రేసుల్లో దూసుకెళుతోంది....

బైకులంటే అబ్బాయిలకే అనే రోజులు ఎప్పుడో పోయాయి. అమ్మాయిలూ వాళ్లతో పోటీపడి నడిపేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఇష్టం నడపడానికే పరిమితం కాలేదు. రేసుల్లోనూ దూసుకెళ్లేలా చేసింది. ఆమే దేశంలోనే వేగవంతమైన మహిళా మోటర్‌సైకిల్‌ రేసర్‌ కల్యాణి పాట్కర్‌.

Updated : 13 Sep 2022 14:45 IST

బైకులంటే అబ్బాయిలకే అనే రోజులు ఎప్పుడో పోయాయి. అమ్మాయిలూ వాళ్లతో పోటీపడి నడిపేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఇష్టం నడపడానికే పరిమితం కాలేదు. రేసుల్లోనూ దూసుకెళ్లేలా చేసింది. ఆమే దేశంలోనే వేగవంతమైన మహిళా మోటర్‌సైకిల్‌ రేసర్‌ కల్యాణి పాట్కర్‌.

ల్యాణిది రాజకుటుంబం. అమ్మానాన్నలకు సాహస క్రీడలంటే చాలా ఇష్టం. హార్స్‌రైడింగ్‌, స్కీయింగ్‌ వంటి ఎన్నింటినో నేర్పించారు. కానీ ఆమె మనసు రేసింగ్‌ వైపు మళ్లింది. వాళ్ల నాన్న రేసర్‌. రేస్‌ ట్రాక్‌కి వెళ్లేటప్పుడు ఈమెనీ తీసుకెళ్లేవాడు. గాలితో పోటీపడుతూ దూసుకెళ్లే రేసింగ్‌ ఆమెను ఆకట్టుకుంది. అయితే మొదట్నుంచీ రేసర్‌ కావాలన్న కోరికేం లేదంటుంది కల్యాణి. బైక్‌తో మొదట ప్రేమలో పడ్డానంటుంది. నాన్నకి చెబితే ఆనందంగా నేర్పించారు. అలా తొమ్మిదేళ్ల వయసులో తన స్నేహితులంతా సైకిల్‌ తొక్కుతుంటే ఈమె బరువైన బైకులతో సావాసం మొదలుపెట్టింది. కాళ్లు నేలకు అందకపోయినా నాన్న వెనక కూర్చొని బ్రేక్‌, క్లచ్‌ అంటూ ఓనమాలు దిద్దించాడు.

మధ్యప్రదేశ్‌లోని దెవాస్‌ ఈమె స్వస్థలం. కంటికి నచ్చిన బైకులన్నింటినీ నడపడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఇంకేదైనా చేస్తే బాగుంటుందనిపించింది. పరిశోధిస్తే బైకింగ్‌ ఈవెంట్ల గురించి తెలిసింది. శిక్షణ నిమిత్తం కాలిఫోర్నియాలోని సూపర్‌ బైక్‌ స్కూల్లో చేరింది. నైపుణ్యాలను మెరుగుపరచుకుని రేసింగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచంలోనే ఎత్తైన ర్యాలీ రైడ్‌- ‘రైడ్‌ దే హిమాలయా’, ఇండియన్‌ నేషనల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లతోపాటు అంతర్జాతీయ పోటీల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించింది. మోటార్‌స్పోర్ట్స్‌లో ‘అవుట్‌స్టాండింగ్‌ ఉమన్‌’గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బుద్ద్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ను 2.08 నిమిషాల్లోనే పూర్తిచేసి, దేశంలోనే వేగవంతమైన మహిళా రేసర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో దీన్నే 2.16 నిమిషాల్లోనే పూర్తిచేసిన ఈమె ఈసారి తన రికార్డును తానే బద్దలుకొట్టింది.

‘దేశంలోనే ఫాస్టెస్ట్‌ ఉమన్‌ రేసర్‌గా నిలవడం ఆనందమే కానీ.. సులువుగా సాగిందని చెప్పలేను. బైక్‌ సంబంధించి ఓసారి ఓ శిక్షణ కార్యక్రమంలో చేరితే.. ‘కనీసం స్టాండ్‌ అయినా వేయగలవా?’ అని గేలి చేశారు. అమ్మాయివి మగరాయుడిలా బైకులేసుకుని తిరగడమేంటన్న ప్రశ్నలూ ఎదురయ్యాయి. పెట్రోల్‌పై డబ్బులు తగలేయక ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అన్న సలహాలూ బోలెడు. వాటన్నింటినీ ముందుకు సాగడానికి ప్రేరణగా తీసుకునేదాన్ని. ఆ తీరే నేను కోరుకున్న కెరియర్‌లో ముందుకు సాగడానికి సాయపడింది. కాబట్టి, అమ్మాయిలకు నేను చెప్పేదొక్కటే! నీ కలలను నెరవేర్చుకునే క్రమంలో బోలెడు అడ్డంకులు వస్తాయి. నీ నిర్ణయంపై నువ్వు గట్టిగా ఉన్నంతవరకూ ఎవరూ వాటికి అడ్డు కాలేరని’ అంటోంది 27 ఏళ్ల కల్యాణి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్