Updated : 05/08/2021 06:09 IST

178 మందిలో టాపర్‌...నాన్న స్ఫూర్తితోనే సివిల్స్‌


వైఫల్యం ఆ ఇద్దరమ్మాయిలనీ వెక్కిరించింది. ఒకట్రెండుసార్లు కాదు.. ఒకరిని నాలుగుసార్లయితే ఇంకొకరిని అయిదుసార్లు. కానీ విఫలమైన ప్రతిసారీ వాళ్లు మరింత గట్టిగా ప్రయత్నించారు. కల నెరవేర్చుకోవాలన్న పట్టుదల ఒకరిదైతే.. తండ్రి నింపిన స్ఫూర్తితో ముందుకుసాగిందింకో అమ్మాయి. దేశంలోనే అత్యుత్తమ సర్వీస్‌.. సివిల్స్‌ శిక్షణ పూర్తిచేసుకుని ఐపీఎస్‌ బాధ్యతలను చేపట్టనున్న రంజితా శర్మ, రష్మి పెరుమాళ్‌ల గురించే ఇదంతా. వారి స్ఫూర్తిగాథల్ని వసుంధరతో పంచుకున్నారిలా!

ప్రధాని ఆ సలహా ఇచ్చారు

 రంజితా శర్మ, రాజస్థాన్‌ కేడర్‌

పోలీస్‌ యూనిఫాం ధరించాలన్నది తన కల. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అయిదుసార్లు విఫలమయ్యారు.ఆరో ప్రయత్నంలో విజయాన్నే కాదు.. ఐపీఎస్‌ శిక్షణ అందుకున్న 178 మందిలో టాపర్‌గానూ నిలిచారు. అంతేకాదు..ప్రతిష్ఠాత్మక స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌నీ అందుకోనున్నారు. ఏడు దశాబ్దాల అకాడమీ చరిత్రలో ఒక అమ్మాయి బెస్ట్‌ అవుట్‌డోర్‌ ప్రొబేషనర్‌గా ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాక పరేడ్‌లో అందించే 50 ట్రోఫీల్లో ఎనిమిదింటినీ రంజితానే గెల్చుకోవడం విశేషం. ‘మాది హరియాణలోని ఫరీదాబాద్‌. రేవడి నా స్వస్థలం. నాన్న సతీష్‌కుమార్‌ శర్మ, అమ్మ సవితాశర్మ. సివిల్స్‌ దిశగా ప్రోత్సహించింది నాన్నే. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో బీఏ ఆనర్స్‌, ఆపై దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూÆÆట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ నుంచి పీజీ చదివా. పీఆర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. చాలామంది ‘ఎందుకు సమయం వృథా చేసుకుంటావ్‌? ఉద్యోగంపై దృష్టిపెడితే ప్రమోషన్‌ వస్తుందిగా!’ అనేవారు. లక్ష్యాన్ని చేరుకోలేక బాధపడినప్పుడూ, ఒత్తిడిని జయించడానికీ అమ్మా, వదినలు అండగా నిలిచారు. ఐపీఎస్‌ శిక్షణ కఠినంగానే ఉంటుంది. కానీ అది నా గురించి నాకే తెలియని ఎన్నో విషయాలని నేర్పింది. అవుట్‌ డోర్‌లో 40 కి.మీ. దూరాన్ని జయించానంటే శిక్షణ వల్లే. పోలీసులకు ధైర్యం తర్వాత ఉండాల్సిన సహనాన్నీ నేర్పింది. స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌, బెస్ట్‌ ఆల్‌రౌండ్‌  ఐపీఎస్‌ ప్రొబేషనర్‌గా ప్రధానమంత్రి బేటన్‌ వంటివి అందుకోవడం సంతోషంతో పాటు బాధ్యతనూ పెంచాయి. ప్రధాని మోదీ.. ‘నీ విజయం తర్వాత సమాజంలో గమనించిన మార్పేంట’ని అడిగారు. ఎంతోమంది ఆడపిల్లలు ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని చెప్పా. ‘నువ్వు దేశంలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా వారంలో ఒక గంట బాలికల పాఠశాలకు వెళ్లు. వాళ్లతో మాట్లాడు, వాళ్లు చెప్పింది విను. నీలాంటి వాళ్లే ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి’ అని సలహా ఇచ్చారు. చాలా సంతోషమేసింది. నాలాగే మీరూ సాధించొచ్చు. కాకపోతే సమయాన్ని తెలివిగా వాడుకోవాలి.. ఇదే అమ్మాయిలకు నేనిచ్చే సలహా’ అంటున్నారు రంజిత.


నాలుగు సార్లు విఫలమైనా..
- రష్మి పెరుమాళ్‌, తెలంగాణ కేడర్‌

రష్మి పెరుమాళ్‌ది సైనిక కుటుంబం. తండ్రి కర్నల్‌ డాక్టర్‌ మాధవ పెరుమాళ్‌ విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్‌ యుద్ధంలోనూ పాలొన్నారు. ఆయన మరణం లక్ష్యసాధన పట్ల తన పట్టుదలను మరింత దృఢతరం చేసింది అంటారు రష్మి. ‘నాన్న తెలుగువారే. ఆయన ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగినా.. సికింద్రాబాద్‌తో నాకు అనుబంధం ఎక్కువ. చిన్నతనం నుంచీ చదువులో ముందుండటంతో స్కూల్‌ రోజుల నుంచే అమ్మ నన్ను సివిల్స్‌ రాయమని ప్రోత్సహించింది. నేను దెహ్రాదూన్‌లో లా రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. డిగ్రీ తర్వాత నల్సార్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీజీ చేశాను. అన్నయ్య నాన్న బాటలో ఆర్మీలోకి వెళ్లాడు. మనకు బాధ కలిగినప్పుడో, కష్టం వచ్చినప్పుడో ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తేలికే. కానీ అందులో భాగమైనప్పుడే కదా.. సమస్య మూలాలు తెలిసేది? అందుకే సివిల్స్‌ రాయాలనుకున్నాను. నాలుగుసార్లు విఫలమైనా ఈసారి విజయం సాధించాను. మొదటి రెండుసార్లూ అంత సీరియస్‌గా ప్రయత్నించలేదు. మూడోసారి దిల్లీలో శిక్షణ తీసుకున్నాను. ఓటమి ఎదురైన ప్రతిసారీ బాధనిపించేది. ఆ సమయంలో ‘అసలు నేనీ పరీక్షలు ఎందుకు రాయాలనుకుంటున్నాను?’ అని ప్రశ్నించుకునేదాన్ని. అప్పుడు నాన్న మాటలు గుర్తుకొచ్చేవి. వాటితోపాటు ఆయన మరణం నా లక్ష్యాన్ని మర్చిపోకుండా చేయడమే కాక, సాధించి తీరాలనే పట్టుదలనీ నింపాయి. అమ్మ ప్రోత్సాహమూ తోడైంది. ఫలితమే ఇప్పటి నేను. విధి నిర్వహణలో నేను చదివిన లా ఒక సమస్యని అన్ని కోణాల్లో పరిశీలించి, పరిష్కరించడంలో సాయపడుతుందని నమ్ముతున్నా’ అంటున్నారు రష్మి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి