ఫొటో ఉచితమనుకుంటే.. ప్రపంచవ్యాప్తమైంది!

ఓరోజు మీ స్నేహితుల నుంచి ఫోన్‌.. ‘నీ ఫొటోని పేపర్‌లో చూశా’మని! చూస్తే ఏదో ప్రకటన. ఫర్లేదులే అనిపిస్తుంది. అలా తరచూ అవుతోంటే? ప్రమాదం లేదు అనిపించొచ్చు. ఈసారి ప్రకటనలకే కాకుండా ఓ సంస్థో, ఎన్‌జీఓనో.. మీ ముఖాన్ని

Updated : 30 Sep 2021 02:03 IST

ఓరోజు మీ స్నేహితుల నుంచి ఫోన్‌.. ‘నీ ఫొటోని పేపర్‌లో చూశా’మని! చూస్తే ఏదో ప్రకటన. ఫర్లేదులే అనిపిస్తుంది. అలా తరచూ అవుతోంటే? ప్రమాదం లేదు అనిపించొచ్చు. ఈసారి ప్రకటనలకే కాకుండా ఓ సంస్థో, ఎన్‌జీఓనో.. మీ ముఖాన్ని ముందుంచి డబ్బు వసూలు చేయడమో, మోసాలకు పాల్పడటమో చేస్తే? అమ్మో అనిపిస్తోంది కదూ! ఓ అమ్మాయికి ఈ పరిస్థితే ఎదురైంది.

షబ్నమ్‌ ఖాన్‌.. సౌత్‌ ఆఫ్రికా రచయిత్రి. యూనివర్సిటీ ఆఫ్‌ క్వాజులు నాటల్‌లో మీడియా స్టడీస్‌ ప్రొఫెసర్‌గానూ చేసింది. ఓరోజు ఆఫీసులో ఉండగా ఫేస్‌బుక్‌ ఖాతా చూసుకోమని స్నేహితురాలి మెసేజ్‌! చూస్తే.. కెనడా ఇమిగ్రేషన్‌ గురించి అక్కడి పత్రికలో షబ్నమ్‌ ఫొటోతో ప్రకటన. అది వాళ్లకు ఎక్కడ్నుంచి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. తనని అడగకుండా వాడుకున్నందుకు కోపమూ వచ్చింది. ఇంతలో ఇంకో ఫ్రెండ్‌ నుంచి కాల్‌. సారాంశం ఇదే. ఈసారి మరో అడ్వర్టైజ్‌మెంట్‌. ఇదెలా సాధ్యమాని ఆలోచిస్తోంటే.. ‘మనం రెండేళ్ల క్రితం దిగిన ఫొటోలా ఉందే!’ అని గుర్తు చేసింది. తను చదువుకునేటపుడు కేప్‌టౌన్‌కి చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ ‘100 రియల్‌ ఫేసెస్‌’ పేరిట ఓ ప్రాజెక్ట్‌ ప్రారంభించాడు. తీయించుకున్న వాళ్లకి  ఉచిత ఫొటోలంటూ ప్రచారం చేశారు. దీంతో షబ్నమ్‌తో పాటు ఎంతోమంది ఆసక్తి చూపించారు. అక్కడికెళ్లాక వాళ్లో కాంట్రాక్ట్‌ మీద సంతకం చేయించుకున్నారు. ఫొటోలను పోర్ట్‌ఫోలియోలో ఉపయోగించుకోవడానికి పర్మిషన్‌ అనుకుంది. తర్వాత ఆ సంగతే మర్చిపోయింది. ఆ ఫొటోగ్రాఫర్‌ను సంప్రదిస్తే.. అది వాటిని ఎక్కడైనా ఉపయోగించుకునేలా అంగీకారం తెలిపిన పత్రమన్నాడు. గూగుల్‌లో ఫొటోతో సెర్చ్‌ చేస్తే.. చర్మ సంబంధ ఉత్పత్తులు, ట్రీట్‌మెంట్లు, బ్యాంకింగ్‌, జర్నల్స్‌, పర్యాటకం.. ఇలా తన ముఖంతో ప్రపంచవ్యాప్తంగా వందల ప్రకటనలు దర్శనమిచ్చాయి. తర్వాత కొన్ని దేశాల్లో శిక్షణ, ఫండ్‌ రైజింగ్‌ వాటిల్లో తను బోధిస్తున్నట్టున్న మార్ఫింగ్‌ ఫొటోలను గమనించింది. ట్విటర్‌లో ఇదంతా వివరిస్తూ పోస్ట్‌ పెడితే వైరలైంది. షబ్నమ్‌ మాత్రం ‘ఏదో సాధించినందుకు నా చిత్రం పత్రికలు, టీవీల్లో కనిపించట్లేదు. తెలియక చేసిన చిన్న పొరబాటుతో వచ్చే ఈ ఫేమ్‌ నా కష్టార్జితం కాదు. ఉచితమనో, తెలియకో పెట్టే సంతకం అంతటితో పోదని చెప్పడం నా ఉద్దేశం. అందరికీ చిన్న సమస్యగానే పోదు. పెద్దదైతే?’ అని ప్రశ్నిస్తోంది. ఈ అనుభవాలను ‘హవ్‌ ఐ యాక్సిండెటల్లీ బికేమ్‌ ఎ గ్లోబల్‌ స్టాక్‌ ఫొటో’ పేరిట పుస్తకంగా తెచ్చింది. దీని ద్వారా ఒక్క అమ్మాయైనా ఇలా మోసపోకూడదనుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్