రైతు మేలు కోసం... సైకిల్‌పై ప్రయాణం...

రైతన్నల కష్టాలను, పంట విధానాలను తెలుసుకోవాలనుకుంది రైతు బిడ్డ ప్రణలి.  సాగులో నష్టాలను అధ్యయనం చేయడం కోసం సైకిల్‌పై రాష్ట్రమంతా పర్యటిస్తోంది. పనిలో పనిగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ...

Updated : 05 Oct 2021 06:16 IST

రైతన్నల కష్టాలను, పంట విధానాలను తెలుసుకోవాలనుకుంది రైతు బిడ్డ ప్రణలి.  సాగులో నష్టాలను అధ్యయనం చేయడం కోసం సైకిల్‌పై రాష్ట్రమంతా పర్యటిస్తోంది. పనిలో పనిగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ... ఇప్పటికే ఒంటరిగా 1,500 కిలోమీటర్లు ప్రయాణించింది 21 ఏళ్ల ప్రణలీ చిక్తే.

పేద రైతుకుటుంబంలో చివరి సంతానంగా పుట్టింది ప్రణలి. తమ ముగ్గురు ఆడపిల్లలను మహాలక్ష్ములుగా భావించారా తల్లిదండ్రులు. ఉన్న కొంచెం భూమిలోనే పండిస్తూ, ఇతరుల పొలాల్లో కూలి చేస్తూ వారిని చదివించారు. తోబుట్టువులతో పాటు ప్రణలి కూడా స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత పొలంలో అమ్మానాన్నకు సాయం చేసేది. ఏటా ఆశగా పంట వేయడం, తీరా చివరికి తీవ్రంగా నష్టపోయి, అప్పుల బారిన పడే తల్లిదండ్రుల్ని చూస్తూ పెరిగింది ప్రణలి. వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు పడకపోవడంతో నీటికొరత ఏర్పడేది. పంటలు మార్చినా లాభం లేకపోయేది. వాళ్లది మహారాష్ట్రలోని పున్వాత్‌ గ్రామం. నందన వనంలా ఉండే ఆ ప్రాంతమంతా బీడుగా మారిపోవడం ఈమెకు చాలా వేదనను కలిగించింది.

* తొమ్మిది నెలల్లో

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం, పర్యావరణంపై సేద్యం ప్రభావం గురించి అధ్యయనం చేయాలనే ఆలోచన వచ్చింది ప్రణలికి. తమ గ్రామం మాత్రమే కాకుండా మిగతా ప్రాంతాల్లో వ్యవసాయమెలా ఉందో తెలుసుకోవా లనుకుంది. సైకిల్‌పై పర్యటించాలని అనుకుంటున్నట్లు చెబితే తల్లిదండ్రులు వ్యతిరేకించారు. వారినెలాగో ఒప్పించగలిగా అంటుంది ప్రణలి. ‘వ్యవసాయం తప్ప మరొక పని తెలియని మా అమ్మానాన్నల్లాగే చాలా మంది రైతులు వర్షాభావంతో నష్టాలకు గురై కుప్పకూలిపోతున్నారు. డిగ్రీ చేసిన నాకు చదువు ఈ విషయాలేమీ నేర్పలేదు. అనుభవపూర్వకంగా సేద్యం గురించి తెలుసుకున్నదే ఎక్కువ. దాంతో గతేడాది మా గ్రామ పంచాయతీలో తాగు నీరుకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో అధ్యయనం చేయడానికి చేరా. లాక్‌డౌన్‌తో దాన్ని పూర్తి చేయలేకపోయా. సొంతంగా వ్యవసాయంపై పరిశోధన చేయాలనిపించింది. అలా నా సైకిల్‌ ప్రయాణం ఈ జనవరిలో మొదలైంది. మహారాష్ట్రలోని వాయువ్య ప్రాంతమంతా పర్యటించా. అక్కడిరైతుల్లో పోటీతత్వం కనిపించింది. పొరుగువారికన్నా అధిక దిగుబడిని పొందాలని ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. ఇది పంటతోపాటు భూమిని కూడా కలుషితం చేస్తోంది. దీంతో పర్యావరణం ప్రభావితమై, సీజన్‌కు తగినట్లు వర్షాలు పడటంలేదు. ఇవన్నీ రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపైనా నేను తిరిగిన ప్రతి గ్రామంలోనూ చెప్పేదాన్ని. గ్రామ అధికారుల సాయంతో అక్కడివారికి అవగాహన కలిగించేందుకు ప్రయత్నించా. రేపటి తరానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందించాలంటే ఇప్పటి నుంచైనా అందరికీ ఈ విషయాలు తెలియాలి. సహజ ఎరువులతో పండించే పంట శాశ్వత ప్రయోజనాలనిస్తుంది. నేను గుర్తించిన వాటిని అధ్యయనం చేసి, వాటివల్ల కలిగే లాభనష్టాలను అందరికీ వివరిస్తున్నా. ఈ తొమ్మిది నెలల్లో 23 జిల్లాలు పర్యటించా. ఈ డిసెంబరులోపు  మిగిలిన 13 జిల్లాలు పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం. ఆ తర్వాత నేను పరిశీలించిన ఈ అంశాలన్నింటినీ పొందుపరిచి అందరికీ అందించడానికి కృషి చేస్తా’ అంటోంది ప్రణలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్