కూచిపూడిపై ఆసక్తితో.. లక్షల జీతాన్ని వదులుకొని!

ఆరేళ్ల వయసులో నృత్యంపై ఆసక్తి పెంచుకుందా అమ్మాయి...   పరిస్థితులు సహకరించక సర్దుకుపోయింది. ఉన్నత ఉద్యోగంలో చేరినా, వైవాహిక జీవితం బాధ్యతలతో సాగిపోతున్నా... తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు.

Updated : 17 Oct 2021 06:38 IST

ఆరేళ్ల వయసులో నృత్యంపై ఆసక్తి పెంచుకుందా అమ్మాయి... పరిస్థితులు సహకరించక సర్దుకుపోయింది. ఉన్నత ఉద్యోగంలో చేరినా, వైవాహిక జీవితం బాధ్యతలతో సాగిపోతున్నా... తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. అయిన వారు వద్దన్నా ఒప్పించుకుంది. లక్షల జీతమిచ్చే కొలువుని వదిలిపెట్టి నృత్య శిక్షకురాలిగా మారింది. ఈ కథంతా చిత్తూరు జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డిది. తన ప్రయాణాన్ని వసుంధరతో చెప్పుకొచ్చిందిలా...

ల అంటే...నిద్రలో వచ్చేది కాదు. లక్ష్యం కోసం నిద్రలేకుండా చేసేదని నమ్ముతా. ప్రాంతం మారినా, పరిస్థితులు తారుమారైనా నా గమ్యం తాలూకు ఆలోచనలు మాత్రం వదల్లేదు. నాకు అప్పటికి ఆరేళ్లుంటాయి. ఓ రోజు మయూరి సినిమా చూశా. తెగ నచ్చేసింది. అప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనే కోరిక మొదలైంది. తర్వాత నృత్యం ప్రధానాంశంగా ఏ సినిమా వచ్చినా వదిలేదాన్ని కాదు. నేనూ డ్యాన్స్‌ నేర్చుకోవాలనుకుని అమ్మానాన్నలకు చెప్పా. మాది వ్యవసాయ కుటుంబం కావడం, నృత్యంపై అవగాహన లేకపోవడంతో చదువు మీద దృష్టి పెట్టమన్నారు. పైగా మాది మారుమూల పల్లెటూరు...అక్కడ శిక్షణ ఇచ్చే వాళ్లు కూడా లేకపోవడంతో నాకు నేర్చుకునే అవకాశం రాలేదు. తర్వాత హాస్టల్‌ చదువు వల్ల కుదరలేదు. ఈలోగా పెళ్లయ్యింది. ఎంఎన్‌సీలో ఉద్యోగం. మాకో అమ్మాయి పుట్టింది. నాకు నృత్యంపై ఉన్న ఇష్టంతో పాప తరిష్యకి  శిక్షణ ఇప్పించాలనుకున్నా. రోజూ తనని శిక్షణకు తీసుకెళ్లి...తీసుకొచ్చేదాన్ని. ఆ క్రమంలోనే నా ఆసక్తి నన్ను తట్టి లేపింది. కానీ అప్పటికే ముప్పై రెండేళ్లు వచ్చేశాయి. ఈ వయసులో నేర్చుకుంటానంటే కుటుంబ సభ్యులు, బంధువులు ఏమనుకుంటారో అనే భయం. దీనికి తోడు అక్కడ నేర్చుకునేవారంతా నాకంటే వయసులో చిన్నకావడంతో బిడియపడ్డా. ఇవేకాదు మరెన్నో ప్రశ్నలూ వెంటాడేవి అయినా నేర్చుకోవాల్సిందే అని తీర్మానించుకున్నా.  ధైర్యం చేసి ఇంట్లోవాళ్లకి తెలియకుండా పాపతో పాటు నేనూ కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టా. రెండేళ్ల తర్వాతే ఇంట్లో వాళ్లకి చెప్పా. క్రమంగా ప్రదర్శనలూ ఇచ్చే స్థాయికి వచ్చా. ఓ ముప్పై అయ్యాక దాన్నే వృత్తిగా మార్చుకోవాలనిపించింది. కానీ ఉన్నత ఉద్యోగం, లక్షల వేతనం వదులుకుంటానంటే ఇంట్లో ఏమంటారోనని సంకోచం. మరో పక్క ఈ రంగంలో నెట్టుకురాగలనా అని  మథనం. ఈ విషయమై మావారితో  ఏడాది పాటు చర్చించా. చివరకు ఓ రోజూ ఉద్యోగానికి రాజీనామా చేసేసి...ఇంట్లో చెప్పా. మొదట్లో వ్యతిరేకించినా...తర్వాత వారూ సహకరించారు.

పాఠశాలను ఏర్పాటు చేసి..

నేర్చుకున్న కళను పదిమందికీ నేర్పాలనేది నా ఆలోచన. ఆసక్తి ఉన్న చిన్నారులకు 2018 నుంచి ఉచితంగా నేర్పిస్తున్నా. ఇందుకోసం మొదట నేను పుట్టిన వజ్జావారికండ్రిగలో స్కూల్‌ని ఏర్పాటు చేసి...యాభై మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నా. నాగలాపురంలో మరొకటి ఏర్పాటు చేశా. ఇందుకోసమే నెలకు నాలుగు రోజులపాటు ఊరు వెళ్లి వస్తా. తర్వాత హైదరాబాద్‌లో జ్యోతి కళాక్షేత్రం పేరిట రెండు నృత్య పాఠశాలలు ఏర్పాటు చేశా. ఆర్థిక స్థోమత ఉన్నవారి దగ్గర నామమాత్రపు రుసుము తీసుకుంటా. నా దగ్గర శిక్షణ పొందిన 250 మంది దేశ విదేశాల్లో వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. భవిష్యత్తులో మరింత మందికి నేర్పిస్తా. నృత్యశిక్షణ, ఇతర కార్యక్రమాల కోసం శ్రీకృష్ణ మందిరం నిర్మిస్తున్నా. దీనికి నా సొంత డబ్బులతో పాటు నా స్నేహితులూ సహకరిస్తున్నారు.

- బి.ప్రతాపరెడ్డి, ఈనాడు డిజిటల్‌, చిత్తూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్