Updated : 03/09/2021 04:43 IST

ప్లాస్టిక్‌తో  ట్రెండ్‌ సృష్టించింది!

ఆమె వ్యర్థాలతో వస్త్రానికి అదనపు మెరుపులను అద్దింది. అందుకే అందంతోపాటు పర్యావరణ పరిరక్షణనూ దృష్టిలో పెట్టుకుని తను రూపొందించిన డిజైన్‌కు ‘ఫ్యాషన్‌ ఫార్వర్డ్‌ ఫెలోషిప్‌ 2021’ దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల డిజైనర్‌ ప్రియాల్‌ తురాఖియా వినూత్న ఆవిష్కరణ ఇది. ప్లాస్టిక్‌ను పునర్వినియోగిస్తూ సృజనాత్మకంగా రూపొందించిన ‘కుడ్‌ బీ’ డిజైన్‌ ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంది.

సిలిగురికి చెందిన ప్రియాల్‌ గుజరాత్‌లో పెరిగింది. అహ్మదాబాద్‌ నిర్మా విశ్వ విద్యాలయంలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసింది. ఫ్యాబ్రిక్‌ డిజైనింగ్‌పై ఆసక్తితో ఇంటర్న్‌షిప్‌ చేసింది. అప్పుడే పర్యావరణానికి హాని చేస్తోన్న నేటి ఆధునిక ఫ్యాషన్‌లపై అవగాహన తెచ్చుకుంది. పాలిస్టర్‌, సింథటిక్‌ వంటి వాటితో డిజైన్లు కోకొల్లలుగా రావడం గుర్తించింది. ఇలా తయారైన దుస్తులను ఉతికే ప్రతిసారీ నీటిలో మైక్రోఫైబర్స్‌ను విడుదల చేస్తాయి. ఇవి కాలుష్య శాతాన్ని పెంచుతాయి. దీన్ని నిరోధించేందుకు ఆర్గానిక్‌ కాటన్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను మిళితం చేసి ప్రియాల్‌ కొత్త వస్త్రాన్ని రూపొందించింది.

ప్రయోగాలతో...  తన ఆలోచనకు ఓ రూపాన్నివ్వడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎన్నెన్నో ప్రయోగాలు, జరిపింది. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు, పెట్‌ బాటిల్‌ క్యాప్స్‌ను సేకరించింది. వీటిని గుండ్రం, చతురస్రాకారం, త్రికోణం, డైమండ్‌ ఆకారాలుగా కత్తిరించి రంగు వేయని వస్త్రంపై కుట్టింది. ఆ తర్వాత డై వేసి మెరుపులీనే వస్త్రాన్ని తయారు చేసింది. అనుకున్నట్లుగా వచ్చిన తన ప్రయోగ ఫలితాన్ని దుస్తులుగా మార్చడానికి సిలిగురిలోని టైలర్లను సంప్రదించింది. తొలిసారిగా ఈ వస్త్రంతో నాలుగు అవుట్‌ఫిట్‌లను డిజైన్‌ చేసింది. పార్టీవేర్‌ అంటూ మెరిసే దుస్తుల తయారీలో ఉపయోగించే పదార్థాలు మట్టిలో కలవడానికి ఏళ్ల సమయం పడుతుంది అంటుంది ప్రియాల్‌. ఈ  ఆలోచన కార్యరూపంలో రావడానికి దాదాపు ఏడాది పట్టింది. ఇది వస్త్రం తేలికగా భూమిలో కలిసిపోతుంది. ఈ డిజైన్‌ను నిరంతర్‌ కలెక్షన్‌ పేరుతో విక్రయించడం మొదలుపెట్టింది. అంతేకాదు, వీటిపై వినియోగదారులకు ప్రత్యేక రాయితీని అందిస్తోంది. ఒకసారి కొనుక్కున్న వారు వాటిని వాడాక తిరిగి మాకే వాటిని అమ్మొచ్చు. అందుకు బైబ్యాక్‌ పథకాన్ని ప్రవేశపెట్టాను. ఈ కృషికే ఏటా ‘రీ ఫ్యాషన్‌ హబ్‌ అండ్‌ వై వాటర్‌ సంస్థ’ అందించే అవార్డు ఈ ఏడాది నా ‘కుడ్‌ బీ’ డిజైన్‌కు దక్కడం సంతోషంగా ఉంది’ అని అంటోంది ప్రియాల్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి