Updated : 04/07/2021 04:49 IST

అదరగొట్టేస్తున్న యూట్యూబ్‌ ‘స్టార్స్‌’

ప్రస్తుతం సోషల్‌ మీడియా ట్రెండ్‌ నడుస్తోంది. అభిమానగణం, ఆదాయం రెండూ ఇక్కడ సులువుగా సాధించొచ్చు. అందుకే సెలబ్రిటీలు సైతం వెండితెర మీదే కాదు వెబ్‌సిరీస్‌లు, వ్లాగ్స్‌తో టీవీ, మొబైల్‌ స్క్రీన్‌ల మీదా దర్శనమిస్తున్నారు. ప్రత్యేకించి సొంత యూట్యూబ్‌ ఛానెల్స్‌తో సందడి చేస్తున్నారు. తరచూ వీడియోలు పెడుతూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.


చక్కని అలవాట్లు చేయాలని...
ఉపాసనా కామినేని (3.82 లక్షల సబ్‌స్క్రైబర్స్‌, 275 వీడియోలు)

హీరో రామ్‌చరణ్‌ భార్యగానే కాదు.... అపోలో ఆసుపత్రుల సీఎఎస్‌ఆర్‌ విభాగానికి వైస్‌ఛైర్మన్‌గా, ఆ ఆసుపత్రుల ఎండీగా ఆమెకో ప్రత్యేక గుర్తింపు ఉంది. యువర్‌లైఫ్‌ బై ఉపాసనా కామినేని పేరుతో నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌ ఛానెల్‌నీ ప్రారంభించారామె. ప్రకృతితో సావాసం, జీవనశైలిని ఆరోగ్యకరంగా మలచుకోవడం వంటి విషయాల్లో సూచనలందిస్తున్నారు. ఈ ఆల్‌ఇన్‌ వన్‌ ప్లాట్‌ఫామ్‌లో సహజంగా తయారు చేసే పదార్థాలు/వస్తువులు మొదలుకుని చర్మ సంరక్షణ వరకూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. అప్పుడప్పుడూ సమంత,  రకుల్‌ వంటి తారలు వచ్చి వంటకాలను చేసి చూపి ఆకట్టుకుంటున్నారు.

సాయానికి వంటలు చేసింది!

రకుల్‌ (2.40 లక్షల సబ్‌స్కైబర్స్‌, 52 వీడియోలు)

సినిమాలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటారు రకుల్‌ ప్రీత్‌. గతేడాది తన పేరుతోనే యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యకర వంటకాల తయారీ, యోగా - వర్కవుట్లు, చర్మసంరక్షణ, స్నేహితురాళ్లతో చిట్‌చాట్‌ వంటివీ పంచుకుంటారు. వాటిల్లో వంటల వీడియోల ఆదాయాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించారు. ఇందులో భాగంగానే మొదట చాకొలెట్‌ పాన్‌కేక్‌ తయారీని వీక్షకులకు పరిచయం చేశారు. 200 కరోనా బాధిత కుటుంబాలకు నిత్యవసరాలనూ అందించారు.

మిలియన్‌ వ్యూస్‌ అందుకుంది..
హన్సిక మోత్వానీ (1.99 లక్షలు, 34 వీడియోలు)

అయిదు భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక కరోనా లాక్‌డౌన్‌ వేళ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేస్తూనే, వివిధ అంశాలపై వీడియోలు చేశారు. భారతీయ పెళ్లిళ్లు, మేకప్‌, ఫొటోషూట్‌, మాల్దీవుల విహారం... ఇలా చాలానే ఉన్నాయి. తను క్వారంటైన్‌లో ఉన్నప్పుడు, సోదరుడి మెహెందీ వేడుక వీడియోలు 10 లక్షలకు పైగానే వ్యూస్‌ అందుకున్నాయి.

మేకప్‌ మెలకువలతో...
చిన్మయి శ్రీపాద (1.74లక్షలు, 373 వీడియోలు)

గాయనిగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రముఖురాలు. అంతేకాదు.. మహిళలు, సామాజిక సమస్యలపై ధైర్యంగా గళమెత్తుతారామె. తనూ చిన్మయి శ్రీపాద పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. దీంట్లో మేకప్‌, అందాన్ని కాపాడుకోవడం వంటివి పాఠాలుగా చెబుతున్నారు. సామాజిక అంశాలపైనా, అపోహలపైనా అవగాహన కల్పిస్తున్నారు. ఐసెల్‌ ఆఫ్‌ స్కిన్‌ పేరుతో సౌందర్య ఉత్పత్తులనూ తీసుకొచ్చారు.

కూతురితో కలిసి...
మంచు లక్ష్మి (1.26 లక్షలు, 25 వీడియోలు)

ప్రముఖ నటుడు మోహన్‌బాబు గారాల పట్టిగానే కాకుండా నటి, నిర్మాతగా మంచు లక్ష్మి సత్తాని నిరూపించుకున్నారు. తను, కూతురు విద్యా నిర్వాణతో కలిసి యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టారు. దానిపేరే చిట్టీచిలకమ్మ. ఇందులో స్పిల్‌ ఈజ్‌ వెల్‌ పేరుతో తొలివీడియోను పోస్ట్‌ చేశారు. పిల్లలు ఇల్లంతా చిమ్మేసిన వస్తువుల్ని సులువుగా ఎలా శుభ్రం చేయాలో ఇందులో చూపించారు. చిన్నారులకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. పిల్లల పెంపకం, వారిని ఒత్తిడికి దూరంగా ఎలా ఉంచవచ్చు... వంటి విషయాలపై తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

జీవిత కథే తొలి వీడియో!

 మంజుల ఘట్టమనేని  (26.9 వేలు, 56 వీడియోలు)

‘షో’ మూవీతో నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని. ‘మనసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగానూ మారారు. ఇప్పుడు తన పేరుతోనే వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానళ్లను ప్రారంభించారు. తన జీవితకథనే తొలి వీడియో. జీవన శైలి, సమయపాలన, ఆహారం, ఆరోగ్యం, దైవం, స్ఫూర్తి కలిగించే అంశాలకు సంబంధించిన విషయాలెన్నో ఇందులో పంచుకుంటున్నారు మంజుల.ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను. వాళ్ల గురించి నేను ఏమనుకుంటున్నాననేదే నాకు ముఖ్యం.

 


ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను. వాళ్ల గురించి నేను ఏమనుకుంటున్నాననేదే నాకు ముఖ్యం.

- విద్యాబాలన్‌, సినీనటి

 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని