నువ్వే నా ప్రాణం నేస్తమా!

ఎన్ని బంధాలున్నా, ఎంతమంది బంధువులున్నా స్నేహబంధం ప్రత్యేకం. ఒకసారి కన్నీరు తుడిచే చేయైతే.. ఇంకోసారి భుజం తట్టే ప్రోత్సాహమవుతారు. అందుకే స్నేహితులూ కుటుంబంలో భాగమేనంటారు చాలామంది. అందుకు మేమూ మినహాయింపు కాదంటున్నారు మన తారలు. తమ స్నేహితులు తమ జీవితంలో ఎంత ముఖ్యమో మనతో పంచుకుంటున్నారు.

Updated : 01 Aug 2021 05:20 IST

నేడు స్నేహితుల దినోత్సవం

ఎన్ని బంధాలున్నా, ఎంతమంది బంధువులున్నా స్నేహబంధం ప్రత్యేకం. ఒకసారి కన్నీరు తుడిచే చేయైతే.. ఇంకోసారి భుజం తట్టే ప్రోత్సాహమవుతారు. అందుకే స్నేహితులూ కుటుంబంలో భాగమేనంటారు చాలామంది. అందుకు మేమూ మినహాయింపు కాదంటున్నారు మన తారలు. తమ స్నేహితులు తమ జీవితంలో ఎంత ముఖ్యమో మనతో పంచుకుంటున్నారు.

ఆ ముగ్గురూ ఉంటే చాలు!

- నందితాశ్వేత

నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ సౌమ్య, హేమలత, అజయ్‌. వీళ్లు మా కుటుంబ సభ్యుల్లాగే. సౌమ్య నా స్కూల్‌ ఫ్రెండ్‌. నాకంటే రెండేళ్లు పెద్దది. మా స్నేహం 17 ఏళ్లుగా కొనసాగుతోంది. నన్ను నిత్యం కనిపెట్టుకొని ఉంటుంది. తను దూరంగా ఉన్నా ఫోన్‌ చేసి మాట్లాడితే చాలు మనసు  తేలికపడుతుంది. వీళ్లు ముగ్గురూ లేకుండా ఉండలేను. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి సినిమాల్లో నటిస్తున్నానంటే వాళ్లు నాకు అండగా ఉండబట్టే. సినీ పరిశ్రమలో ఐశ్వర్య రాజేశ్‌ నాకు మంచి స్నేహితురాలు. నేను, తనూ ఒకే తమిళ సినిమా ద్వారా పరిచయం అయ్యాం. మిగతా వాళ్లందరితో కూడా స్నేహం ఉంటుంది. స్నేహితులంటే విందులు, వినోదాలకు వచ్చే వాళ్లే కాదు. మన సంతోషం, దుఃఖంలో పాలుపంచుకోవాలి. విలువైన స్నేహితులు ఇద్దరు ఉన్నా చాలని కోరుకుంటా.


వాళ్ళను చూశాకే...

- శివాత్మిక రాజశేఖర్‌

నాకు చాలా తక్కువ స్నేహితులున్నారు. మా సోదరి శివాని, ఇషా రెబ్బా మంచి స్నేహితులం. ఇంకా కొంతమంది దగ్గరి స్నేహితులుంటారు. చిన్నప్పటి నుంచీ శివానీ ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్‌. నాకంటూ వేరే గ్రూప్‌ ఉండేది కాదు. తను ఎవరితో ఉంటే వాళ్లే నా ఫ్రెండ్స్‌ అయిపోయేవాళ్లు. చిన్నవయస్సులో అమ్మానాన్నలతో ఎక్కువగా షూటింగ్స్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడిప్పుడే కొంతమంది అమ్మాయిలతో స్నేహం ఏర్పడింది. కొత్త వాళ్లు ఏవరైనా ఫ్రెండ్స్‌ ఉన్నారంటే అది ఇషారెబ్బా. తనతో మూడేళ్లుగా స్నేహం ఉంది. ఒక అవార్డు షోలో తనతో బాగా పరిచయం ఏర్పడింది. నేనొక షూటింగ్‌కు వెళ్లి వస్తుంటే నన్ను పికప్‌ చేసుకోడానికి శివాని, ఇషా వచ్చి ఫ్రెండ్‌ షిప్‌ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మన సంతోషాన్ని, బాధను పంచుకునే స్నేహితులు కూడా ఉండాలి. నేను ఒకరోజు జిమ్‌ కు రాలేదంటే శివానీ, ఇషా వచ్చి తీసుకెళ్తారు.  కొంత మందికి మాత్రమే నిజాయతీ పరులైన స్నేహితులు దొరుకుతారు. మా అమ్మానాన్నలు ఇప్పటికీ వాళ్ల కాలేజి, స్కూల్‌ ఫ్రెండ్స్‌ తో టచ్‌లో ఉంటారు. అవన్నీ చూసే స్నేహం విలువ తెలిసింది.


 అబ్బాయిలే ఎక్కువ!

- ప్రియాంక జవాల్కర్‌, తిమ్మరుసు ఫేమ్‌

నాకున్న స్నేహితుల్లో చాలా మంది అబ్బాయిలే. చిన్నప్పుడు నిఖిల్‌, లోహి, కౌశిక్‌ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. క్రికెట్‌ ఆడటానికి వెళ్తూ నన్నూ తీసుకెళ్లేవాళ్లు. నాకు ఆట రాకపోవడంతో ఎంపైర్‌గా నిల్చోబెట్టి వాళ్లు ఆడుకునేవాళ్లు. పాఠశాల స్థాయిలో రుక్యా అనే అమ్మాయి నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఎప్పుడూ తనదే ఫస్ట్‌ ర్యాంక్‌. తనతో కలిసి చదువుకునేదాన్ని. తర్వాత కళాశాలలో హర్ష అనే అమ్మాయి పరిచయమైంది. తనతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తరుచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అలా... ఏ వయసులో ఆ స్థాయికి మంచి స్నేహితులు దొరికారు. కానీ అన్నింటికంటే మా అమ్మే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. చిన్నప్పుడు అమ్మతో అన్ని విషయాలూ పంచుకునేదాన్ని. సినీరంగంలోకి అడుగుపెట్టాక అమ్మతో ఇక్కడి విషయాలు  పెద్దగా పంచుకోవడం లేదు. వాళ్లకు ఇక్కడి సంగతులు పెద్దగా తెలియవు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవపడటం అంతా అమ్మతోనే జరిగేది. ప్రేమ, కోపం, ద్వేషం అన్ని అమ్మతోనే. మా అమ్మకూడా నన్ను మంచి స్నేహితురాలిగా చూస్తుంది. అలాగే నా తొలి చిత్రం టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌, గమనం చిత్ర దర్శకురాలు సృజనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాను. టాక్సీవాలా సినిమా చేసేటప్పుడు విజయ్‌ దేవరకొండతో మంచి స్నేహం ఏర్పడింది. సెట్‌ లో, కెమెరా ముందు ఎలా ఉండాలనేది బాగా చెప్పేవాడు. ఆ ప్రోత్సహం ఎప్పటికి మరిచిపోలేను.


- సతీష్‌ దండవేణి, ఈటీవీ, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్