రాగి లడ్డూకి లక్ష ఆదాయం!

రైతు కూతురామె. బాల్యం నుంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం తనకి అలవాటు. కానీ ప్రస్తుత తరానికి అలాంటి తిండే దొరకడం లేదని గమనించింది. అందుకే తన చిన్ననాటి చిరుతిళ్లలో

Published : 20 Sep 2021 01:03 IST

రైతు కూతురామె. బాల్యం నుంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం తనకి అలవాటు. కానీ ప్రస్తుత తరానికి అలాంటి తిండే దొరకడం లేదని గమనించింది. అందుకే తన చిన్ననాటి చిరుతిళ్లలో ఒకటైన రాగి లడ్డూ తయారీని వ్యాపారంగా మలుచుకుంది. రూ.5వేలు పెట్టుబడితో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తోంది. రైతులకు, మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న 35 ఏళ్ల సుచేత భండారి స్ఫూర్తి కథనమిది.
నాసిక్‌లోని వడ్నేర్‌ భైరవ్‌ గ్రామానికి చెందిన సుచేత బాల్యమంతా పల్లె వాతావరణంలోనే గడిచింది. స్వచ్ఛమైన గాలి, సేంద్రియపంటలతో తయారయ్యే ఆహారం అందిందామెకు. చిన్నప్పుడు అమ్మ చేసిచ్చే వేరుసెనగ-బెల్లం, వేయించిన సెనగపప్పు- బియ్యప్పిండితో చేసే లడ్డూలు వంటివాటిని  ఎక్కువగా తినేది. పుణెలో డిగ్రీ చదవడం కోసం పల్లెను వదిలిన ఆమె, ఉద్యోగరీత్యా ఆరేళ్లపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తోటి మహిళల ఆరోగ్యపరిస్థితిని గమనిస్తే...తన చిన్నప్పటి ఆహారం తనకెంత శారీరకసామర్థ్యాన్ని అందించిందో అనుకునేది. కానీ అవేవీ నేటి తరానికి దాదాపు పరిచయం లేవని అర్థం చేసుకుంది. అందుకే వాటిని తానే తయారు చేయాలనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే సొంతూరుకు చేరుకుంది.  ఇందుకోసమే... ‘ఎర్త్‌ పూర్ణ’ పేరుతో 2019లో ఓ సంస్థనీ ప్రారంభించింది.

సేంద్రియ పంటతో...

తనవద్ద ఉన్న రూ.5వేలును పెట్టుబడిగా పెట్టి లడ్డూ తయారీని మొదలుపెట్టింది. పూర్తిగా సారవంతమైన భూమిలో పండించే పంటలని వినియోగించే దిశగా ఈ పేరు పెట్టా అంటుంది సుచేత. ‘పోషకవిలువలుండే ఉత్పత్తులను తయారుచేయడానికి నాసిక్‌లో రాగులను పండించే రైతులను కలుసుకున్నా. వారి నుంచి ఏటా పంటను తీసుకుంటానని నా సేంద్రియపద్ధతిలోనే పండించాలని వారిని కోరా. ఆ ఉత్పత్తులతోనే అమ్మ, నానమ్మల సాయంతో రాగి లడ్డూలు తయారు చేయడం మొదలుపెట్టా. పోషకాహారనిపుణుల సలహామేరకు అవిసెగింజలు, బెల్లం వంటి పదార్థాలను కలిపి కొత్త ప్రయోగాలూ చేశా.  పుణె వంటి నగర ప్రాంతాల్లోని వారికి వీటి రుచి చూపించా. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నా. సామాజిక  మాధ్యమాలను మార్కెటింగ్‌కి వాడుకున్నా. కొవిడ్‌ సమయంలో నాకు ఆర్డర్లు మొదలయ్యాయి.  ఒకసారి ఈ ఉత్పత్తుల రుచిని చూసినవారే తిరిగి అడగడం మాలో ఉత్సాహం నింపింది. మొదటిసారి వినియోగించిన వారిలో దాదాపు 30 శాతంమంది డెయిలీ  కస్టమర్లుగా మారారు. ఇప్పుడు మావద్ద నాలుగురకాల లడ్డూలు తయారవుతున్నాయి. నెలకు దాదాపు 2,500 ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి నెల రూ.లక్ష ఆదాయం అందుకుంటున్నా. పదిమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నా. సుమారు పాతికమంది రైతుల నుంచి పంటను తీసుకుంటున్నా. వచ్చే ఏడాదికి మరికొంతమందికి ఆదాయం ఇప్పించేలా ఎర్త్‌ పూర్ణను అభివృద్ధి చేస్తున్నా. అలాగే మరికొందరు రైతుల వద్ద పంటను కొనుగోలు చేస్తానని భరోసా ఇస్తున్నా. పోషక విలువలున్న ఆహారాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నాననే ఆనందం మనసులో ఉంది. అమ్మానాన్న ప్రోత్సాహం మరవలేను’ అని చెబుతోన్న సుచేత దీనిపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణనివ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్