ఆమె మాస్కులకు బాలీవుడ్‌ ఫిదా!

చదువయ్యాక ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ సంస్థను ప్రారంభించాలన్నది ఆ అమ్మాయి కోరిక. లాక్‌డౌన్‌తో దానికి బ్రేక్‌ పడింది. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను చూసి ఏదైనా సాయం చేయాలనుకుంది. మాస్కులు తయారుచేసి అందించింది. తర్వాత దాన్నే వ్యాపారంగా మలిచింది. ఇప్పుడు బాలీవుడ్‌ తారలెందరో ఆమె మాస్కులకు ఫిదా అవుతున్నారు.

Updated : 13 May 2022 15:54 IST

చదువయ్యాక ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ సంస్థను ప్రారంభించాలన్నది ఆ అమ్మాయి కోరిక. లాక్‌డౌన్‌తో దానికి బ్రేక్‌ పడింది. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను చూసి ఏదైనా సాయం చేయాలనుకుంది. మాస్కులు తయారుచేసి అందించింది. తర్వాత దాన్నే వ్యాపారంగా మలిచింది. ఇప్పుడు బాలీవుడ్‌ తారలెందరో ఆమె మాస్కులకు ఫిదా అవుతున్నారు.

గెహనా మంగ్లానీ న్యూయార్క్‌లోని పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరింది. రెండో ఏడాది చదువుతుండగా కరోనా వ్యాప్తి పెరిగింది. కళాశాలలన్నీ మూతబడి, తరగతులన్నీ ఆన్‌లైన్‌ అయ్యాయి. తను మన దేశానికి తిరిగొచ్చేసింది. ఆపై లాక్‌డౌన్‌. అదే సమయంలో ఎంతోమంది వలస కార్మికులు నడుచుకుంటూ సొంతూళ్లకు ప్రయాణమవ్వడం, సామాజిక దూరంపై అవగాహన లేకపోవడం చూసింది. వాళ్లకి సాయం చేయడంతోపాటు అవగాహన కల్పించాలనుకుంది. ఆ ఆలోచన లోంచి పుట్టుకొచ్చిందే ‘దూరీ’. అంటే దూరమని అర్థం.

తన అన్నయ్య నిహాల్‌ ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుతున్నాడు. తనూ ఇదే కారణంతో అప్పుడే తిరిగొచ్చాడు. తన సాయంతో మాస్కులను తయారు చేయించి పంచడం మొదలుపెట్టింది. అందరిలానే ఆరు నెలల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తారనుకుంది. కానీ దాన్ని పొడిగిస్తూ వెళ్లడంతో దూరీని ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థగా మార్చాలనుకుంది. డిజైనింగ్‌ విషయాలు తను చూసుకుంటూ మార్కెటింగ్‌లో అన్న సాయం తీసుకుంది. వెబ్‌సైట్‌ను రూపొందించి, అమ్మకాలు ప్రారంభించారు. దీన్ని ఇంకా విస్తరించాలనుకుంది. సెలబ్రిటీలకు పార్శిళ్లను పంపింది. కొద్ది రోజులు వారి నుంచి స్పందన లేక నిరాశపడింది. కానీ దీపికా పదుకొణెవాటిని ఉపయోగిస్తుండటం, ఆమే స్వయంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడం గమనించింది. అప్పటి నుంచి ఇతర సెలబ్రిటీలూ తన కస్టమర్లయ్యారు.

ఇప్పుడు సారా అలీఖాన్‌, శిల్పాశెట్టి, అర్జున్‌ రాంపాల్‌, వరుణ్‌ ధవన్‌.. ఇలా ఎందరో ఆమె మాస్క్‌లను ఉపయోగిస్తున్నారు. ‘భద్రత, సౌకర్యం, అందుబాటు ధర.. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకున్నా. ఇందుకోసం చాలా పరిశోధన చేసి.. మాస్క్‌ డిజైన్‌, ఉపయోగించాల్సిన వస్త్రం మొదలైన అంశాలను నిర్థరించుకున్నాం. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌ వస్త్రాలను ఉపయోగించడంతో పాటు సురక్షిత విధానంలో తయారీని మొదలుపెట్టాం. తయారీనీ వీడియోలా ఉంచడంతోపాటు కాలాన్ని, ఫ్యాషన్‌ ధోరణులను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం వల్ల అందరికీ చేరువయ్యాం’ అంటోంది 22 ఏళ్ల గెహనా. ఆదాయంలో కొంత భాగాన్ని ఓ సేవా సంస్థకీ అందజేస్తోంది. కరోనా తొలగిపోయే నాటికి ఫ్యాషన్‌ రంగంలో నిలదొక్కుకోవడం తన లక్ష్యమనే గెహనా.. తాజాగా యాక్సెసరీలపైనా దృష్టి పెడుతోంది. సంక్షోభంలో కొత్త అవకాశాల్ని సృష్టించుకున్న గెహనా ఈతరం యువతకు స్ఫూర్తి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్