వ్యథార్థ జీవన చిత్రణకు అంతర్జాతీయ పురస్కారాలు

రోడ్ల మీద ఎక్కడైనా చెత్త కనిపిస్తే మున్సిపాల్టీ వాళ్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదు అని తిట్టుకుంటాం. కానీ వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటే మాత్రం అక్కడ శ్రమించిన పారిశుధ్య కార్మికులను గుర్తుకు తెచ్చుకోం.

Published : 11 Aug 2021 01:46 IST

రోడ్ల మీద ఎక్కడైనా చెత్త కనిపిస్తే మున్సిపాల్టీ వాళ్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదు అని తిట్టుకుంటాం. కానీ వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటే మాత్రం అక్కడ శ్రమించిన పారిశుధ్య కార్మికులను గుర్తుకు తెచ్చుకోం. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వారు చేసే శ్రమకు గుర్తింపు ఉండదు. అందులోనూ మహిళా కార్మికుల సమస్యలు మరీ ఎక్కువ. సరిగ్గా ఈ అంశాన్నే ఎంచుకుని ఒకమ్మాయి లఘుచిత్రాన్ని తీసింది. అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది... తనెవరో, ఆ చిత్రం ఏంటో చూడండి...
పాతికేళ్ల స్నేహ మేనన్‌ది బెంగళూరు. తను డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ సారి ఓ పత్రికా కథనం తనని బాగా కదిలించింది. కుటుంబ పోషణ కోసమే ఎక్కువ శాతం మంది మహిళలు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారన్నది దాని సారాంశం. దాంతో వారి కష్టాలు, కడగళ్లను లఘుచిత్రంగా తీసి ప్రపంచానికి చూపాలనుకుంది. వాళ్లను దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టింది. దీని కోసం చదువును ఆపేసింది. ఎండనకా, దుమ్మనకా నగరాన్ని శుభ్రపరచడంలో నిమగ్నమయ్యే వీరికి సొంత ఆరోగ్యం గురించి పట్టింపు, పాటించాల్సిన ఆరోగ్య నియమాల గురించి అవగాహన లేకపోవడం చూసి బాధ పడింది. కుటుంబానికి చేయూత, పిల్లల చదువులు... ఇవే వారి లక్ష్యాలు. కొన్ని నెలల పాటు స్నేహ కూడా వారి వెంటే తిరిగింది. రోజంతా ఆ మహిళా కార్మికుల విధులను దగ్గరగా పరిశీలించింది. వారి ఇబ్బందులను తెలుసుకుంది. 

తెరపైకి తేవాలనుకున్నా...

చాలామందికి వీరి గురించి తెలీదు, అందుకే తెర వెనుక ఉన్న వీరి జీవితం గురించి ఎన్నో విషయాలను లఘు చిత్రంగా తెరపైకి తీసుకు రావాలనుకున్నా అంటుంది స్నేహామీనన్‌. ‘వాళ్లతో మాట్లాడినప్పుడు.. దేని గురించి అడిగినా ‘దేవుడున్నాడు... మా బాధలన్నీ ఆయనే చూసుకుంటాడు’ అంటూ సమాధానం ఇచ్చేవారు. అదే నా చిత్రం ‘ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌’. నగరం నిద్రలో ఉన్నప్పుడే వీరు పని మొదలు పెడతారు. కాలాలతో సంబంధం లేకుండా వర్షం, ఎండ వంటివి లెక్కచేయకుండా నిర్విరామంగా పని చేస్తారు.  నెలసరి వంటి సమయాల్లో కూడా విధులు నిర్వర్తించాల్సిందే. ఇలా వారి కష్టంలో ప్రతి క్షణాన్నీ డాక్యుమెంటరీలో పొందుపరిచా. దీని ద్వారా వారి గురించి అందరికీ అవగాహన కలగాలి. వారిని, వారి శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కొన్నిచోట్ల వీరి పరిసరాల్లోకి రావడానికి కూడా చాలామంది ఇష్టపడక పోవడాన్ని చూశా. మరికొన్ని ప్రాంతాల్లో అంటరాని వాళ్లుగా చూసేవారు. నిజానికి వీళ్లు ఉన్నతమైన విధులు నిర్వర్తిస్తున్నారు. మనందరి ఆరోగ్యాల్నీ పరిరక్షిస్తున్నారు. అటువంటి వారి గురించి నా డాక్యుమెంటరీ ద్వారా ఒక్క నిమిషమైనా అందరినీ ఆలోచింప చేయాలనేదే నా ప్రయత్నం’ అని చెబుతోంది స్నేహా మీనన్‌. గత జూన్‌లో పూర్తిచేసిన ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. 23 నిమిషాల నిడివి ఉన్న డాక్యుమెంటరీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి అర్హత పొందింది. పలు అవార్డులనూ అందుకుంది.ఈ ఏడాది వురువట్టి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుని, ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌’ అవార్డును దక్కించుకుంది. ఇటీవల టొరంటో, ఠాగూర్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శనకు ఎంపికైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్