చేనేత మహిళల వరం స్వర

చిన్నతనం నుంచీ నేత పని చూస్తూ చేస్తూ పెరిగిన అమ్మాయిలకు అదేమీ కష్టమైన పనికాదు. కానీ వస్త్రాలను వేరే ఊళ్లకు తీసికెళ్లి అమ్మడమే చేతకాదు.

Published : 15 Jul 2021 00:29 IST

చిన్నతనం నుంచీ నేత పని చూస్తూ చేస్తూ పెరిగిన అమ్మాయిలకు అదేమీ కష్టమైన పనికాదు. కానీ వస్త్రాలను వేరే ఊళ్లకు తీసికెళ్లి అమ్మడమే చేతకాదు. మార్కెటింగ్‌ వేరెవరైనా చూసుకుంటే వాళ్ల బతుకులు మెరుగవుతాయనుకున్న ఆశా స్కారియా ఏం చేసిందో చూద్దాం...

ఆశా కేరళ కొట్టాయం స్కూల్లో చదివింది. చదువులోనే కాదు, ఆట పాటల్లోనూ చురుగ్గా ఉండేది. ముంబైలో డిగ్రీ అయ్యాక ఆక్స్‌ఫర్డ్‌లో ఎంబీఏ చేసింది. ‘మహిళల కోసం.. మహిళలతో..’ అనేది ఆమె స్లోగన్‌. గ్రామీణ మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించడం ఆమె ధ్యేయం. అలా మహిళా సాధికారత కోసం బ్రాండెడ్‌ వస్త్రాలయం ‘స్వర.. వాయిస్‌ ఆఫ్‌ విమెన్‌’ ఆరంభించింది. స్త్రీపురోగతి లక్ష్యంగా పని చేస్తోంది. చేనేత మహిళా కార్మికులకు చేయూత నందించేందుకు సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌.. సెవాతో చేతులు కలిపింది. ఉపాధి కల్పించడమే కాదు, వాళ్ల ఉన్నతి కోసమూ ప్రయత్నిస్తోంది.

సెవా చేసిన సాయం, ఇచ్చిన స్వేచ్ఛతో పశ్చిమ బెంగాల్‌ మహిళలు రంగురంగుల వస్త్రాలు నేస్తున్నప్పుడు.. వాటికి భిన్నంగా ఉండాలని ఆశా నీలిరంగు మీద దృష్టిపెట్టింది. నీలం డిజైన్లతో చీరలు, డ్రెస్సులు విస్తారంగా రూపొందించి తమ బ్రాండ్‌కు గుర్తింపు తెచ్చింది. బంధుమిత్రులంతా ఒకే రంగువి కొనుక్కోవడం లేదా సెలవురోజున ఒకే రంగులో కనిపించడం లాంటి సరదాను తీర్చింది. తర్వాత రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ మహిళలతో కలిసి పని చేస్తున్నప్పుడు నేతచీరల ‘ధాగా’ కలక్షన్‌ తీసుకొచ్చింది. వాటిక్కూడా అంతే క్రేజ్‌ వచ్చింది. వయసు దృష్ట్యా వచ్చిన ‘బోల్డేజ్‌’ చీరలు బోల్డన్ని మార్కులు కొట్టేశాయి. ఆపైన అకోలా గ్రామ స్త్రీలు రూపొందించే కలంకారీ తరహా చేతి ముద్రల మెటీరియల్‌ ప్రయత్నిస్తే అదీ సత్ఫలితాన్నే ఇచ్చింది. తాము రూపొందించేవి ప్రజలకు నచ్చుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తుంది ఆశా. అలా ఒక దాని తర్వాత ఒకటిగా ప్రయోగాలు చేస్తూ వారెవ్వా అనిపించుకుంది.

ఆశాకి మధ్య దళారులు అక్కర్లేదు. డైరెక్టుగా చేనేత కార్మికులనే కలుస్తుంది. ఈ మహిళలు ఇళ్లల్లోనే నేస్తారు. స్వావలంబన లక్ష్యంగా పని చేస్తారు. ఆశా ప్రోత్సాహంతో వారి సృజనకు గుర్తింపూ గౌరవం దక్కాయి. తమవైన డిజైన్లతో భేషనిపించుకున్నారు. మోనిక, రూపాలి, జోత్స్న, అష్మైరా, అమృత, అంజలిలు రూపొందించిన డిజైన్లు వాళ్ల పేర్లతోనే ప్రసిద్ధమయ్యాయంటేనే అర్థమవుతుంది, ఆమె ప్రోత్సాహం ఎంతటిదో. ఫ్యాషన్‌ ప్రపంచంలో ‘స్వర కలక్షన్స్‌’ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. మహిళలకు ఆదాయంతోబాటు ఆత్మసంతృప్తినీ ఇస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త పంథాను అనుసరిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ సక్సెస్‌ బాటలో నడుస్తోంది. ఎందరో ఉపాధిలేక నిరాశ పడుతున్న కరోనా తరుణంలోనూ ఆశా ధైర్యంగానే ఉంది. ప్రస్తుతం షాపులకు వెళ్లకుంటేనేం.. ఆన్‌లైన్‌ ఉందిగా అనుకుంది. చేనేత మహిళలూ అంతే ఉత్సాహంతో తమ సృజనకు పదునుపెడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్