Published : 07/08/2021 03:05 IST

తారల సోయగానికి చేనేత!

శతాబ్దాల చేనేత ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు... అయినా ఈ వస్త్రరాజం వన్నె మాత్రం తగ్గలేదు. సంప్రదాయ చేనేత.. ఆధునికతను కలబోసుకుంటోంది. సరికొత్త సొబగులు అద్దుకుని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ మెప్పిస్తోంది. ఇవాళ చేనేత దినోత్సవం. మరి దాని సొగసు, సోయగాలను ఒకసారి పరికిద్దామా...

చేనేతలో నూలు చీరలు ఎంచుకున్నా ధగధగల పట్టు కట్టినా ఆ సొగసే వేరు. కంచి పట్టు నుంచి మంగళగిరి నూలు, డబుల్‌ ఇకత్‌ కాటన్‌ సిల్క్‌ చీర పేరేదైనా... కట్టుకుంటే మాత్రం ఎంతో సౌకర్యం. కంచి, బెనారస్‌, పోచంపల్లి ఇకత్‌, గద్వాల్‌, నారాయణ్‌పేట్‌, మహదేవ్‌ పుర్‌, మంగళగిరి, పొందూరు... ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి చేనేత రకాలు ఆదరణ పొందుతున్నాయి. పట్టుతో పాటు పైథానీ, కోటా కాటన్‌, సిల్క్‌ కోటా, పటోలా, మస్లిన్‌, లినెన్‌... వంటి రకాలు రాజ్యమేలుతున్నాయి.

ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్లు విదేశీ వస్త్రాలనే విరివిగా వాడుతూ.. అదే తమ ప్రత్యేకతని చెప్పుకునేవారు. ఇప్పుడు వారి మార్కెటింగ్‌ మంత్రం హ్యాండ్‌లూమ్‌గా మారింది. వీటికి ప్రాచుర్యం కల్పించడంలో సెలబ్రిటీల పాత్రా తక్కువేం కాదు. సమయం చిక్కితే చాలు... వియ్‌ లవ్‌ హ్యాండ్‌లూమ్స్‌, వోకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ వారికి చేనేతపై ఉన్న మక్కువను సామాజిక మాధ్యమాల వేదికగా పంచు కుంటున్నారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ చాలా మందిది ఇదే బాట. విద్యాబాలన్‌కి హ్యాండ్‌లూమ్‌ శారీలు అంటే ఎంత ఇష్టమో సందర్భం దొరికిన ప్రతిసారీ చెబుతూనే ఉంటుంది. ఆ మధ్య ఓ సేవాసంస్థ నిధుల సేకరణ కోసం వేలం వేస్తోంటే తనకెంతో ఇష్టమైన ప్యూర్‌ టస్సర్‌ చీరనిచ్చి వార్తల్లో నిలిచింది. ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ విస్తరణ రోజునా మహిళా మంత్రులంతా... వారి ప్రాంతాల చేనేత చీరల్నే కట్టుకొచ్చారు.

ఇక సమంత అక్కినేని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. రాణా దగ్గుబాటి పెళ్లి వేడుకల్లో లేత ఆకుపచ్చరంగు పొందూరు నేత చీరను కట్టుకుని అదరహో అనిపించింది. అదే కాదు... నేత రకాల్ని ఎంత స్టైలిష్‌గా కట్టుకోవచ్చో చూపించేందుకా అన్నట్టు ధోతీచీర, జంప్‌సూట్‌ వంటివి ధరించి మెప్పించింది. రకుల్‌, రాశీఖన్నా, పూజాహెగ్దేలా తారలంతా సంప్రదాయ చేనేత రకాలపై మనసు పారేసుకున్న వారే. వాటినే వెస్ట్రన్‌, ఫ్యూజన్‌ స్టైల్లో ధరించి వారెవ్వా ఎంతందమో అనిపిస్తున్నారు.


మీరూ ట్రెండ్‌ సెట్‌ చేయొచ్చు.

* ప్లెయిన్‌ లినెన్‌ చీరకు...3/4 బెల్‌ స్లీవ్స్‌, వీనెక్‌ బ్లవుజు ప్రయత్నించండి. కాలర్‌ నెక్‌ కూడా బాగుంటుంది. కలర్‌ఫుల్‌ పటోలా చీరకు బెల్ట్‌ భలే నప్పుతుంది.

* పోచంపల్లి డబుల్‌ ఇకత్‌ డిజైన్‌లో పెప్లమ్‌ టాప్‌ని ఎంచుకుని జతగా ప్లెయిన్‌ పలాజో వేసుకుంటే ట్రెండీగా కనిపించొచ్చు.

* లేత రంగు క్రాప్‌టాప్‌-పలాజో ప్యాంట్‌కు లాంగ్‌కోట్‌ కొత్త లుక్‌ని తెచ్చిపెడుతుంది.

* నారాయణ్‌పేట్‌ నేత చీరలతో లాంగ్‌గౌన్‌లు కుట్టించుకుని, వాటికి బెల్‌ బాటమ్‌ స్లీవ్స్‌ పెట్టించుకుంటే బాగుంటుంది.

* ఖాదీ వస్త్రంపై కాంతావర్క్‌, బ్లాక్‌ ప్రింట్‌ చేయించుకుని జంప్‌సూట్‌ కుట్టించుకోవచ్చు. కుర్తీలూ కొత్తగానే ఉంటాయి. అయితే ‘ఏ లైన్‌’ రకాలు మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి