ఆమె డిజైన్‌కు..ఎర్రతివాచీ పరిచారు!

ఏదైనా వేడుక రాగానే చాలామంది అమ్మాయిలు.. ‘అబ్బా.. వేసుకోవడానికసలు బట్టలే లేవు’ అంటారు. బీరువా తెరిస్తేనేమో రకరకాల డ్రెస్‌లు! ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే.. ఫలానా అప్పుడు వేసుకున్నామని సమాధానం. ఫ్యాషన్‌ రంగం అభివృద్ధికి కారణం తెలిపే ఉదాహరణే ఇది.

Published : 18 Aug 2021 01:27 IST

ఏదైనా వేడుక రాగానే చాలామంది అమ్మాయిలు.. ‘అబ్బా.. వేసుకోవడానికసలు బట్టలే లేవు’ అంటారు. బీరువా తెరిస్తేనేమో రకరకాల డ్రెస్‌లు! ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే.. ఫలానా అప్పుడు వేసుకున్నామని సమాధానం. ఫ్యాషన్‌ రంగం అభివృద్ధికి కారణం తెలిపే ఉదాహరణే ఇది. కానీ ఒక్కో డిజైనింగ్‌కు ఎంత వృథా అవుతోందో, పర్యావరణానికి అదెంత హాని చేస్తోందో తెలుసా అని ప్రశ్నిస్తోంది సనా శర్మ. దాన్ని పరిష్కరించే టెక్నిక్‌ను కనిపెట్టడంతోపాటు దాని ద్వారా ప్రతిష్ఠాత్మక పురస్కారాన్నీ సొంతం చేసుకుంది. మన దేశం నుంచి దీన్ని అందుకున్న మొదటి అమ్మాయి తనే.
సనాశర్మకి చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. పర్యావరణ ప్రేమికురాలు కూడా. పెరల్‌ అకాడమీ నుంచి ఫ్యాషన్‌ అండ్‌ అపారల్‌ డిజైన్‌లో బీఏ చేసింది. అప్పుడే ఈ రంగంలో ఉన్న పోటీతోపాటు పర్యావరణానికి జరుగుతున్న హానినీ అర్థం చేసుకుంది. ‘ఒక డ్రెస్‌ డిజైనింగ్‌లో ఇప్పటికీ కనీసం 15 శాతం వస్త్రం వృథా అవుతూనే ఉంది. పర్యావరణానికి హాని కలిగించే వాటిలో దీనిది రెండో స్థానం’ అని బాధపడుతోంది సనా. ఈ విషయం తెలిశాక కొత్తగా ప్రయత్నించింది. సస్టెయినబుల్‌ డిజైన్లపై లండన్‌ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ప్రొఫెసర్‌ జులియన్‌ రాబర్ట్‌ ప్రసిద్ధులని తెలుసుకుంది. డిజైనింగ్‌లోకి సైన్స్‌, మేథ్స్‌ కాన్సెప్టులను ప్రవేశపెట్టి  ‘ప్లానర్‌ ఫ్లక్స్‌’ అనే టెక్నిక్‌ను కనిపెట్టింది. తన ఆవిష్కరణ వివరాలు, రూపొందించిన దుస్తులను లండన్‌ ప్రొఫెసర్‌కి పంపగా ఆయన సనాకి మెంటర్‌షిప్‌ అవకాశమిచ్చారు. ఆయన ప్రోత్సాహంతో 2018లో ‘ఇంటర్నేషనల్‌ జీరో వేస్ట్‌ డిజైన్‌ కాంపిటీషన్‌’లో బహుమతి గెల్చుకుంది. అదే ఏడాది సొంత లేబుల్‌నూ ప్రారంభించిందీ చెన్నై అమ్మాయి. వర్చువల్‌ గార్మెంట్‌ డిజైనింగ్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌నూ ఏర్పాటు చేసుకుంది. పలు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొనడమే కాక తన టెక్నిక్‌పై శిక్షణనిస్తోంది. దేశ విదేశాల్లోని డిజైనింగ్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చర్లనూ ఇస్తోంది.
అంతేనా... ప్రతిష్ఠాత్మక ‘రెడ్‌ కార్పెట్‌ గ్రీన్‌ డ్రెస్‌ 2020’ కాంటెస్ట్‌లో పాల్గొని, అవార్డును గెల్చుకుంది. దీనిని 2009లో సూజీ అమిస్‌ కేమెరూన్‌ ప్రారంభించింది. అవతార్‌ దర్శకుడు జేమ్స్‌ కేమెరూన్‌ భార్య ఈమె. తక్కువ వృథా, పర్యావరణ హితం, తిరిగి వాటిని ఉపయోగించేలా ఉండాలన్నది దీన్లో నిబంధనలు. విజేతల దుస్తులను ప్రముఖ నటీమణులు ధరించి రెడ్‌ కార్పెట్‌ మీద నడవడంతోపాటు నగదు బహుమతినీ ఇస్తారు. 2020 పోటీ ఫలితాలను ఇటీవల ప్రకటించారు. ఇద్దరు విజయం సాధించగా వారిలో సనా ఒకరు. ఈ పోటీ కోసం సనా టెన్సెల్‌ అనే చెక్కగుజ్జుతో చేసిన మెటీరియల్‌తో గౌనును రూపొందించింది. దీన్ని అప్‌సైక్లింగ్‌ కూడా చేసుకోవచ్చు. పైగా సున్నా వృథా. మన దేశం నుంచి గతంలోనూ ఎంతోమంది ఈ పోటీకి ప్రయత్నించినా దరఖాస్తు దశలోనే వెనుదిరిగారు. సనా ఏకంగా అవార్డును అందుకోడమేకాక దాన్ని సాధించిన మొదటి అమ్మాయిగానూ నిలిచింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్