చిట్టి గుండెకు అండ..పలక్!

మధురమైన గాత్రమే కాదు..  మంచి మనసూ ఆమె సొంతం. తన పాటల ద్వారా వచ్చిన సంపాదనని పసి గుండెలను కాపాడటానికి ఖర్చుపెడుతోందామె.. ఆమె స్ఫూర్తి పాఠాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చింది..  ఆమే యువగాయని పలక్‌ ముచ్చల్‌..

Published : 09 Jul 2021 00:35 IST

మధురమైన గాత్రమే కాదు..  మంచి మనసూ ఆమె సొంతం. తన పాటల ద్వారా వచ్చిన సంపాదనని పసి గుండెలను కాపాడటానికి ఖర్చుపెడుతోందామె.. ఆమె స్ఫూర్తి పాఠాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చింది..  ఆమే యువగాయని పలక్‌ ముచ్చల్‌..

దేళ్ల కుర్రాడు. తను వేసుకున్న చిరుగుల షర్టుని తీసి.. దాంతోనే రైల్లో ప్రయాణికులు తిని పారేసిన చెత్తను ఊడుస్తూ దీనంగా డబ్బు యాచిస్తున్నాడు. ఆ కుర్రాడినే గమనిస్తున్న మరో చిన్నారి పలక్‌ హృదయం ఇదంతా చూసి తల్లడిల్లింది. అలాంటి వాళ్ల కోసం ఏమైనా చేయాలని అప్పుడే అనుకుంది. గాయని అయిన పలక్‌ తనలోని అద్భుతమైన కళానైపుణ్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజంలోని కష్టాలనీ, కన్నీళ్లనీ కొంతైనా తగ్గించాలనుకుంది. ఈ పాటల పూబంతి 1992లో ఓ మార్వాడీ కుటుంబంలో పుట్టింది. తండ్రి రాజ్‌కుమార్‌ ముచ్చల్‌ ప్రయివేటు ఉద్యోగి. తల్లి అమిత గృహిణి. పలక్‌ తన పాటల ప్రస్థానాన్ని నాలుగేళ్ల వయసు నుంచే మొదలుపెట్టింది. స్కూల్లో ఓసారి లతామంగేష్కర్‌ పాట పాడి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాంతో ఆమె తల్లిదండ్రులు సంగీత స్కూల్లో చేర్పించి ఆమెలోని ఆసక్తికి మెరుగులు దిద్దారు. ఏడేళ్ల వయసులో కార్గిల్‌ యుద్ధ (1999)సమయంలో ఇండోర్‌లోని ప్రతి దుకాణం ముందు పాటలు పాడి సైనిక కుటుంబాల కోసం పాతికవేల రూపాయల విరాళాలు సేకరించి, అందరి మనసులు గెల్చుకుంది. ఆ తర్వాత ఇండోర్‌లో తను చదువుకుంటున్న నిధి వినయ్‌ మందిర్‌ స్కూల్లోని తన తోటి విద్యార్థి లోకేష్‌ గుండె ఆపరేషన్‌ కోసం పాటలు పాడి యాభైవేల రూపాయలు సేకరించింది. ఆ అబ్బాయి తండ్రిది చిన్న చెప్పుల దుకాణం. శస్త్రచికిత్సకు అయ్యే డబ్బు వాళ్ల దగ్గర లేకపోవడంతో పలక్‌ ముందుకొచ్చి ఈ మంచి పని చేసింది. ఇదంతా తెలుసుకొన్న ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్‌ దేవిప్రసాద్‌శెట్టి ఆ బాబుకు ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. సేకరించిన విరాళాన్ని లోకేష్‌లా గుండెజబ్బుతో బాధపడుతున్న ఎవరికైనా అందిద్దామని పలక్‌ అమ్మానాన్నలు స్థానిక పత్రికలో ఓ ప్రకటన ఇచ్చారు. దాన్ని చూసి చాలామంది మాకంటేమాకంటూ సాయం కోరారు. దాంతో పలక్‌ వాళ్లందరి కోసం మళ్లీ పాడాల్సి వచ్చింది. అలా ఒకరి కోసం మొదలైన ఆమె పాటల ప్రయాణం ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. 2000 ఏడాది నుంచి తన తమ్ముడితో కలిసి గుండెజబ్బులున్న పిల్లలకోసం ‘దిల్‌ సే దిల్‌ తక్‌’  పేరుతో దేశ, విదేశాల్లో ప్రదర్శనలిస్తోంది. గజల్‌్్స, భక్తిగీతాలతోపాటు సినిమా పాటలూ పాడుతుందీ అమ్మాయి. హిందీ, సంస్కృతం, గుజరాతీ, అసోమీ, పంజాబీ, కన్నడ, తెలుగు, తమిళం సహా 18 భాషల్లో అద్భుతంగా పాడగలదు. ఓ పక్క పాటలు పాడుతూనే మరోపక్క తన చదువునీ కొనసాగించింది. ఇండోర్‌లోని ‘క్వీన్స్‌’ కాలేజ్‌లో బీకామ్‌ పూర్తిచేసింది.

ఫౌండేషన్‌ స్థాపించి..
‘పలక్‌ ముచ్చల్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో థియేటర్‌లోకి వైద్యులు ఆమెను అనుమతిస్తుంటారు. విరాళాల ద్వారా వచ్చిన డబ్బు నుంచి ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోదు. బాగయిన పిల్లల దగ్గర నుంచి ఓ అందమైన బొమ్మను మాత్రం కానుకగా తీసుకుంటుంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తన పేరిట ఒక పాఠ్యాంశాన్ని రూపొందించడం సంతోషంగా ఉందని అంటోందామె. ‘ఎదుటి వ్యక్తి ఆనందానికి మనం కారణమనే విషయం ఎంతో సంతృప్తినిస్తుంది. దాన్ని మాటల్లో చెప్పలేం. నేను అలాంటి ఆనందాన్ని చాలాసార్లు పొందాను. ఇప్పుడు నా గురించి చిన్నారులు చదివి ప్రేరణ పొందితే అంతకంటే సంతోషమేముంటుంది’ అంటోంది పలక్‌.


బాలీవుడ్‌లో అవకాశాల కోసం 2006లో పలక్‌ కుటుంబం ఇండోర్‌ నుంచి ముంబయికి వచ్చింది. 2011 నుంచీ హిందీ సినిమాల్లో పాటలు పాడటం మొదలుపెట్టింది. 2012లో విడుదలైన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. సుమారుగా 2200 మంది చిన్నారులకు తన పాటలతో అండగా నిలబడిందీమె. తన ఈ సేవ ద్వారా గిన్నిస్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులని సొంతం చేసుకుంది.
* ఏక్‌ థా టైగర్‌, ఆషికీ2, కిక్‌, యాక్షన్‌ జాక్సన్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, ఎం.ఎస్‌.ధోనీ: ద యునైటెడ్‌ స్టోరీ, కాబిల్‌, బాగీ2, పల్‌ పల్‌ దిల్‌ కె పాస్‌లోని పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘నీ జతగా నేనుండాలి’, సైజ్‌జీరో, ఎం.ఎస్‌.ధోనీ వంటి చిత్రాల్లో పాడి తెలుగు ప్రేక్షకులకూ చేరువైంది.


తోటి మహిళలకు సాయపడాలనే సంకల్పం, సేవ చేయాలనే ఆశయం ఉండాలే గానీ ఎవ్వరూ ఆమెని ఆపలేరు, అడ్డుకోలేరు.

- మరియాన్‌ విలియంసన్‌, రచయిత్రి, రాజకీయవేత్త

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్