ఈ ప్రయాణం సాక్షిగా... టీకానే ఆయుధం!

కరోనా మిగిల్చిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్‌ సోకకుండా

Updated : 26 Aug 2021 05:13 IST

రోనా మిగిల్చిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత ప్రచారం కల్పించేలా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన కొండి ప్రియాంక (20) బైక్‌ రైడ్‌ను ఎంచుకుంది. ‘టీకానే మనకున్న అద్భుత ఆయుధం’ అంటూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం మొదలుపెట్టింది..

ప్రియాంక వాళ్ల అమ్మ రాజశ్రీ ఉపాధ్యాయిని. ‘సాధారణంగా అమ్మాయిలు స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు వెళతామంటేనే ఒప్పుకోరు. అలాంటిది మా అమ్మ నా లక్ష్యం గురించి చెప్పగానే రూ.2.50 లక్షలు పెట్టి బైక్‌ కొనిచ్చింది. అదనపు హంగులకోసం మరో రూ.1.50 లక్షలు సమకూర్చింది’ అంటోన్న ప్రియాంక డిగ్రీ చేసింది. గతేడాది అక్టోబరులో హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు దాదాపు 4వేల పైచిలుకు కిలోమీటర్లు ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇప్పుడీ సుదీర్ఘ ప్రయాణం. కశ్మీర్‌ నుంచి మొదలుపెట్టి జమ్మూ, హరియాణ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రల మీదుగా హైదరాబాద్‌ చేరుకుంది. మార్గమధ్యంలో తనకు ఎదురైన వారికి టీకా వేయించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ వచ్చింది ప్రియాంక. అన్ని రాష్ట్రాల్లోనూ హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రత్యేకంగా కృషి చేసి హిందీలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది తను. ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆడపిల్ల ఒంటరిగా బైక్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే వచ్చే అవాంతరాలు, సమస్యలను తానూ ఎదుర్కొన్నాననీ, కానీ ఎక్కడా అధైర్య పడలేదంటోంది. ‘రైడ్‌ ఫర్‌ ఏ కాజ్‌ - గెట్‌ వ్యాక్సినేటెడ్‌’ అంటూ రైడ్‌ కొనసాగిస్తున్న ఆమె ‘హైదరాబాదీ రైడర్‌ ప్రియా’ పేరుతో య్యూటూబ్‌లో ఆ విశేషాలనూ పంచుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్