మెదడులో చిప్‌ ఏమైనా ఉందా అన్నారు!  

అమ్మ కోరికను తీర్చాలని... ఏడేళ్ల వయసులోనే యాంకర్‌ అవతారమెత్తిందా అమ్మాయి. ఆపై చిన్నితెరపై అవకాశాలు... వరుసకట్టడంతో నటిగా మారింది. తన పాత్రల్లో ఒదిగిపోయి... అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమే మోనీషా. ఎప్పటికైనా వెండితెరపైనా తన ముద్ర వేయాలన్నది లక్ష్యమంటోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది... నన్ను తెరపై చూడాలనుకున్న అమ్మ కోరికే... ఈ రోజు నటిగా నాకో గుర్తింపు తెచ్చింది. నాకు చిన్నప్పటి నుంచీ చదువన్నా, పాటలన్నా ఎంతో ఇష్టం. ...

Published : 21 Aug 2021 02:58 IST

అమ్మ కోరికను తీర్చాలని... ఏడేళ్ల వయసులోనే యాంకర్‌ అవతారమెత్తిందా అమ్మాయి. ఆపై చిన్నితెరపై అవకాశాలు... వరుసకట్టడంతో నటిగా మారింది. తన పాత్రల్లో ఒదిగిపోయి... అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమే మోనీషా. ఎప్పటికైనా వెండితెరపైనా తన ముద్ర వేయాలన్నది లక్ష్యమంటోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది...

న్ను తెరపై చూడాలనుకున్న అమ్మ కోరికే... ఈ రోజు నటిగా నాకో గుర్తింపు తెచ్చింది. నాకు చిన్నప్పటి నుంచీ చదువన్నా, పాటలన్నా ఎంతో ఇష్టం. ఏదైనా సాధించి గుర్తింపు తెచ్చుకోవాలనుకునేదాన్ని. కానీ కుటుంబ పరిస్థితుల దృష్టా కుదరలేదు. నాన్నది వైజాగ్‌, అమ్మది హైదరాబాద్‌. మేం ముగ్గురు అమ్మాయిలం. ఇంట్లో పెద్ద[పిల్లని నేనే. డ్యాన్స్‌, మ్యూజిక్‌, ఆటలు, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలన్నింట్లోనూ చురుగ్గా ఉండేలా ప్రోత్సహించింది అమ్మ. బొద్దుగా, ముద్దుగా ఉండటంతో... అందరూ హీరోయిన్‌వి అవుతావా అనేవారు. ఆ మాటల ప్రభావమో ఏమో నాకూ నటనపై ఆసక్తి పెరిగింది. 2006లో అవకాశం దొరికింది. అప్పటికి ఏడో తరగతిలో ఉన్నా. మా దగ్గర్లో కేబుల్‌ ఆఫీసులో యాంకర్ల ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసింది. అమ్మ నా ఫొటోలు పంపింది. పిలుపు రాగానే...సెలవులే కదా అనుకుంటూ బయలుదేరాం. అక్కడ ఏ పరీక్షా చేయకుండానే మేకప్‌ వేసి షూట్‌ చేశారు. ఆ వేసవిలో కొన్ని ఎపిసోడ్స్‌ చేశా. తర్వాతో ఛానెల్‌లో అవకాశం వచ్చింది. సెలవు రోజుల్లో చేశాక చదువుపై దృష్టి పెడదాం అనుకున్నా. కానీ వారు మూడేళ్లు అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. యాంకర్‌గా... ఎందరో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేశా. భలే ఉండేది. అప్పుడే కొన్ని సినిమాల్లో అవకాశమూ వచ్చినా... చిన్నదాన్ని కావడంతో ఒప్పుకోలేకపోయా. తర్వాత సీరియల్స్‌లోనూ ఆఫర్లు రావడంతో కాదనలేకపోయా. నటిస్తూనే బీఎస్సీ చదివా. యాంకరింగ్‌ కూడా చేసేదాన్ని.

