Updated : 29/09/2021 03:36 IST

అంతరిక్ష కలలను సాకారం చేస్తోంది

అంతరిక్షం గురించి చదవాలనే కలను నెరవేర్చుకుంది. గ్రహాంతర మిషన్లలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యాన్నీ సాధించింది. ఎన్నో పరిశోధనల్లో పాలు పంచుకుంది. తనలాంటి కలలుకనే పేద విద్యార్థుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వారి ఆశయాలు నెరవేర్చేందుకు చేయూతనిస్తోంది యువ శాస్త్రవేత్త ప్రియా పటేల్‌.

గుజరాత్‌లో పుట్టిన ప్రియ... తండ్రి ఉద్యోగరీత్యా లండన్‌కు చేరుకుంది. ఇంపీరియల్‌ కాలేజీలో ఫిజిక్స్‌లో బ్యాచిలర్స్‌ చదివింది. చిన్నప్పటి నుంచి నీలి ఆకాశంలో తళుక్కుమనే తారలు ఆమెలో ఆసక్తిని రేకెత్తించేవి. వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలమే భౌతిక శాస్త్రం ఎంచుకునేలా చేసింది. ప్రియ ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులెన్నెదురైనా ఆమె చదువుకి ఆటంకం కలగనీయలేదు. అలా యూనివర్సిటీ కాలేజీ లండన్‌లో స్పేస్‌ సైన్సెస్‌ ఇంజినీరింగ్‌లో ప్రియ మాస్టర్స్‌ చేసింది. ప్రస్తుతం ఐడెంటికల్‌ కాలేజీలో నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో పీహెచ్‌డీ చేస్తోంది. ఏరోబాటిక్‌ పైలట్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటోంది.

నానమ్మ కథలే... బాల్యంలో నానమ్మ చెప్పిన కథలే స్ఫూర్తి కలిగించాయంటుంది ప్రియ. ‘నానమ్మ ఎన్నో విషయాలు చెప్పేది. మరెన్నో సందేహాలు తీర్చేది. నాకో లక్ష్యం ఏర్పడటానికి అమ్మానాన్నలతో పాటు తనూ మరో స్ఫూర్తి. జీవితంలో ఎన్ని సాధించినా, మాతృదేశానికి మనవంతు సేవ చేయాలని చెప్పే నానమ్మ మాటలు నాపై ప్రభావం చూపేవి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను స్పేస్‌ ఎడ్యుకేషన్‌ చేయడం చాలా కష్టమైంది. అందుకే నాలాంటి వారికి ముఖ్యంగా మన దేశంలో ప్రతిభ ఉండి... లక్ష్యం చేరుకోలేని విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలనుకున్నా. అందుకే నానమ్మ పేరు వచ్చేలా ‘షర్దా ఫౌండేషన్‌’ స్థాపించా. ఇది స్పేస్‌ ఎడ్యుకేషన్‌ చేయాలనుకునే నిరుపేద విద్యార్థులకోసం పని చేస్తుంది. నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) లేదా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)లు అంతరిక్ష పరిశోధనల్లో పని చేయడానికి పలు దేశాల్లో అవకాశం కల్పిస్తున్నాయి. అంతరిక్షాన్ని అన్వేషించాలనే ఆసక్తి ఉన్న మన విద్యార్థులకు ఈ సంస్థల గురించి అవగాహన, సమాచారం అందిస్తున్నా’ అని చెబుతోంది ప్రియ.

రోవర్‌ ఆపరేషన్‌లో... ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపైకి విజయవంతంగా చేరిన (మార్స్‌ను) నాసా పెర్సర్వెన్స్‌ రోవర్‌కు సంబంధించి, అక్కడి వాతావరణానికి సంబంధించి డేటాను సేకరించే బాధ్యతలను ప్రియ చేపడుతోంది. నాసాతో కలిసి పనిచేస్తున్న ఈ అనుభవంతో తన కల నెరవేరినట్లుగా అనిపిస్తోందని చెబుతోంది ఈ యువ శాస్త్రవేత్త. అంతేకాదు, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈసా)లో లేజర్‌ ఇంటర్‌ఫెరోమెట్రీ స్పేస్‌ యాంటెన్నా(లీసా) మిషన్‌లో రెండేళ్ల క్రితం సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉందీమెకు. 2022లో మార్స్‌పై నీటి శాతాన్ని కనిపెట్టడానికి ఈసా పంపుతున్న ఎక్సోమార్స్‌ రోవర్‌కు సంబంధించిన పరిశోధనలలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణులతో కలిసి పని చేస్తోందీమె. ఆ అనుభవాల నుంచి కొత్తపాఠాలు, స్ఫూర్తిని పొందుతున్నా అని చెప్పే ఈ స్పేస్‌ ఇంజినీర్‌కు భారతీయ కళలపై కూడా అమితాసక్తి ఉంది. భరతనాట్యంలో 12 ఏళ్లు శిక్షణ తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయస్థాయి వేదికలపై ప్రదర్శనలిచ్చి ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని