కాలును కోల్పోయానే కానీ... నమ్మకాన్ని కాదు

క్యాన్సర్‌తో తల్లి కన్నుమూసింది. అదే క్యాన్సర్‌ తన కాలును మింగేసింది. అయినా ధైర్యంగా చిరునవ్వుతో జీవనయానాన్ని కొనసాగిస్తోందా అమ్మాయి. ‘‘విధి నా జీవితంతో ఆడుకున్నప్పుడల్లా నమ్మకమే నన్ను బాధ నుంచి బయట

Updated : 22 Jul 2021 14:48 IST

క్యాన్సర్‌తో తల్లి కన్నుమూసింది. అదే క్యాన్సర్‌ తన కాలును మింగేసింది. అయినా ధైర్యంగా చిరునవ్వుతో జీవనయానాన్ని కొనసాగిస్తోందా అమ్మాయి. ‘‘విధి నా జీవితంతో ఆడుకున్నప్పుడల్లా నమ్మకమే నన్ను బాధ నుంచి బయట పడేసింది. క్యాన్సర్‌కి నా కాలును బలి ఇచ్చాను కానీ, నమ్మకాన్ని కాదు’’ అంటూ తను కష్టాల్ని అధిగమించిన తీరును మదురైకి చెందిన కీర్తన ‘వసుంధర’తో పంచుకుందిలా...

నేను పుట్టిన కొద్ది రోజులకే గర్భాశయ క్యాన్సర్‌ సోకి మా అమ్మ కన్నుమూశారు. నాన్న ఆటోడ్రైవర్‌. నన్ను తాత, అవ్వ, అత్త  అల్లారు ముద్దుగా పెంచారు. పదో తరగతి చదువుతున్నప్పుడు నాన్న కూడా పోయారు. చదువు మాత్రమే చివరి వరకు నీకు తోడుగా వస్తుంది.. నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో చదువు... నేను చదివిస్తాను అంటూ నాకు నమ్మకం కలిగించింది మేనత్త. అమ్మ కన్ను మూసిన కారణం తెలుసుకున్నప్పటి నుంచే నాకు వైద్యానికి సంబంధించిన కోర్సు చదవాలని, రోగులకు సేవలందించాలని ఆశ కలిగింది. ‘ప్లస్‌వన్‌’లో నర్సింగ్‌ గ్రూప్‌ తీసుకున్నా. తర్వాత నర్సింగ్‌లో డిప్లొమా చేశాను. ఆ సమయంలో నా ఎడమ కాలికి తరచుగా నొప్పి వచ్చేది. రోజులు గడిచే కొద్దీ నొప్పి ఎక్కువైంది. కాలునల్లగా మారి చీము కారడం ప్రారంభమైంది. ఆసుపత్రికి వెళ్తే క్యాన్సర్‌ అన్నారు డాక్టర్లు. క్యాన్సర్‌ గడ్డ చిన్నదిగా ఉందని ఆపరేషన్‌ చేస్తే సరిపోతుందన్నారు. అప్పుచేసి ఆపరేషన్‌ చేయించుకున్నాను. పూర్తిగా నయమైందని అనుకుంటుండగా మళ్లీ నొప్పి ప్రారంభమైంది. కొత్తగా మరో క్యాన్సర్‌ గడ్డ ఏర్పడిందని చెప్పారు. దానికీ ఆపరేషన్‌ చేశారు. తర్వాత మూడు నెలలకే క్యాన్సర్‌ కణాలు కాలంతా వ్యాపించాయి. ఇక ఎడమ కాలిని పూర్తిగా తొలగించాలని చెప్పారు. ఒక్కసారిగా కుంగిపోయాను. ఇక నా జీవితం ముగిసి పోయిందని భావించాను. వయసైన తాత, అవ్వలను కష్టపెడుతున్నామన్న భావన నాలో ఏర్పడింది. అప్పుడు.. నేను ధైర్యంగా ఉంటేనే వారు ఎప్పటిలాగా ఉంటారని భావించి నాకు నేను ధైర్యం చెప్పుకోవడం ప్రారంభించాను. ప్రత్యేక ప్రతిభావంతుల వీడియోలను చూసి స్ఫూర్తి పొందాను. ఆపరేషన్‌ పూర్తయి ఇంటికి వచ్చిన నన్నుచూసి ప్రతి ఒక్కరూ జాలి పడ్డారు. నా కంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోవాలన్న పట్టుదలను పెంచుకున్నాను. రెండు నెలల విశ్రాంతి అనంతరం ఒక్క కాలితో నడక సాధన మొదలుపెట్టాను. అప్పుడు నాకు కృత్రిమ కాలు అమర్చే ఏర్పాటు చేసింది అత్త. కానీ ఏడు కిలోల బరువు ఉన్న కృత్రిమ కాలుతో నడవటం వలన తీవ్రమైన వెన్నునొప్పి వచ్చేది. అయితే  నా కష్టాలు తెలిసిన అప్పటి తిరుప్పరం కుండ్రం ఎమ్మెల్యే శరవణన్‌ బరువు తక్కువగా ఉన్న కృత్రిమకాలు అమర్చేందుకు సహాయం చేశారు. ఆ కాలితో నడక ప్రారంభించాను. ఆ సమయంలోనే కరోనా వ్యాపించడం ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో తాత్కాలికంగా నర్సులను విధుల్లో చేర్చుకునేందుకు ఆహ్వానించారు. అప్పుడు నేను శిక్షణ పొందిన ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక నర్సుగా అవకాశం ఇమ్మని వినతిపత్రం ఇచ్చాను. ప్రత్యేక ప్రతిభావంతురాలిని అన్న కారణంగా నన్ను తీసుకోలేదు. అయితే నేను నిరాశ పడలేదు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేరాను. కరోనా ప్రారంభమైన మొదట్లో కరోనా వార్డులోకి వెళ్లేందుకే అందరూ భయపడే వారు. కానీ నేను ధైర్యంగా కరోనా వార్డులో నియమించాలని కోరి మరీ విధులు నిర్వర్తించాను. ఆ వార్డులో ఎవరూ నాలో లోపాన్ని చూడలేదు. అప్పటి వరకు నన్ను జాలిగా చూసిన అందరూ నన్ను చూసే కోణం మార్చుకున్నారు. నా ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు నేనూ ఓ ఫ్రంట్లైన్‌ వర్కర్‌ అని చెప్పుకుంటున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.

- శివకుమార్‌, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్