విల్లు చేతపడితే విజయాలే!

ఆమె బరిలోకి దిగితే పతకాల పంటే! చదువుల్లోనూ, అభిరుచుల్లోనూ ముందంజే. ఆ  ఆల్‌రౌండర్‌ వెన్నం జ్యోతిసురేఖ మరెవరో కాదు మన తెలుగు అమ్మాయే. యూఎస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ విభాగంలో మూడు రజతాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది.

Published : 27 Sep 2021 00:47 IST

ఆమె బరిలోకి దిగితే పతకాల పంటే! చదువుల్లోనూ, అభిరుచుల్లోనూ ముందంజే. ఆ  ఆల్‌రౌండర్‌ వెన్నం జ్యోతిసురేఖ మరెవరో కాదు మన తెలుగు అమ్మాయే. యూఎస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ విభాగంలో మూడు రజతాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది. పోటీల ఒత్తిడిలో ఉండి కూడా తన సంతోషాన్ని అమెరికా నుంచి ‘వసుంధర’తో ప్రత్యేకంగా పంచుకుంది..

ఒకే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆత్మవిశ్వాసంతోనే ఈ టోర్నీలో అడుగుపెట్టా. కానీ ఇన్ని పతకాలు మాత్రం ఊహించలేకపోయా. అందుకే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. మరోపక్క మూడు ఫైనల్స్‌లోనూ ఓడిపోవడం.. ఒక్క పసిడీ దక్కకపోవడం కాస్త నిరాశే. వ్యక్తిగత క్వార్టర్స్‌లో అన్ని బాణాలను లక్ష్యానికి గురి పెట్టి 150కి 150 పాయింట్లు సాధించడం మర్చిపోలేను. ఓ అంతర్జాతీయ టోర్నీలో ఇన్ని పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి.

అమ్మానాన్నలే నన్ను ఆటలవైపు ప్రోత్సహించారు. నాలుగేళ్ల వయసులో కృష్ణా నదిలో 5 కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం మొదలు.. 11 ఏళ్లపుడు నాకు విల్లు, బాణాన్ని పరిచయం చేసి ఈ స్థాయికి చేర్చింది వాళ్లే. నా ప్రతి విజయంలోనూ వాళ్లున్నారు. టోర్నీల వల్ల ఎక్కువ సమయం కుటుంబంతో కలిసి గడపలేకపోతున్నాననే బాధ ఉండేది. లాక్‌డౌన్‌ సమయంలో పూర్తిగా ఇంట్లోనే ఉండటంతో ఆ వెలితి పోయింది. అమ్మానాన్న, నానమ్మలతో ఆనందంగా గడిపా. అమ్మ చేతి వంటలంటే చాలా ఇష్టం. ఆమె ఏం చేసి పెట్టినా తృప్తిగా భోంచేస్తా. లాక్‌డౌన్‌లో నేనూ నా వంట రుచి వాళ్లకు చూపించా. బయట టోర్నీల కోసం వెళ్లినపుడు మాత్రం ఆహారం విషయంలో సర్దుకుపోక తప్పదు. ఆటతో పాటు చదువన్నా ఇష్టమే. కేఎల్‌ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేశా. అక్కడే ఎంబీఏ కూడా చదివా. స్పోర్ట్స్‌ కోటాలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం సాధించా.

ప్రపంచకప్‌ టోర్నీలో వ్యక్తిగత స్వర్ణం అందుకోవాలన్నది నాకల. ఇప్పుడు నా దృష్టంతా ఆట మీదే. ఇక పెళ్లి విషయం అంటారా.. అమ్మానాన్నలే చూసుకుంటారు. నాకేం కావాలో నా కంటే వాళ్లకే ఎక్కువ తెలుసు. ఒత్తిడి నుంచి సేద తీరడానికి సినిమాలు చూస్తుంటా. అమ్మాయిలకు నా సలహా ఒకటే మిమ్మల్ని మీరు నమ్మండి. ఆటైనా, చదువైనా, కెరియర్‌ అయినా ప్రాణం పెడితే ఫలితాలు అవే వస్తాయి.

- చందు శనిగారపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్