ఐక్యరాజ్య సమితిలో హక్కుల వాణి

ప్రపంచంలో నలుమూలలా హక్కుల  కోసం పరితపించే జనం పెరిగిపోతూనే ఉన్నారు. వీరి కోసం తన గొంతుక వినిపిస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రీతి లోలాక్ష నాగవేణి. మానవ హక్కుల

Updated : 21 Nov 2022 15:07 IST

ప్రపంచంలో నలుమూలలా హక్కుల  కోసం పరితపించే జనం పెరిగి పోతూనే ఉన్నారు. వీరి కోసం తన గొంతుక వినిపిస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రీతి లోలాక్ష నాగవేణి. మానవ హక్కుల పరిరక్షణకు అత్యున్నత స్థాయి వ్యవస్థలను ప్రశ్నిస్తూ తనదైన స్థాయిలో సిఫార్సులు చేస్తున్న ప్రీతి ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ రెడింగ్‌లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ దేశంలోని ల్యాన్‌కాస్టర్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి వెబ్‌సైట్‌లో జాతి వివక్షపై ప్రీతి చేసిన సిఫార్సులను ప్రచురించటం విశేషం.

జాతి వివక్షపై...

గత మార్చిలో అమెరికాలోని నల్లజాతికి చెందిన జార్జ్‌ఫ్లాయిడ్‌ మరణ ఉదంతం తర్వాత అల్జీరియా, అర్జెంటైనా, బొలివియా, కోస్టారికా, ఫిన్‌లాండ్‌, మెక్సికో, ఉక్రెయిన్‌ వంటి దేశాలు నల్లజాతీయుల ఆందోళనలతో అట్టుడికిన తీరును ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది ప్రీతి. 12 దేశాల మానవ హక్కుల సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలతో పాటు 80కిపైగా స్వచ్ఛంద సంస్థల నుంచి జాతి వివక్షపై అధ్యయనాలను సమీకరించింది. వీటితో పాటు దశాబ్దాలుగా జాతి వివక్షకు బలైన నల్లజాతీయుల కేసుల వివరాలను కూడా సేకరించిన ప్రీతి ఓ సమగ్ర నివేదికను తయారు చేసింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషన్‌ ‘ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ది హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ ఫండమెంటల్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఆఫ్రికన్స్‌’పై నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక, అందులో ప్రీతి సిఫార్సులను ఐక్యరాజ్య సమితి వెబ్‌సైట్‌లో యథాతథంగా ప్రచురించారు. ఇది తాను ఎంతో కష్టపడి చేసిన అధ్యయనానికి తగిన ఫలితమని ప్రీతి చెబుతున్నారు.

మహిళలు- దివ్యాంగులపైనా...

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌ వేదికల్లో ప్రసంగించటం ప్రీతికి కొత్తేమీ కాదు. గత మార్చిలో దివ్యాంగుల హక్కులను, గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు, ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ప్రీతి చేసిన ప్రతిపాదనలను ఐక్యరాజ్య సమితి ప్రచురించింది. గత జూన్‌లో ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య సమావేశంలో ‘ఎలిమినేషన్‌ ఆఫ్‌ డిస్క్రిమినేషన్‌ ఎగెనెస్ట్‌ విమెన్‌’ అంశంపై చర్చా వేదికను ఏర్పాటు చేశారు. అక్కడ ‘ఇండిజీనియస్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌’ పై ప్రీతి ప్రసంగించారు. తన ప్రసంగ సారాంశాన్ని ఆఫీస్‌ ఆఫ్‌ ది హైకమిషనర్‌ ఫర్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ (ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌)లో ప్రచురించారు.

చదువులోనూ మేటి

సామాజిక అంశాలపై స్పందిస్తూ లోతైన అధ్యయనాలు చేసే ప్రీతి చదువుల్లోనూ రాణించారు. బెంగళూరులోని జాతీయ న్యాయ కళాశాల (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)లో బీఏఎల్‌ఎల్‌బీ చేసిన ప్రీతి స్వర్ణ పతకంతో డిగ్రీ సాధించారు. హైకోర్టు న్యాయవాదిగా కొన్నాళ్లు పని చేసిన ఈమె ప్రస్తుతం లండన్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణపై తన తండ్రి లోలాక్ష చేస్తున్న పోరాటాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆయన చేసిన సేవల స్ఫూర్తితో తాను అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కులపై సాధికారికంగా మాట్లాడుతూ ప్రశ్నించగలగుతున్నానని ప్రీతి చెబుతున్నారు.

- కె.ముకుంద, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్