ఆందోళనకు నివృత్తి ‘అగట్సు’

నిన్నమొన్నటి దాకా ఒక స్టార్‌ హీరో కూతురుగానే పరిచయం. ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకత్వ శాఖలో పనిచేసింది. టాటూ కళను నేర్చుకుంది. ఇక ఇప్పుడు సమాజమంతా

Published : 03 Jul 2021 01:31 IST

నిన్నమొన్నటి దాకా ఒక స్టార్‌ హీరో కూతురుగానే పరిచయం. ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకత్వ శాఖలో పనిచేసింది. టాటూ కళను నేర్చుకుంది. ఇక ఇప్పుడు సమాజమంతా బాగుండాలనే ధ్యేయంతో ‘అగట్సు’ ప్రారంభించింది. ఇంతకీ ఎవరామె?
ఆమిర్‌ఖాన్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ‘లగాన్‌, దంగల్‌, త్రీ ఇడియట్స్‌’ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్స్‌తో దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడాయన కూతురు ఇరా ఖాన్‌ వార్తల్లో వ్యక్తయ్యింది. ఈ తరం పిల్లలందరిలాగే సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భావాలను నలుగురితో పంచుకుంటుంది. తాజాగా ‘మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌’ గురించి ప్రకటించింది. ఇరా ఖాన్‌కు నటన మీద ఆసక్తి లేదు. టెక్నీషియన్‌గా ఉండటమే ఇష్టమని చెబుతుంది. తన ఆకాంక్షల్లో ఒకటైన టాటూ కళ తనకు మరో కెరీర్‌గా ఉపయోగపడొచ్చు అనేది తన ఆలోచన. తొలి టాటూ తనమీదే ప్రయోగించుకుంది. ఒకరోజు తన చేతిమీద ‘మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారు’ అనే అర్థమొచ్చే టాటూ వేసుకుంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. ఆ పదాలామెకి అందంగా, అద్భుతంగా అనిపించాయి. ఆ టాటూ చూసుకుని మురిసిపోతున్నప్పుడు తానేం చేయాలో స్పష్టత వచ్చిందట. దాని ఫలితమే ఈ మానసిక ఆరోగ్య కేంద్రం. ఆపైన వెంటనే కార్యాచరణ జరిగిపోయింది. ‘అగట్సు’ పేరుతో ఫౌండేషన్‌ నమోదు చేయించింది. అవసరంలో ఉన్నవాళ్లెవరైనా తమను సంప్రదించవచ్చని ఆహ్వానిస్తోంది. ‘అగట్సు’ అనేది జపనీస్‌ పదం. దీనికి అర్థాలు... సిసలైన విజయం, స్వీయనైపుణ్యం. ఈ సంస్థ ఏర్పాటుకు ఆమిర్‌ఖాన్‌, ఆయన శ్రీమతి కిరణ్‌ కూడా మద్దతు తెలిపారు.
‘అందరికీ చిన్నవో పెద్దవో సమస్యలుంటాయి. కొన్ని సాధారణం, ఇంకొన్ని విభిన్నం. వాటిల్లో చాలా వాటికి సమాధానాలు తెలీదు. తెలుసుకుని పరిష్కరించుకోగలిగితే సుఖంగా ఉండొచ్చు. ఒంటరితనాలు తగ్గుతాయి. ఇష్టమైన వ్యాపకాలతో, నచ్చినరీతిలో సంతోషంగా గడపొచ్చు. అందుకు తోడ్పడాలనేదే మా లక్ష్యం. మేం కష్టకాలంలో తోడుగా ఉంటాం. మానసిక అనారోగ్యాల గురించి అవగాహన కల్పించి, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. ఇది తొలి అడుగు మాత్రమే. మున్ముందు ఇంకెన్నో మంచి పనులు చేయాలని ఉంది. ఇది మీకు బాగుందనిపిస్తే మా వెబ్‌సైట్‌ చూడండి. మీకు గానీ, మీ బంధుమిత్రులకు గానీ ఎలాంటి ఆందోళనలు, మానసిక సమస్యలున్నా తగిన సాయం పొందొచ్చు’ అంటోంది ఇరా ఖాన్‌. ఇదెంత మంచి పనో కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్