కాగితం సీసాలతో వ్యాపార మంత్రం!

ప్లాస్టిక్‌ లేని రోజువారీ జీవితాన్ని ఊహించడం కష్టమేనేమో! ఆ ఆలోచనే ఆమెను ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయా సీసాల తయారీ దిశగా నడిపించింది. ఆమే నోయిడాకు చెందిన సమీక్ష గనేరివాల్‌.

Published : 23 Aug 2021 01:52 IST

ప్లాస్టిక్‌ లేని రోజువారీ జీవితాన్ని ఊహించడం కష్టమేనేమో! ఆ ఆలోచనే ఆమెను ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయా సీసాల తయారీ దిశగా నడిపించింది. ఆమే నోయిడాకు చెందిన సమీక్ష గనేరివాల్‌.

పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ నిషేధం వంటి మాటలు అందరి నోళ్లల్లోనూ నానుతుంటాయి. కానీ వాటికి ప్రత్యామ్నాయాలు దొరకనంత కాలం...అది అసాధ్యమే. అందుకే తాను ‘కాగ్జీ’ పేరుతో వందశాతం భూమిలో కలిసిపోయే కాగితం సీసాలను  తయారు చేస్తున్నానని అంటోంది సమీక్ష. ఈ ప్రయోగం మనదేశంలోనే మొదటిది అని కూడా చెబుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలవడానికి 450 ఏళ్లు పడుతుందనేది ఓ అంచనా. ప్రజలకు ఈ విషయాలపై ఎంతో కొంత అవగాహన ఉన్నప్పటికీ...చౌకగా ప్రత్యామ్నాయాలు దొరకడం లేదు. ఈ విషయాన్నే కాలేజీలో ప్రాజెక్టుగా ఎంచుకుని నేనూ వాటినిని వెతకడం మొదలుపెట్టా కానీ నిరాశే ఎదురయ్యింది’ అని గుర్తుచేసుకుంటుంది సమీక్ష. చదువయ్యాక హైదరాబాద్‌, నోయిడాల్లో పలు ఉద్యోగాలు చేసినా అవేవీ తనకి సంతృప్తినివ్వలేదు. దాంతో  2016లో ప్యాకేజింగ్‌ సొల్యూషన్స్‌ పేరుతో సొంతవ్యాపారం మొదలుపెట్టింది. అప్పుడే తనకో దారి కనిపించింది. ‘సంస్థ ప్రారంభించిన రెండేళ్లకు మా ఖాతాదారు ఒకరు... పర్యావరణహిత ప్యాకేజింగ్‌ కావాలని అడిగారు. ఈసారి ఈ అంశంపై సీరియస్‌గానే దృష్టిపెట్టాలనుకున్నా.  రకరకాలుగా ఆలోచిస్తే...చివరికి పేపర్‌ బాటిల్స్‌ మేలనిపించింది. కానీ ద్రవపదార్థాలను భద్రపరచడం అంటే సవాలే కదా! అందుకే వీటిపై అవగాహన ఉన్న ఇద్దరు డిజైనర్లు, శాస్త్రవేత్తల సాయం తీసుకున్నా’ అని చెబుతోందామె.

ఆ నిషేధంతో ...

‘వివిధ ప్రయోగాల తర్వాత ఓ నమూనా తీసుకొచ్చా. అది ప్లాస్టిక్‌లా పారదర్శకంగా ఉండదు. అందుకే వినియోగదారులకు సరైన అవగాహన కల్పించాకే మా ఉత్పత్తి ప్రజల్లోకి తీసుకెళ్లా. అప్పుడే అంటే..2019లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ని ప్రభుత్వం నిషేధించింది. అది మాకు కలిసొచ్చింది. మా ఉత్పత్తి పూర్తిగా దేశీయం. అందుకే హిందీ పదం కాగజ్‌ని కాగ్జీగా నామకరణం చేశా’ అంటోంది సమీక్ష. కాగితపు వ్యర్థాలను ప్రత్యేక పద్ధతుల్లో గుజ్జుగా మార్చి వీటిని రూపొందిస్తారు. నీటి నిరోధకత కలిగి, తేమకు పాడవకుండానూ ఉంటాయి. ప్రస్తుతం ఈ సంస్థ వాణిజ్య అవసరాలకోసం నెలకు సుమారు రెండు లక్షల సీసాలను తయారు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్