన ‘దారే లేదా’ వీడియోలో డాక్టర్‌గా చేసింది. నానీ సమర్పించిన ఈ ఎనిమిది నిమిషాల వీడియోను ఈ నెల 18న యూట్యూబ్‌లో ఉంచగా 22,23,839మంది చూశారు. హౌస్‌ సర్జన్సీ పూర్తవగానే 20 రోజులపాటు ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని మళ్లీ వైద్యసేవలను అందించింది. ఈమె డ్యాన్సర్‌ కూడా. భరతనాట్యంలో శిక్షణ తీసుకొంది. సొంత యూట్యూబ్‌ ఛానెల్‌నూ నిర్వహిస్తోంది. రెండు ప్రొఫెషన్లనీ బ్యాలెన్స్‌ చేయడం కష్టంగా ఉన్నా కొనసాగిస్తానంటూనే.. ఆంకాలజీలో స్పెషలైజేషన్‌నూ చేస్తానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్