మేఘాలలో తేలిపోతున్నది...

ఎత్తైన భవనంపైకెక్కి కిందకు చూడాలంటేనే భయం కలుగుతుంది. అటువంటిది ఈమె భూమి నుంచి వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ సాహసాలు చేస్తోంది.

Published : 27 Jul 2021 02:35 IST

ఎత్తైన భవనంపైకెక్కి కిందకు చూడాలంటేనే భయం కలుగుతుంది. అటువంటిది ఈమె భూమి నుంచి వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ సాహసాలు చేస్తోంది. స్కైడైవింగ్‌ క్రీడలో లైసెన్స్‌ ఉన్న నాలుగో మహిళగా మన దేశంలో చరిత్ర సృష్టించడమే కాదు, గుజరాత్‌ నుంచి తొలి మహిళగానూ.. నిలిచింది. ప్రపంచంలో ఏ దేశాన్నుంచైనా నింగిలో విహంగంలా స్కైడైవింగ్‌కు అనుమతిని పొందిన 29ఏళ్ల శ్వేత పర్మర్‌ గురించి తెలుసుకుందాం.

శ్వేతకు బాల్యం నుంచి సాహసాలంటే ఆసక్తి. చిన్నప్పుడే బైకు, కారు వంటివన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించేది. వడోదరాకు చెందిన మధ్యతరగతి కుటుంబం వీరిది. తండ్రి వ్యాపారి, తల్లి గృహిణి. తను కాలేజీలో ఉన్నప్పుడు అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచీ ఆర్థిక సమస్యలెదురయ్యాయి. అయినా చదువులో మాత్రం వెనకడుగు వేయలేదీమె. మంచి మార్కులతో ఉపకార వేతనాన్ని సాధించి, బరోడాలోని ఎమ్మెస్‌ విశ్వ విద్యాలయంలో ఎంబీఏ చేసింది. తర్వాత అన్నయ్యతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించింది. ఓ ప్రైవేటు సంస్థలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ)గా కూడా పని చేస్తోంది. 

లక్ష్యంగా... సాహస క్రీడల్లో శిక్షణ పొందాలనే ఆలోచన శ్వేతను వెంటాడుతూనే ఉండేది. స్కైడైవింగ్‌ గురించి తెలుసుకుని, దాన్నే ఎంచుకుంది. ఎప్పటికైనా ఆకాశంలో ఎగరాలనే ఆకాంక్షతో వివరాలను సేకరించింది. విదేశాల్లో తీసుకోవాల్సిన శిక్షణకు అయ్యే ఖర్చును పొదుపు చేసింది. స్పెయిన్‌లో స్కైడైవింగ్‌ నేర్పే ఓ సంస్థలో 2016లో చేరింది శ్వేత. ‘ఈ రంగంలో మన దేశం నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలే లైసెన్స్‌ పొందారు. థియరీ  తర్వాత ఎగరడంలో శిక్షణనందిస్తారు. శిక్షకుడి పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుంది.  మొదటి సారి పైకి ఎగురుతున్నప్పుడు ఓవైపు ఉత్సాహంగా, మరోవైపు భయంగా అనిపించింది. భయాన్ని వీడి ధైర్యంగా ఆలోచించడం మొదలుపెట్టా. అప్పటికీ ఒకసారి ల్యాండ్‌ అయ్యేప్పుడు బ్యాలెన్స్‌ తప్పి, ఎముక విరిగింది. కోర్సు చివర్లో శిక్షకుడు లేకుండా సొంతంగా ఎగిరే స్థాయికి చేరా. ఒక పక్షిలా ఫీలయ్యా. వేల అడుగుల ఎత్తు నుంచి కిందనున్న భూమిని చూడటం చాలా అద్భుత దృశ్యం. తొలిసారి ట్రైనర్‌ సాయంలేకుండా స్కైడైవ్‌ చేస్తున్నప్పుడు నా కల తీరిందనిపించింది. ఈ కోర్సులో లెవెల్స్‌ ఉంటాయి. ఎనిమిదింటిని పూర్తిచేయాలి. 29 సార్లు సొంతంగా జంప్స్‌ చేయగలగాలి. ప్రతి జంప్‌కు రూ.35 వేలు చెల్లించాలి. వీటన్నింటిలో ఉత్తీర్ణత సాధించి, రాత పరీక్షకు హాజరయ్యా. అందులో పాస్‌ అయిన తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ పారాచూట్‌ అసోసియేషన్‌ (యుఎస్‌పీఏ) నుంచి స్కైడైవింగ్‌లో లైసెన్స్‌ను పొందగలిగా. త్వరలో ఉమెన్‌ స్కైడైవర్స్‌ లీగ్‌లో పాలుపంచుకో గలుగుతున్నా. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాన్నుంచైనా స్కైడైవింగ్‌ చేయడానికి నాకు అనుమతి ఉంది. ప్రస్తుతం స్పెయిన్‌తోపాటు దుబాయి, రష్యాల్లో స్కైడైవింగ్‌ చేశా. గుజరాత్‌ నుంచి తొలి మహిళా స్కైడైవర్‌గా రికార్డు సాధించాను. చిన్నప్పటి తన కలలను నెరవేర్చుకుంటూ మన దేశానికి చెందిన మహిళా స్కైడైవర్స్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత రచెల్‌ థామస్‌, షీతల్‌ మహాజన్‌, అర్చనా సర్దానా సరసన నేనూ చేరడం చాలా సంతోషాన్ని కలిగించింది. పట్టుదల, ధైర్యంతో మహిళలు ఏదైనా సాధించగలరనడానికి నేనే ఉదాహరణ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్