వెదురు ఊపిరులూదింది!

తమ ఉత్పత్తులతో ఆదాయం పొందడమే కాకుండా పర్యావరణానికీ మేలు చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురుతో వంటింటి ఉపకరణాలు, ఇంటీరియర్‌ వస్తువులు రూపొందిస్తున్నారు. వంద మందికి పైగా చేతివృత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్నారు

Updated : 18 Aug 2021 05:42 IST

తమ ఉత్పత్తులతో ఆదాయం పొందడమే కాకుండా పర్యావరణానికీ మేలు చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురుతో వంటింటి ఉపకరణాలు, ఇంటీరియర్‌ వస్తువులు రూపొందిస్తున్నారు. వంద మందికి పైగా చేతివృత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్నారు. తాజాగా కొత్తరకం టీ పొడులను తయారు చేశారు. ఎవరు వాళ్లు? వాళ్ల ప్రత్యేకత ఏమిటో చూడండి...

అక్షయ శ్రీ, తరుశ్రీ, ధ్వనిశ్రీ  అక్కాచెల్లెళ్లు... వీళ్లది దిల్లీ. ‘శిల్పకర్మన్‌’ బ్రాండ్‌తో వెదురు మగ్గులు, కప్పులు, ఫ్లాస్క్‌లు, హోమ్‌డెకార్‌, ఫర్నిచర్‌.. ఇలా పదిహేడు రకాల ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది అక్షయ్‌శ్రీ అయినా మిగతా ఇద్దరూ ఆమెకు అండగా ఇందులోకి వచ్చారు. తరుశ్రీ క్లినికల్‌ సైకాలజిస్ట్‌, అక్షయ్‌ బిజినెస్‌ ఎకానమిక్స్‌ చదివితే, ధ్వని ఫిల్మ్‌మేకింగ్‌ కోర్సు చేసింది.
‘మా నాన్న ఓ ఫిల్మ్‌ మేకర్‌. తనతోపాటు చాలా ప్రదేశాలు తిరిగాం. ప్రతి ప్రాంతంలోనూ స్థానిక సంప్రదాయ హస్త కళలను చూస్తే చాలా ఇష్టంగా అనిపించేది. అందుకే అక్షయ వెదురుతో వ్యాపారం చేస్తానని అన్నప్పుడు మాకూ ఆ ఆలోచన నచ్చింది. తనకు అండగా నిలబడ్డాం’ అని చెప్పుకొచ్చారు తరు, ధ్వని. 2017లో ‘శిల్పకర్మన్‌’ పేరుతో వెదురు ఉత్పత్తులను అమ్మడం మొదలుపెట్టింది అక్షయ. ‘త్రిపురలో నలుగురు చేతి వృత్తి కళాకారులతో దీన్ని ప్రారంభించాం. ఇప్పుడు మూడు వందలమంది పనిచేస్తున్నారు. ప్రారంభంలో వెదురుతో మగ్గులు, కప్పులు, ఫ్లాస్క్‌లను తయారుచేశాం. ఆ తర్వాత చాపలు, గృహోపకరణాలు, ఫర్నిచర్‌ తయారీని మొదలు పెట్టాం. ఇప్పుడు మాస్కులనూ రూపొందిస్తున్నాం’ అని వివరించారు వాళ్లు.

మొదట్లో ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టారు. అయితే అంతలో ఓ దెబ్బ తగిలింది. ‘2008లో గ్రీస్‌ ఎగ్జిబిషన్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. మా ఉత్పత్తులకు అక్కడ తగిన ఆదరణ లభించలేదు. దాంతో లక్షల్లో నష్టం వచ్చింది. ఇక వ్యాపారం మానేద్దామనుకున్నా. కానీ ఒక్క సారిగా ఆపేయలేం కదా. మెల్లిమెల్లిగా తగ్గిదామనుకున్నాం’ అని గుర్తు చేసుకుంది అక్షయ. తర్వాత ఆన్‌లైన్‌లో కొనేవారి సంఖ్య పెరగడాన్ని గమనించింది. ఇక వ్యాపారాన్ని ఆపేయాలనే ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

అయితే ఉన్న వాటికి తోడుగా కొత్తగా మరేదైనా చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడొచ్చిన ఆలోచనే ‘బ్యాంబూ టీ’. ఇందుకోసం త్రిపురలో సేంద్రియ విధానంలో పెంచుతున్న వెదురు మొక్కల ఆకులను సేకరిస్తున్నారు. వీటిని సహజ పద్ధతుల్లో ఎండబెట్టి రకరకాల రుచుల్లో టీ పొడులను, అదీ పూర్తిగా చేత్తోనే తయారు చేస్తున్నారు. వెదురు ఆకులు, రకరకాల పదార్థాలను కలిపి తొమ్మిది రకాల ఫ్లేవర్లలో టీలను తయారు చేశారు. దీనికి ‘బీయుటీ’ అని పేరు పెట్టారు. ఈ టీలో పోషకాలతోపాటు సూక్ష్మ పోషకాలైన సిలికా, జింక్‌, పొటాషియం మెండుగా ఉంటాయి. అన్ని పరీక్షలూ పూర్తి చేసుకున్న ఈ టీలకు పేటెంట్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్‌ కూడా తీసుకున్నారు. గతేడాది మేలో ‘బ్యాంబూ టీ’ పేరిట మార్కెట్లోకి విడుదల చేశారు. దానికి వస్తున్న ఆదరణ చూసి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. దీనివల్ల మిగిలిన ఉత్పత్తులకూ డిమాండ్‌ పెరిగిందని మురిసి పోతున్నారు. వైవిధ్యంగా చేస్తే విజయవంతం అవుతామని భరోసాగా చెబుతున్నారీ యువ వ్యాపారవేత్తలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్