ఈటీవీ పేరు తెచ్చింది... మా టీవీలో క్రాంతి నా మొదటి సీరియల్‌. జెమినీలో సుడిగుండాలు, సిరిమల్లి, మా టీవీలో నాన్నకు ప్రేమతో, ఈటీవీలో ‘ముత్యమంత పసుపు’, ‘గోకులంలో సీత’, ఈటీవీ ప్లస్‌లో ‘నందినీ వర్సెస్‌ నందినీ’.. ఇలా చాలా వాటిలో నటించా. గోకులంలో సీత, నందినీ వర్సెస్‌ నందినీ మంచి గుర్తింపునిచ్చాయి. ఒకే టైమ్‌లో భిన్నమైన క్యారెక్టర్లు కావడంతో చాలా పేరొచ్చింది. తర్వాత ఈటీవీ ‘స్వాతి చినుకులు’లో అవకాశం వచ్చింది. అప్పుడే పెళ్లి, దాంతో కాస్త విరామం. కొన్ని సినిమాలూ చేశానండోయ్‌. ప్రవరాఖ్యుడు, ఆకాశమే హద్దు, గాల్లో తేలినట్టుందే, హలో గురూ ప్రేమకోసమే.. ఇలా తొమ్మిది చిత్రాలు నా ఖాతాలో ఉన్నాయి. బాబు పుట్టాక ‘మనసు మమత’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌.

కుచ్చిళ్లు పెట్టి సిద్ధంగా ఉండేది... చిన్నవయసులోనే ఈ రంగంలోకి రావడంతో అమ్మే అన్నీ చేసి పెట్టేది. బ్రేక్‌లో నేను డైలాగులు చదువుకుంటూ ఉంటే... తర్వాత సీన్‌ కోసం చీరకుచ్చిళ్లు కూడా పెట్టి సిద్ధంగా ఉంచేది. నేనేదైనా... ఒక్కసారి మనసు పెడితే చాలు వేగంగా నేర్చుకోగలను. అందుకోసం ఎంత కష్టమైనా లెక్కచేయను. ‘నందిని వర్సెస్‌ నందిని’ చేస్తున్నప్పుడు... దెబ్బలూ తగిలించుకున్నా. అందులో పాత్ర కాస్త అమాయకత్వం, అల్లరి కలగలసిన లక్షణాలతో ఉంటుంది. దాంతో ఎగురుతూ, దుముకుతూ... గోడల్ని, చెట్టు కొమ్మల్ని పట్టుకుని వేలాడాల్సి వచ్చింది. ఆ సమయంలో గాయాలై రక్తం కారినా పట్టించుకోకుండా చేస్తే అంతా షాకయ్యారు. ఎస్‌వీబీసీ ఛానెల్‌లో ఓ ధారావాహికలో పార్వతీదేవి పాత్ర కోసం ఆడిషన్‌కి రమ్మన్నారు. అక్కడ రెండు పేజీల సీన్‌పేపర్‌ ఇచ్చారు. నాకు ప్రాంప్టింగ్‌ అవసరం లేదంటేే... విచిత్రంగా చూశారు. ఒక్కసారి చదివి రెడీ అన్నా. కో డైరెక్టర్‌ అనుమానంగా చూశారు. షాటయ్యక... ‘ఎలా గుర్తుపెట్టుకున్నావ్‌. నీ బ్రెయిన్‌లో చిప్‌ ఉందా’ అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వెండితెరపై అవకాశాలు వస్తే నా ప్రతిభ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నా.

అభిమానులు జాలిపడుతుంటారు..
కొంతమంది పెద్దవారు, మహిళలు... నేను ఎక్కడైనా కనిపిస్తే... ‘అయ్యో ఎంత మంచి దానివి. నిన్నెంత బాధపెడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇంకొందరేమో విలన్‌ల గురించి... ‘నీ వెనుక కుట్రలు చేస్తున్నారు గమనించుకో తల్లీ’ అని చెప్పేవారు. అవన్నీ సీరియళ్ల వరకే... బయట మేము మంచి స్నేహితులం... అని వారికి నచ్చచెప్పడానికి చాలాసార్లు కష్టపడ్డా. మా వారు సాగర్‌ముఖి. ఆయన స్వస్థలం దిల్లీ. న్యూయార్క్‌లో వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. పెళ్లయ్యాక నాకోసం ఇక్కడ నుంచే క్కడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మాకు ఓ బాబు. వాడి పేరు యుధ్‌వీర్‌ కనీష్‌ ముఖి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్