అడుగు దూరమే.. ఆమె రోదసి లక్ష్యం!

‘నాన్నా.. నేను చంద్రుడి మీదకు వెళతా’ అందో రెండేళ్ల పాప. తన బుజ్జి బుజ్జి మాటలు విన్న ఆ నాన్న నవ్వి ‘సరేనమ్మా! నిన్ను చందమామ మీదకి తీసుకెళ్లే డ్రైవర్‌కి ఆరోగ్యం బాలేదు. బాగై రాగానే తీసుకెళతాడు. సరేనా?’ అన్నాడు. కానీ.. ఆయనకప్పుడు తెలియలేదు.. ఆ అమ్మాయి సరదాగా కాదు.. అంతరిక్ష ప్రయాణం గురించి సీరియస్‌గానే అన్నదని! ఇప్పుడా అమ్మాయి నిజంగానే దాన్ని అందుకోడానికి అడుగు దూరంలోనే ఉంది మరి!

Updated : 01 Sep 2021 05:37 IST

‘నాన్నా.. నేను చంద్రుడి మీదకు వెళతా’ అందో రెండేళ్ల పాప. తన బుజ్జి బుజ్జి మాటలు విన్న ఆ నాన్న నవ్వి ‘సరేనమ్మా! నిన్ను చందమామ మీదకి తీసుకెళ్లే డ్రైవర్‌కి ఆరోగ్యం బాలేదు. బాగై రాగానే తీసుకెళతాడు. సరేనా?’ అన్నాడు. కానీ.. ఆయనకప్పుడు తెలియలేదు.. ఆ అమ్మాయి సరదాగా కాదు.. అంతరిక్ష ప్రయాణం గురించి సీరియస్‌గానే అన్నదని! ఇప్పుడా అమ్మాయి నిజంగానే దాన్ని అందుకోడానికి అడుగు దూరంలోనే ఉంది మరి!

దయ కీర్తికకు చిన్నప్పటి నుంచీ ఆకాశంలో చంద్రుడినీ, నక్షత్రాలనీ అందుకోవాలనే కోరిక. స్కూల్లో ఉన్నప్పుడు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ల గురించి చదివి స్ఫూర్తి పొందింది. అంతరిక్షం గురించి తెలుసుకోవాలనుకునేది. వాళ్ల నాన్న బిల్‌బోర్డ్స్‌ పెయింటర్‌. ఇంటర్నెట్‌ పెట్టించేంత స్థోమత లేదు. దీంతో వార్తాపత్రికలు, మేగజీన్లలో సంబంధిత వార్తలేం వచ్చినా సేకరించేది. పది, ఇంటర్‌ తరగతుల్లో ఇస్రో నిర్వహించిన వ్యాసరచనా పోటీల్లో బహుమతులూ గెలుచుకుంది. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశమూ దక్కింది. వాళ్లతో మాట్లాడాక స్పేస్‌ మీద ఆసక్తి మరింత పెరిగింది. ఉక్రెయిన్‌లో కార్కివ్‌ నేషనల్‌ ఏర్‌ఫోర్స్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివే అవకాశమొస్తే అంది పుచ్చుకుంది. అక్కడ ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ను చేసింది. ఈమెది చెన్నై.

2019లో అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే పోలాండ్‌లోని అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అండ్‌ మిలిటరీ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ మెడిసిన్‌ నుంచి కబురొచ్చింది. ఆస్ట్రోనాట్‌ శిక్షణకు ఉదయ ఎంపికైందన్నది దాని సారాంశం. తనకేమో ఇంగ్లిష్‌పై అంతగా పట్టులేదు. శిక్షణ ఖర్చును భరించే స్థోమతా ఆమె కుటుంబానికి లేదు. కానీ హీరో విజయ్‌ సేతుపతి ఆమె గురించి తెలుసుకుని రూ.8 లక్షలు అందించాడు. వాటితో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లడానికి శిక్షణను తీసుకుంది. ఈ శిక్షణలో భాగంగా కొన్ని రోజులు ఒంటరిగా హ్యూమన్‌ సెంట్రిఫ్యూజెస్‌లో నివసించాలి. ఇక్కడ భూమికి భిన్నమైన వాతావరణంలో పైలట్లు, ఆస్ట్రోనాట్‌ల ప్రతిచర్య, భరించగల శక్తి మొదలైన అంశాలను పరిశీలిస్తారు. ఆ సమయంలో చాలా ఒత్తిడినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ తన లక్ష్యాన్ని తలచుకుంటూ విజయవంతంగా పూర్తి చేశానంటోంది ఉదయ. ఈ తరహా శిక్షణను పూర్తి చేసుకున్న మొదటి భారతీయురాలు తనే.

తాజాగా ఈమెకి కెనడాలో శిక్షణ తీసుకునే అవకాశమొచ్చింది. తన కలలను సాకారం చేసుకునే క్రమంలో మళ్లీ డబ్బే అవరోధమైంది. ‘నా లక్ష్యాన్ని చేరుకోగలనన్న నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. ఎప్పుడు ఒత్తిడి, నిరాశ ఎదురైనా తమిళనాడులోని మారుమూల గ్రామాల స్కూళ్లకు వెళ్లినపుడు నన్ను ఆశ్చర్యంగా చూసే ఆ పిల్లల చూపుల్ని గుర్తు చేసుకుంటా. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుతుంది. ఇప్పటి వరకూ దేశం నుంచి మానవ సహిత వ్యోమ నౌకలేమీ అంతరిక్షంలోకి వెళ్లలేదు. నేను వెళ్లి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడంతోపాటు వాళ్ల కలల్ని తీర్చుకునేలా వాళ్లకి సాయపడాలనేది నా కోరిక’ అంటోంది ఉదయ. తన కలను నెరవేర్చుకునే క్రమంలో తనూ ఓ అడుగు దూరంలోనే ఉంది. అందుకు అవసరమైన మొత్తం కోసం విరాళాలు సేకరిస్తోంది. అవి సమకూరి, తను దేశానికి గర్వకారణంగా నిలిచే స్థాయికి చేరాలని కోరుకుందాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్