Updated : 27/09/2021 04:27 IST

ముత్యాల పంటతో కలలు పండిస్తోంది!

కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం మనందరికీ తెలుసు. చేపలు, రొయ్యలు పెంచడమూ సుపరిచితమే.  కానీ ముత్యాలను సాగు చేయడం చూశారా?  ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నీనా అదే చేస్తోంది. భారతదేశంలో ముత్యాల వ్యవసాయం చేసిన మొదటి రైతుల్లో ఆమె కూడా ఒకరు. అందులోని నష్టాలను అధిగమించి లాభాల బాటలో ప్రయాణిస్తోంది. ఆ వివరాలే ఇవి.

‘సాహసాలు చేయడం, సవాళ్లు ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. చేసే పనిలో వైవిధ్యం కోసం ఎంతైనా కష్టపడతా’ అంటోంది నీనా సింగ్‌. ఆమెది ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా. జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసింది. ఆపై లా పట్టానూ అందుకుంది. పన్నెండేళ్లు ఒడిశా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించింది.  ఆంత్రాప్రెన్యూర్‌గా స్థిరపడాలనే కోరికతో చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇది ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. అయినా సరే... తన ఆలోచన మార్చుకోవాలనుకోలేదు. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌లో డీజీఎం హోదాలో పనిచేస్తూనే తన లక్ష్యానికి బాటలు వేసుకుంది.

చక్కెరకు ప్రత్యామ్నాయం...

పంచదార, బెల్లానికి ప్రత్యామ్నాయంగా సహజంగా తీపిని అందించే స్టీవియా మొక్కల సాగుని మొదలుపెట్టింది. అప్పుడే మంచినీటి ముత్యాల పెంపకం గురించి తెలుసుకుంది నీనా. ఇందుకోసం కేరళలోని ఓ ప్రైవేటు క్షేత్రంలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా  ప్రారంభించింది. ఇందుకు అవసరమైన సామగ్రినంతా సమకూర్చుకుంది. పెరట్లోనే కాంక్రీట్‌ కొలను తవ్వించింది. లక్ష రూపాయలతో 500 ఆల్చిప్పలను నీటిలోకి వదిలింది. అయితే వాటిల్లో నలభై మాత్రమే బతికాయి. ఇక రెండో ప్రయత్నమైతే మొత్తంగా విఫలమైంది. ఒక్కటీ రాలేదు. దాంతో భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వాకల్చర్‌కి వెళ్లి మళ్లీ శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ఏడాది ఎనిమిది లక్షల రూపాయలు లాభం అందుకుంది. అది మొదలు ఇప్పటి వరకూ వెనుతిరిగి చూడలేదు. పారదర్శకంగా ఉండే బకెట్లలోనూ వీటిని పెంచుతోంది. సిమెంటు ట్యాంకులు, వివిధ పరిమాణాల్లో చెరువులు ఏర్పాటు చేసి సాగు చేస్తోంది. ప్రస్తుతం ఆరు చెరువుల నుంచి లక్షల ఆదాయం వస్తోంది.

ముత్యాలు, చేపలు...

2017 నాటికి ముత్యాలతోపాటు చేపల పెంపకమూ చేపట్టింది. ఉన్న స్థలాన్ని కాస్త తెలివిగా ఉపయోగించుకోవడం వల్ల నీనా వార్షికాదాయం తర్వాత ఇరవై లక్షలకు పైగానే పెరిగింది. ‘ఇప్పుడు ఇంటర్నెట్‌ ద్వారా అవసరమైన సాంకేతిక సమాచారాన్ని పొందవచ్చు. కానీ ఆచరణాత్మకంగా చేసినప్పుడే లోటుపాట్లు అర్థమవుతాయి. ముత్యాల పెంపకం కాస్త నెమ్మదిగా సాగుతుంది. మెయింటెనెన్స్‌ ఎక్కువ. విత్తనం చనిపోయే అవకాశమూ ఉంది. నిజానికి ఒక ముత్యం ఏర్పడాలంటే దాదాపు ఏడాదిన్నర పడుతుంది. మొదట్లో ఆల్చిప్పల కొరత, సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడం వంటి వాటివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా...తర్వాత నాకంటూ సొంత మార్కెట్‌ని సృష్టించుకున్నా. ఇప్పుడు రాజస్థాన్‌, మహారాష్ట్ర, దిల్లీ ముత్యాలకు దీటుగా అమ్మగలుగుతున్నా’ అంటోంది నీనా. ఆమె కృషికి...ఏషియన్‌ ఫిషరీస్‌ సొసైటీ, ప్రొఫెసర్‌ లీది నందీషా ఫార్మర్స్‌ ఇన్నోవేషన్‌ అవార్డ్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ పురస్కారాలు అందుకుంది. నీనా ఇక్కడితో ఆగిపోలేదు. భారతీయుల్లో పెరుగుతోన్న ఊబకాయం, మధుమేహం రేటును దృష్టిలో ఉంచుకుని తక్కువ తీపి, కెలొరీలుండే ఆహార ఉత్పత్తులను తయారుచేస్తోంది. అలానే టిస్కా అగ్రివెంచర్‌ సంస్థతో కలిసి ఫిష్‌ ఫింగర్‌, నగ్గెట్స్‌, కట్లెట్స్‌, ప్రాన్స్‌ వాంటన్స్‌, పాప్‌కార్న్‌తోపాటు ఊరగాయలు.. కూడా తయారు చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి