Published : 31/07/2021 03:23 IST

కదలలేకపోయినా కళ ఉంది!

ఆమెను మంచానికి పరిమితం చేసింది... చేతి వేళ్లు తప్ప అవయావాలేవీ పనిచేయకపోయినా ఆమెలోని సృజనాత్మకత మాత్రం కళారూపాలను తయారు చేయిస్తోంది . కాళ్లపై నిలవలేకపోయినా... చిరువ్యాపారిగా మారి ఆర్థికస్వాలంబన సాధిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది కర్ణాటకకు చెందిన మీనా.

శివమొగ్గ జిల్లాలోని హోసహల్లికి చెందిన మీనా కండరాల వ్యాధితో పుట్టింది. బాల్యంలో కష్టపడి నాలుగడుగులు వేయగలిగినా, క్రమేపీ కండరాలు బలహీనపడటం మొదలైంది. దాంతో కొంత కాలానికే నడవలేని స్థాయికి చేరింది. అయితే చదువుకోవాలనే పట్టుదలతో అప్పటికే పదోతరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత పూర్తిగా మంచానికే పరిమితమవడంతో ఒంటరి జీవితానికి అలవాటుపడింది. ఆ ఒంటరితనమే ఆమెలోని కళాకారిణిని బయటకు తీసుకొచ్చింది. కళపై ప్రేమను అభిరుచిగా మార్చుకుంది మీనా.

తోటివారి చేయూత లేనిదే చిన్న పని కూడా చేసుకోలేని ఆమె తనలోని నిరాశను కళవైపు తిప్పుకొంది. దాంతో యూట్యూబ్‌లో కలర్స్‌ను ఉపయోగించడం, బొమ్మలు గీయడమెలాగో గ్రహించింది. అలాగే గృహోపలంకరణ వస్తువుల తయారీపై ముంబయి ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ నుంచి కోర్సు పూర్తి చేసింది. అలా తాను తీసుకున్న శిక్షణతో సొంతంగా కళారూపాలను వేయడం మొదలుపెట్టింది. కీ, ఫొటో, వాల్‌ హోల్డర్స్‌, కీ బంచ్‌ హ్యాంగర్స్‌, వాచ్‌ బాక్సులు, బాటిల్‌ వర్క్‌  వంటివన్నీ రూపొందిస్తోంది. సెరామిక్‌ గ్లాస్‌ టెక్నిక్‌, మీడియం డెన్సిటీ ఫైర్‌బోర్డ్‌ వంటి వాటిలో నైపుణ్యాన్ని పొందడంతో ఈ తరహా కళారూపాలను తయారు చేయగలుగుతున్నా అంటోంది. ‘24 గంటలూ మంచంపైనే ఉండే నేను అమ్మా నాన్నలకు భారం కాకూడదనుకున్నా. అందుకే మనసుకు నచ్చిన కళను కష్టమైనా కూడా నేర్చుకున్నా. దాన్నే ఉపాధిగా మార్చుకున్నా. ఈ ఆలోచనను నా స్నేహితులు చెప్పారు. ఆన్‌లైన్‌లో నేను చేసిన కళారూపాల ఫొటోలను పొందు పరచడం ద్వారా చాలామంది నన్ను సంప్రదిస్తున్నారు. అలా ఇప్పుడు మన దేశం, విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితే ఒక్కో కళారూపాన్నీ తీర్చిదిద్దడానికి గంటల సమయం పడుతుంది. అయినా సహనంగా పూర్తి చేస్తుంటా. ప్రతి రోజూ కొత్త కొత్త టెక్నిక్స్‌నూ కనిపెడుతూ ఉంటా. వాటిని మరొక దాంట్లో వినియోగిస్తా. నాలా ఉండే వారికి నేను స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా. పట్టుదల ఉంటే ఎటువంటి అనారోగ్యమూ మన లక్ష్యాన్ని మాత్రం ఓడించలేదు’ అని గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెబుతోంది మీనా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని