Published : 23/09/2021 00:55 IST

కనికట్టు చేస్తోంది...

ఆమె ఏ ప్రముఖుడిలా కావాలంటే అలా ముఖాన్ని మార్చేసుకుంటుంది. అందుకోసం గంటల తరబడి కష్టపడుతుంది. యూట్యూబర్‌ ప్రియాంక పవార్‌ చేస్తోన్న కనికట్టును చూసి ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన మాయలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ విశేషాలు చూడండి...

జియాబాద్‌లో పుట్టిన ప్రియాంక, చదువయ్యాక ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. రెండున్నరేళ్లు మాత్రమే ఆ ఉద్యోగంలో ఉంది. ఎందుకంటే బాల్యం నుంచి మేకప్‌పై ఆసక్తి. అందులోనే శిక్షణ తీసుకుని కెరియర్‌గా మార్చుకోవాలనుకుంది. ముందుగా బ్రైడల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ కోర్సు చేసింది. రెండు మూడేళ్లయ్యాక అందులోనూ ప్రత్యేకంగా, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంది. అదే ఆమెను ఇల్యూజన్‌ మేకప్‌వైపు నడిపించింది.

ఫొటోలు చూస్తూ... ప్రియాంక తన ముఖాన్నే కాన్వాస్‌గా మార్చుకుని ఇతరుల ముఖాల్లా మేకప్‌ వేసుకునే ప్రయోగం మొదలు పెట్టింది. ఎదురుగా ఏదైనా ఒక వ్యక్తి ఫొటో ఉంచి, దానిలాగే అద్దంలో తనకు తానుగా మేకప్‌ను వేసుకుని మారడానికి ప్రయత్నించేది. ఇందులో లోతు పాతులు తెలుసుకోవడానికి ఎంతో పరిశోధన చేశా అంటుందీమె. ‘2డీ మేకప్‌ గురించి యూట్యూబ్‌లు చూసేదాన్ని. వాటిని పరిశీలిస్తూ నాకు నేనుగానే మేకప్‌లో మెలకువలు నేర్చుకోవడంలో కృషి చేశా. నా ఎదురుగా ఫొటోలో వ్యక్తిలా మారడానికి నిత్యం మేకప్‌ వేసుకుంటూ ప్రయత్నించే దాన్ని. ఒక్కోసారి 11 గంటలకు పైగా పట్టేది. ముఖ్యంగా ముక్కు దగ్గర చాలా కష్టపడే దాన్ని. ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉండే ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవడానికి గంటలే పట్టేది. ఎంత కష్టమైనా ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. అలా అనుకున్న ముఖాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచే దాన్ని. మొదటి సారి ఇలా పెట్టినప్పుడు స్పందన ఊహించనంతగా వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఫొటోకీ వచ్చే అభినందనలు ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. ఇప్పటివరకు హాలీవుడ్‌ నటీనటులు జెన్నీఫర్‌ ఆనిస్టాన్‌, కెమిలా కేబిల్లో, తీబిల్లీ పోర్టర్‌, బీన్‌ తదితరుల నుంచి బాలీవుడ్‌ నటులు కేకే మీనన్‌, ఐశ్వర్యరాయ్‌, జాక్వెలిన్‌ అలాగే కార్గిల్‌ వీరుడు కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, ప్రముఖ క్రీడాకారులు మిల్కాసింగ్‌, నీరజ్‌ చోప్రా, ఇంకా పలువురు సెలబ్రటీల ముఖాలను మేకప్‌తో నా ముఖంలో చూపించగలిగా. అలా అనుకోకుండా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి పిలుపొచ్చింది. ఆ సంస్థ రూపొందించిన ‘రే’ చిత్రంలో నటుడు కేకే మీనన్‌ పాత్రకు తగ్గట్లుగా అతడి ముఖాన్ని తీర్చిదిద్దే అవకాశం వచ్చింది. ఇప్పుడు నాకు ప్రత్యేక గుర్తింపు రావడం, వేల మంది ఫాలోవర్స్‌ ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది’ అని చెబుతోంది ప్రియాంక.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని