చాయ్‌తో విజయం!

లండన్‌లో ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌గా కితాబులం దుకుంది.. పుట్టి పెరిగిన ఊరికి తిరిగొచ్చేసి వింత వింత టీ పౌడర్లతో చరిత్ర సృష్టించింది... కరోనా కల్లోలంలోనూ మన్ననలు అందుకుంటోంది..

Published : 02 Jul 2021 01:08 IST

లండన్‌లో ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌గా కితాబులం దుకుంది.. పుట్టి పెరిగిన ఊరికి తిరిగొచ్చేసి వింత వింత టీ పౌడర్లతో చరిత్ర సృష్టించింది... కరోనా కల్లోలంలోనూ మన్ననలు అందుకుంటోంది..

బంధుమిత్రులంతా ఎలీగా పిల్చుకునే ఎలిజబెత్‌ యాంబెమ్‌ ఇంగ్లండ్‌లో చదివి, అక్కడే ఉద్యోగంలో చేరింది. కీలక బాధ్యతల్లో తలమునకలై ఉన్నా తాను పెరిగిన రత్నాలగని మణిపూర్‌ గుర్తొచ్చేది. రెక్కలు తొడుక్కుని ఊళ్లో వాలాలనిపించేది. అలసట కలిగిన వేళల్లో సొంతూరి ఆలోచనలే ఊరటనిచ్చేవి. చిన్నతనంలో ఇంట్లో ఎవరికి జలుబు చేసినా ఎలీ గబుక్కున బయటకు పరిగెత్తేది. ఏపుగా పెరిగిన గుప్పెడు నాంగ్‌-మాంగ్‌-ఖా ఆకులు తెంపుకొచ్చి అమ్మకిస్తే ఆవిడ నీళ్లల్లో మరిగించి ఆవిరి పట్టించేది. క్షణాల్లో జలుబూ దగ్గూ ఎగిరిపోయేవి. అలాగే హీమాంగ్‌ ఫ్రూట్స్‌గా ప్రసిద్ధమైన పుల్లటి బెర్రీ పండ్లను అమ్మ రాత్రి నానబెట్టి పొద్దున్నే తినమనేది. అవెంత రుచిగా ఉండేవో. ఈ తీయటి జ్ఞాపకాలే ఎలీలో తేనీటి వ్యాపారానికి స్ఫూర్తి.

2016లో ఉద్యోగం వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చాక గౌహతి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ నిపుణులతో కలిసి పనిచేసింది. ఓ ఏడాది రకరకాల టీ పౌడర్ల గురించి అధ్యయనం చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేసింది. అలా మొదలైందే ‘డ్వెల్లర్‌’. చిన్నప్పటి అమ్మ కషాయం అప్పుడు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తే ఇప్పుడు ఓ మంచి ఉపాధికి నాంది పలికింది. ప్రేరణ అమ్మదయితే ప్రయోగం ఆమెది. బెర్రీపళ్లు, గోంగూర, ఆలివ్‌ మిశ్రమాలతో ఆరంభించిన హెర్బల్‌ టీ కంపెనీ కొద్దికాలంలోనే గ్రీన్‌టీతో సహా ఎన్నో రుచులు, పరిమళాలను పరిచయం చేసింది.

అల్లం, పసుపు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో ఆరోగ్యానికీ శ్రేష్టం. పసుపు కొమ్ములను ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్‌ చేస్తుంది. దాంతో చేసిన టీ ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. పొద్దున్నే ఈ భిన్నమైన చాయ్‌ తాగితే ఆ థ్రిల్లే వేరంటూ కస్టమర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిర్యానీలో ఉపయోగించే స్టార్‌ ఎనైస్‌ టీ కూడా ఉందంటే విస్మయం కలక్క మానదు.

ఇక లాక్‌డౌన్‌లో రోగనిరోధకశక్తి ముఖ్యమనుకుంది. మరిన్ని ప్రయోగాలు చేయాలనిపించింది. మారేడు, పచ్చి మామిడి, పుదీన, మిరపకాయలతో టీ మిశ్రమాలు విడుదలయ్యాయి. అలాగని అమ్మమ్మలు ఇచ్చే కషాయంలా ఉన్నా ఎవరూ తాగరు. కనుక రుచీ పరిమళం ముఖ్యం. ఈ సూత్రం పాటిస్తున్నందునే ఆదరణ లభిస్తోంది. వగరుగా ఉండే మారేడుకు మిరియాల ఘాటును తలపించే కింగ్‌ చిల్లీ, అడవి పసుపుల కలయికతో విభిన్న చాయ్‌ పుట్టుకొచ్చింది. పచ్చి మామిడి, పుదీన కూడా అలాంటివే. ఈ ప్రయోగాలు వినియోగదారులకు తెగ నచ్చాయి. ఆర్డర్ల వెల్లువ మొదలైంది. ‘ఖండాంతరాలకు వెళ్లినా మా ఊరినీ, ఔషధ వృక్షాలనీ మర్చిపోలేదు. వాటితోనే ప్రయోగాలు చేశాను’ అంటున్న ఎలీ ఎందరికో స్ఫూర్తి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్