పిల్లల కోసమే... ఆ పనిచేశా

లోకం తెలియని పసిపాపలు అకృత్యాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల్లో మరింత అవగాహన రావాలంటోంది మిస్‌ ఇండియా మానస వారణాసి. ఆ దిశగా కృషి చేస్తోన్న ఛైల్డ్‌హెల్ప్‌లైన్‌ 1098కు అండగా నిలుస్తోంది.... పన్నెండు వాహనాల్ని సమకూర్చింది. హైదరాబాద్‌ పోలీసులు ప్రారంభించిన

Updated : 03 Oct 2021 01:59 IST

లోకం తెలియని పసిపాపలు అకృత్యాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల్లో మరింత అవగాహన రావాలంటోంది మిస్‌ ఇండియా మానస వారణాసి. ఆ దిశగా కృషి చేస్తోన్న ఛైల్డ్‌హెల్ప్‌లైన్‌ 1098కు అండగా నిలుస్తోంది.... పన్నెండు వాహనాల్ని సమకూర్చింది. హైదరాబాద్‌ పోలీసులు ప్రారంభించిన ‘వియ్‌ కెన్‌’ కార్యక్రమానికి ప్రచారకర్తగా పనిచేస్తోంది మానస... దీన్ని గురించి తన ఆలోచనలను వసుంధరతో పంచుకుందిలా...

చిన్నప్పట్నుంచీ మలేసియాలో పెరిగాను. ఇంటర్‌ చదివేందుకు హైదరాబాద్‌ వచ్చా. తర్వాత వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరంలో ఉండగా ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా రక్షితగృహాల్లో ఉంటున్న హైస్కూల్‌ పిల్లలకు ఆంగ్ల, భౌతిక, గణిత శాస్త్ర పాఠాలు చెప్పేదాన్ని. వాళ్ల వ్యక్తిగత విషయాలూ తెలుసుకునే దాన్ని. వారిలో చాలా మందికి ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేదనిపించింది. మంచి చదువు అందితే ఆత్మవిశ్వాసాన్ని పొందుతారనిపించింది. ఇంజినీరింగ్‌ అయ్యాక కూడా ప్రభుత్వ బాలికల వసతి గృహాలకు వెళ్లి వాళ్లతో గంటల కొద్దీ  గడిపి నాకు తెలిసిన విషయాలను వారితో పంచుకునేదాన్ని. వాళ్ల మాటలు నాకూ జీవితం పట్ల స్పష్టతనిచ్చాయి. ఆ అనుభవంతోనే మిస్‌ ఇండియా పోటీల్లో న్యాయనిర్ణేతలు ‘అనాథలు, చదువుకు దూరంగా ఉన్న పిల్లలను అదుకునేందుకు ఏం చేయాలి’ అన్నప్పుడు బాగా చెప్పగలిగాను. బహుశా నా మాటల్లోని నిజాయతీనే మిస్‌ ఇండియా కిరీటం వచ్చేందుకు ఉపకరించిందేమో!

అలా చెప్పారని...

మిస్‌ ఇండియా కిరీటం బాధ్యతనీ పెంచింది. అందుకే సమాజానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు అమ్మా, నాన్న, స్నేహితులతో చర్చించా. ఇటుక బట్టీలు, కర్మాగారాలు, దుకాణాలు, ఇళ్లల్లో పని చేస్తున్న పిల్లలని ఆ పని మాన్పించాలనుకున్నా. ఇందుకోసం 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ పనిచేస్తోందని తెలుసుకున్నాక ఆ ప్రతినిధులు, స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడా. మాటల మధ్యలో... కొవిడ్‌ సమయంలో వాహనాలు లేక నడిచి వెళ్లి పిల్లలని రక్షించామని అధికారులు చెబితే బాధనిపించింది. వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలతో మాట్లాడి వాహనాలు సమకూర్చాలనుకున్నా. కొన్ని నెలలుగా ఆ పనిలోనే ఉన్నా. కొందరు వాహనాలు ఇచ్చేందుకు అంగీకరిస్తే, కొందరు డబ్బు ఇచ్చారు. ఆ మొత్తంతో 12 వాహనాలను కొని తెలంగాణలో జిల్లాకొకటి ఇచ్చాం. మిగిలిన 21 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకూ సమకూరుస్తా.

పోలీసులతో కలిసి...

చిన్నారులు లైంగిక వేధింపులు బారినపడకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పోలీసులు ‘వియ్‌ కెన్‌’ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. దానికి ప్రచారకర్తగా ఉండమని అడిగారు. అది నా బాధ్యతగా భావించా. అందుకే ఒక్క సెకను కూడా ఆలోచించకుండా సరేనన్నా. ఎందుకంటే మెట్రోనగరాలు, పట్టణాల్లో చిన్నారులపై లైంగిక దాడులు... అత్యాచారాలు పెరుగుతున్నాయి. బాధితుల్లో కొందరు పోలీసులకు చెప్పేందుకూ ముందుకు రావడం లేదు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారఘటన అందరినీ కలచివేసింది. అలా మరో ఘటన జరగకుండా ఉండాలనే ప్రచార బాధ్యతలు తీసుకున్నా. మనచుట్టూ ఉన్న వారి ఆలోచనలను మార్చాలంటే చేయాల్సింది ఒక్కటే. సమస్యలపై అవగాహన... ప్రచారం. వీటి వల్లే ఆలోచన ధోరణి మారుతుంది. డిసెంబరులో మిస్‌ వరల్డ్‌ పోటీలు అయ్యాక పిల్లల కోసం హెల్ప్‌లైన్‌ ప్రారంభించ బోతున్నా. దానికి ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేశా.


చిన్నారులపై అకృత్యాలు ఆగాలంటే అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులకు మరింత అవగాహన కల్పించాలి. పిల్లల ప్రవర్తన మారినా, అసహజంగా కన్పించినా వెంటనే అనునయంగా మాట్లాడితే విషయం తెలుస్తుంది. అందుకే లైంగిక దాడులు, వేధింపులపై విస్తృత ప్రచారం నిర్వహించాలి.

- బి.సునీల్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్