ఆమె నవల.. అమెరికన్లకు తెగనచ్చేసింది

‘పెద్దలు కుదిర్చిన పెళ్లి..’ మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ విదేశీయులకు ఈ పద్ధతి ఇప్పటికీ ఆశ్చర్యకరమే. దీన్నే కథా వస్తువుగా ఎంచుకుని నవల రాసింది సంధ్యా మేనన్‌. ఇది న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌సెల్లర్స్‌ జాబితాలో చోటు సంపాదించుకోవడంతోపాటు షోగానూ రూపుదిద్దుకుంది.

Published : 07 Sep 2021 00:39 IST

‘పెద్దలు కుదిర్చిన పెళ్లి..’ మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ విదేశీయులకు ఈ పద్ధతి ఇప్పటికీ ఆశ్చర్యకరమే. దీన్నే కథా వస్తువుగా ఎంచుకుని నవల రాసింది సంధ్యా మేనన్‌. ఇది న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌సెల్లర్స్‌ జాబితాలో చోటు సంపాదించుకోవడంతోపాటు షోగానూ రూపుదిద్దుకుంది.

సంధ్య పుట్టి, పెరిగింది ముంబయి. కానీ వాళ్ల అమ్మానాన్నలది కేరళ. తనకు పదిహేనేళ్లు ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం యూఎస్‌ వెళ్లింది. చిన్నప్పటి నుంచీ తనకు ఏ విషయాన్నైనా రాసి చూసుకోవడం అలవాటు. నిజానికి రచయిత్రి కావాలన్న కోరిక తనకేమీ లేదు. బయాలజీలో డిగ్రీ చదివింది కాబట్టి దానికి సంబంధించిన వృత్తినే ఎంచుకుందామనుకుంది. తనకు 20 ఏళ్లు వచ్చాక ఒక సంఘటన తనను ఇటువైపు ప్రయత్నిస్తే అన్న ఆలోచనను తెచ్చింది. తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆ కోరిక బలపడి రచయితగా మార్చింది. యూఎస్‌ వెళ్లిన కొత్తలో భారతీయ, అమెరికన్‌ రెండు భిన్న సంస్కృతుల మధ్య ఇమడలేకపోయింది. విద్యాసంస్థలోనూ వేరుగా చూసేవారు. దీంతో చాలా ఇబ్బందిపడేది. దాంతో భావోద్వేగాలన్నింటినీ పేపర్‌ మీద పెట్టేది. తనకి బాలీవుడ్‌ ప్రేమకథా చిత్రాలంటే ఇష్టం. కానీ సినిమాకీ, నిజజీవితానికీ తేడా ఉంటుంది కదా! దాన్నే ఎవరైనా చూపిస్తే బాగుంటుందని అనుకుంది. తనే ప్రయత్నిస్తే! అన్న ఆలోచనా వచ్చింది. భర్త ప్రోత్సాహమూ తోడైంది. అలా ‘వెన్‌ డింపుల్‌ మెట్‌ రిషి’ రాసింది. దీనికి మన సంప్రదాయ పెళ్లినే వస్తువుగా ఎంచుకుంది. ఇలాంటి పెళ్లిళ్లలో ఇద్దరి మధ్యా ప్రేమ ఎలా సాధ్యమవుతోందో తన కథలో చూపించింది. దీనిలోనూ తనలాగే రెండు పాత్రలూ ఇండో అమెరికన్లు.

సంధ్య దీన్ని 2017లో ప్రచురించింది. ఇది భారతీయులనే కాదు, అమెరికన్లనూ బాగా ఆకర్షించింది. తర్వాతా ఎన్నో పుస్తకాలను రచించినా దీనికి ఆదరణ తగ్గలేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల బెస్ట్‌ సెల్లర్‌ జాబితా విడుదల చేయగా వాటిలో ఇదీ ఒకటి. ‘100 బెస్ట్‌ యంగ్‌ అడల్ట్‌ బుక్స్‌ ఆల్‌టైమ్‌’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది. దీని ఆదరణ చూసి నెట్‌ఫ్లిక్స్‌ ‘మిస్‌మ్యాచ్‌డ్‌’ పేరిట సినిమాగా తీసుకువచ్చింది. ‘దీన్ని రాయడానికి మూడు నెలలే పట్టినా.. పుస్తకంగా తేవడానికి రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. మన వివాహాలను పరిచయం చేయాలనుకున్నా. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే బలవంతంగా చేసేవన్నట్లుగా ఉండే సినిమాలే ఎక్కువ. వాటికీ భిన్నంగా ఉండేలా రాద్దామనుకున్నా’ అని వివరించింది 38 ఏళ్ల సంధ్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్