ఆరోగ్యమే కాదు విజయం కూడా!

తల్లులందరిదీ ఒకటే ఫిర్యాదు.. పిల్లలు సరైన తిండి తినడంలేదని. ఈ అంశమే రుక్మిణిని ఆలోచింపచేసింది. చిన్నారులకు రుచి, ఆరోగ్యాన్నీ ఇచ్చే స్నాక్స్‌ తయారీకి పురికొల్పింది.

Published : 12 Jul 2021 01:45 IST

తల్లులందరిదీ ఒకటే ఫిర్యాదు.. పిల్లలు సరైన తిండి తినడంలేదని. ఈ అంశమే రుక్మిణిని ఆలోచింపచేసింది. చిన్నారులకు రుచి, ఆరోగ్యాన్నీ ఇచ్చే స్నాక్స్‌ తయారీకి పురికొల్పింది. తొలుత అపజయమే ఎదురైంది. అయినా నిరాశపడక పునరాలోచించింది. ఈసారి పిల్లలకు తెగ నచ్చేశాయి. ఇంకేముంది.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారవేత్తగా మారిపోయారామె.

కోల్‌కతాలో పుట్టిపెరిగిన రుక్మిణీ బెనర్జీ పుణేలో ఎల్‌ఎల్‌బీ, లండన్‌లో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. చదువు కాగానే ముంబయి వచ్చి స్థిరపడ్డారు. పదేళ్లు అనేక సంస్థల్లో పని చేశారు. 2017లో ప్రసూతి సెలవులో ఉండగా ఖాళీ సమయం దొరికింది. చుట్టూ చాలా మంది పిల్లలు మాటిమాటికీ అనారోగ్యాలతో బాధపడటం చూశారు. చిన్నప్పుడు తనకెప్పుడూ అలా కాలేదంటే కారణం తిండే. పిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందిస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుంది, చక్కగా ఎదుగుతారు- అనుకుంది. బాబు పుట్టాక హెల్దీ స్నాక్స్‌ దొరుకుతాయేమోనని చూస్తే.. ప్యాకెట్ల మీద రాతలకూ యదార్థానికీ చాలా తేడా ఉంది. వాటిల్లో ఉపయోగించే పంచదార, పిండి, నూనె లాంటివేవీ మేలు చేసేవి కాదని తేలింది. తానే చిరుతిళ్లు తయారు చేయాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ‘తల్లులందరికీ పిల్లలు పొడవు అవ్వాలని ఉంటుంది. అందుకే జిరాఫీ గుర్తొచ్చి ‘ది గ్రోయింగ్‌ జిరాఫీ’ (టీజీజీ) పేరును ఎంచుకున్నా’నంటారు.

అడ్డంకులూ సవాళ్లూ
ఆమె ఆలోచన పిల్లలకు పరిశుభ్రమైన పోషకాహారం అందించడం. ఆ పని తన వంటింట్లోనే ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని పండ్లరసాలు, సలాడ్‌లు, బీట్‌రూట్‌ ఇడ్లీ లాంటివి సప్లయ్‌ చేయాలనుకున్నారు. అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉన్న ఇళ్లల్లో ఇలాంటివి ఆర్డర్‌ చేయాల్సిన పనేముంది, తామే చేసిస్తారు. రుక్మిణి దృష్టి కుకీస్‌ మీదికి దృష్టి మళ్లింది. దాంతో వాటి తయారీ కోర్సులో చేరి ‘హెల్దీ కుకీస్‌, న్యూట్రిషస్‌ బార్స్‌’ బేకింగ్‌ పద్ధతి నేర్చుకున్నారు. రెండు లక్షల రూపాయలతో టీజీజీ ప్రారంభించారు. అందులో ఎక్కువ శాతం కంపెనీ లోగోకి, వెబ్‌సైట్‌ రూపొందించడానికీ ఖర్చయ్యింది. స్నేహితులు కుకీస్‌ మరింత మెత్తగా ఉండాలని, తీపికోసం బెల్లం బదులు తేనె వాడమని సలహాలిచ్చేవారు. ఏడాది గడిచినా వ్యాపారం నీరసంగానే సాగింది. బిజినెస్‌ సాగదేమో అనుకున్నప్పుడు పునరాలోచించారు. ‘కుకీస్‌ చాలామంది చేస్తున్నారు. కొన్ని ఉత్పత్తులు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. వాటిల్లో కొన్ని తానే తినకుండా ఉండలేకపోతోంది. కనుక తాను వాటికి భిన్నమైన రుచులతో తయారు చేస్తే ఫలితం ఉంటుంది’ అనిపించింది. అది అక్షరాలా నిజమైంది. రాగులు, పల్లీలు, బాదం, ఓట్స్‌తో తయారవుతోన్న స్నాక్స్‌ పిల్లలకూ పెద్దలకూ కూడా నచ్చేస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రకటనల కోసం ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఎందరో కస్టమర్లు చక్కటి ఫీడ్‌బ్యాక్‌ ఇస్తున్నారు. తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల్లో స్వచ్ఛందంగా టీజీజీ బ్రాండ్‌ గురించి రాస్తున్నారు. అవన్నీ ఆమె వ్యాపారాన్ని మరింత పెంచాయి. మార్కెటింగ్‌ అంశాల్లో తర్ఫీదిచ్చే ‘బూట్‌ క్యాంప్‌’లో మెలకువలు నేర్చుకుని విజయవంతంగా వ్యాపారం సాగిస్తున్నారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్