ఆటోలే అంబులెన్సులయ్యాయి

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఎత్తైన ప్రాంతాలే ఎక్కువ. అక్కడ నివసించే గిరిజనులకు అత్యవసరంలో చికిత్స అందడం కష్టం. ఈ ఇబ్బందిని గుర్తించి, తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది రాధికా శాస్త్రి. తన ఆలోచనకు కార్యరూపమే ‘అంబురెక్స్‌’. ఆటోలను అంబులెన్స్‌లుగా తీర్చిదిద్ది, పేదలకు సేవలందేలా చేస్తోంది....

Published : 06 Jul 2021 00:26 IST

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఎత్తైన ప్రాంతాలే ఎక్కువ. అక్కడ నివసించే గిరిజనులకు అత్యవసరంలో చికిత్స అందడం కష్టం. ఈ ఇబ్బందిని గుర్తించి, తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది రాధికా శాస్త్రి. తన ఆలోచనకు కార్యరూపమే ‘అంబురెక్స్‌’. ఆటోలను అంబులెన్స్‌లుగా తీర్చిదిద్ది, పేదలకు సేవలందేలా చేస్తోంది.

రాధిక కొన్నేళ్లుగా కున్నూరులో సొంతంగా కేఫ్‌ను నడుపుతోంది. కరోనా సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలు, పర్వత శ్రేణులకు సమీపంలో ఉండే గిరిజన కుటుంబాలకు సమయానికి చికిత్స అందక ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలుసుకుంది. కొన్ని సమయాల్లో ప్రాణాపాయమవడం చూసింది. అత్యవసర పరిస్థితుల్లో కనీసం దగ్గర్లో ఉండే ప్రాథమిక వైద్య కేంద్రాలకు కూడా సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అటువంటి చోట్ల నుంచి సునాయసంగా ఆసుపత్రులకు రాగలిగేలా వాహనాలుంటే ఈ సమస్య నుంచి వాళ్లు బయటపడగలుగుతారని భావించింది. తాను చేయాలనుకున్న సాయాన్ని తనకు తెలిసినవారందరికీ చెప్పడమే కాకుండా ఆర్థికసాయాన్నీ కోరింది. అలా దాతల నుంచి రూ3.5 లక్షలు విరాళాలను సేకరించింది. వాటితో 470సీసీ బజాజ్‌ మేక్సిమా వాహనాల సంస్థను సంప్రదించింది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణించడానికి వీలుగా ఆటోలను డిజైన్‌ చేసివ్వాలంటూ కోరింది.

అంబురెక్స్‌ పేరుతో...

బజాజ్‌మేక్సిమా వాహనాలను అవసరానికి తగ్గట్లుగా డిజైన్‌ చేసి, వాటికి ఆటో అంబులెన్స్‌లుగా పేరు పెట్టింది. ‘అంబురెక్స్‌’గా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో తయారుచేసిన ఈ వాహనాలను పేదల కోసం వినియోగించేలా చేయడానికి పలు ఎన్జీవోలను సంప్రదించింది.  సమీప ఆసుపత్రుల నిర్వాహకులనూ కలిసింది. అలా వారందరితో చర్చించి, ఆ వాహనాలను వారికి ఉచితంగా అందించింది. రోగుల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా సేవలందించడానికి మాత్రమే వినియోగించాలంటూ కోరింది.

సకల సౌకర్యాలతో

ఈ వాహనాల్లో రోగులకు అవసరమయ్యే సౌకర్యాలన్నీ ఉన్నాయంటుంది రాధిక. ‘స్ట్రెచర్‌, సహాయకుడు కూర్చోవడానికి సీటు, ఆక్సిజన్‌ సిలిండర్‌, డ్రిప్‌ హుక్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు, ఫ్యాన్‌తోపాటు అనుకోని అగ్ని నివారణ పరికరం వంటి సౌకర్యాలన్నీ ఉండేలా తీర్చిదిద్దాం. రోగులకు, వాహనాన్ని నడిపే వారికి విడివిడిగా క్యాబిన్లు ఉండేలా చేశాం. బజాజ్‌ సంస్థకు నేను ఇచ్చిన డిజైన్‌కు మరికొంత మెరుగులు దిద్ది మరీ వారు తయారుచేసి అందించడం సంతోషంగా అనిపించింది. ఈ వాహన తయారీ ఆలోచన వచ్చిన వారం రోజుల్లోపే విరాళాలు రావడం, నెలలోపే అనుకున్నట్లుగా అంబులెన్స్‌లు సిద్ధం కావడం... అంతా చాలా వేగంగా పూర్తయింది. ప్రస్తుతం ఇవన్నీ అవసరమైన వారికి సేవలు అందిస్తూ, ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నాయి. మరిన్ని వాహనాలను చేయించి రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలన్నింటికీ అందించాలన్నదే నా లక్ష్యం’ అని చెబుతున్న రాధిక మరెందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్