ఆమె కృషి... క్షతగాత్రులకు వరం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఆరు శాతం మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన సర్వే ప్రకారం రహదారుల ప్రమాదాల్లో నాలుగో వంతు మంది మృతి చెందడం లేదా తీవ్రగాయాలపాలవుతున్నారని

Published : 17 Aug 2021 01:43 IST

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఆరు శాతం మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన సర్వే ప్రకారం రహదారుల ప్రమాదాల్లో నాలుగో వంతు మంది మృతి చెందడం లేదా తీవ్రగాయాలపాలవుతున్నారని తేలింది. ప్రమాదం జరిగినప్పుడు తక్షణం స్పందించి విరిగిపోయిన అవయవాలను మరింత పాడవకుండా కాపాడగలిగితే, చాలామంది బాధితులు వికలాంగులు కాకుండా కాపాడవచ్చు. ఈ దిశగానే ఆలోచించింది కోమల్‌సనాస్‌.  ఆ ఆలోచన తనకు పలు అవార్డులనూ తెచ్చిపెట్టింది.

కోమల్‌కు చిన్నప్పటి నుంచి సైన్స్‌ అంటే ఆసక్తి. అమ్మానాన్నల కోరిక మేరకు కొల్హాపూర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసినా, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి మాత్రం అలాగే ఉండి పోయింది. దాంతో ఓ మెడికల్‌ డివైస్‌ సంస్థలో డిజైనర్‌గా చేరింది. మూడేళ్లపాటు చికిత్సకు సంబంధించిన ప్రాజెక్టులకు పనిచేసింది. ఆ అనుభవంతో మెడి ఆశా టెక్నాలజీస్‌ సంస్థకు కో ఫౌండర్‌, సీఓఓ అయ్యింది. ఇక్కడ మెడికల్‌ డివైస్‌లు తయారు చేయడంలో కీలకపాత్ర పోషించేది. ఈ దిశగా ఎముకలు విరిగినప్పుడు చికిత్స జరిగేలోపు వాటిని కదలకుండా స్థిరంగా ఉంచేలా ‘ఫ్రాక్టోఎయిడ్‌’ను డిజైన్‌ చేసింది.

నష్టమెక్కువ జరగకుండా...

ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినప్పుడు చికిత్స జరగడం ఆలస్యమైతే బాధితుడికి మరింత నష్టం జరుగుతుంది అంటుంది  కోమల్‌. ‘ఎముకలు విరిగితే చుట్టూ ఉన్న కండరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో రక్తస్రావం మొదలవుతుంది. బాధితుడిని సంఘటనాస్థలం నుంచి ఆసుపత్రికి చేర్చేలోపు లోపల గాయపడిన ఎముకలు కదులుతుంటాయి. ఈ కారణంగా అంతర్లీనంగా రక్తస్రావం పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో కన్నా, చికిత్స జరిగే లోపు చోటుచేసుకునే ఈ అంశాలు నష్టాన్ని పెంచుతాయి. దీనివల్ల అవయవాలు బాగా దెబ్బతిని, శాశ్వత వైకల్యం ప్రమాదం ఉంది. ఇలా జరగకూడదనే ‘ఫ్రాక్టో ఎయిడ్‌’ డివైస్‌ను రూపొందించాం. ఇది టేప్‌లా ఉంటుంది. దీన్ని కొన్ని నిమిషాలు నీటిలో నానబెట్టి పిండేయాలి. ఆ తర్వాత దెబ్బతిన్న అవయవానికి చుట్టేస్తే చాలు. నిమిషాల్లోనే విరిగిన ఎముకకు సపోర్ట్‌ ఇస్తుంది. దీనిపై పుణెలో కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తే బాగా పని చేస్తున్నట్లు తేలింది. ఈ డివైస్‌ను క్రీడాకారులు, సైనికదళం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోచ్చు. క్రీడా సంస్థలు, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎన్డీఆరెఫ్‌) వంటి వాటికి ఈ ఆవిష్కరణను చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలో దీన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి కృషి చేస్తున్నాం’ అంటున్న కోమల్‌, తాజాగా నూతనావిష్కరణల చేసిన మహిళలకు అందించే ‘ఆసియాస్‌ 1000 వుమెన్‌ అవార్డు’ను దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్