550 రోజులు మంచానికే పరిమితమై...

పెళ్లై ఏడాది కాకుండానే విధి వారిపై కన్నెర్ర జేసింది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి కాలు, ఛాతీలో ఎముకలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆమెనలా చూసిన వారందరూ ఇక బతకదనుకున్నారు. అయితే విధికి ఎదురీదిన 27 ఏళ్ల ధృవీ ఎనిమిది శస్త్ర చికిత్సలతో... రెండున్నరేళ్లకు తన కాళ్లపై తాను నిలబడింది

Updated : 30 Sep 2022 14:25 IST

పెళ్లై ఏడాది కాకుండానే విధి వారిపై కన్నెర్ర జేసింది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి కాలు, ఛాతీలో ఎముకలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆమెనలా చూసిన వారందరూ ఇక బతకదనుకున్నారు. అయితే విధికి ఎదురీదిన 27 ఏళ్ల ధృవీ ఎనిమిది శస్త్ర చికిత్సలతో... రెండున్నరేళ్లకు తన కాళ్లపై తాను నిలబడింది. చిన్న చిన్న వాటికే నిరుత్సాహానికి గురయ్యే వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది...

ధృవీ, హృతిశ్‌ గోసాలియాలది అహ్మదాబాద్‌. హృతిశ్‌ వ్యాపారి. వాళ్లకు 2018, ఫిబ్రవరిలో పెళ్లయ్యింది. ఉత్సాహం పరవళ్లు తొక్కుతూ తిరిగే ఆ జంట తొలి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు ఓ పెళ్లికి హాజరై ఇంటికి ప్రయాణమయ్యారు. ఆ క్షణం తెలియదు... వారి జీవితాలు అనూహ్య మలుపు తిరగబోతున్నాయని. ఏవో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు కార్లో.... ఇంతలో వారి కారు అదుపుతప్పి డివైడర్‌ రెయిలింగ్‌పైకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో హృతిశ్‌ చిన్నచిన్న గాయాలతో బయటపడగా, ధృవీ తీవ్రంగా గాయపడింది. అక్కడున్న 15 అడుగుల ఇనుపరాడ్‌ ఆమె పాదం నుంచి తొడ వరకు చొచ్చుకుపోయింది. ప్రమాద తీవ్రతకు తన ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. అప్పట్నుంచీ ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి, అయిదున్నర గంటలు శ్రమించి కాలి ఎముకను తొలగించి రాడ్స్‌ను అమర్చారు. ఛాతీ ఎముకలను సరి చేయడానికి మరో నాలుగు గంటలు పట్టింది.

* ధైర్యంగా... ‘ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపే మమ్మల్ని చూసి బెస్ట్‌ కపుల్‌ అనేవారు. ప్రమాదం జరిగాక మెలకువ వచ్చే సరికి ఒళ్లంతా కట్లతో ఆసుపత్రిలో ఉన్నాను. నన్ను బతికించడానికి ఎనిమిది సర్జరీలు చేశారు. 550 రోజులు మంచానికే పరిమితమయ్యా. దాంతో చాలా ఇన్ఫెక్షన్లు వచ్చాయి. అప్పటి నుంచి నాకు నేను ధైర్యం చెప్పుకునే దాన్ని. తిరిగి చదువును కొనసాగించాలనుకునేదాన్ని. హృతిశ్‌ ప్రతి నిమిషం నాలో స్ఫూర్తిని నింపే వాడు. తన చేయూతే నన్ను నిలబెట్టింది. నా కాల్లోని రాడ్‌ను తొలగించారు. ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడటమే కాదు, అడుగులు వేయగలుగుతున్నా. ప్రమాదం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడే పూర్తిగా నడవగలుగుతున్నా. బీబీఏ చేసిన నేను ఇప్పుడు ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌లో అడ్వాన్స్డ్‌ డిప్లొమా చదువుతున్నా. అంతేకాదు, చుట్టుపక్కల పిల్లలందరికీ ఇంటి దగ్గర ట్యూషన్స్‌ చెబుతున్నా. కష్టాలెన్నెదురైనా వాటిని ఎదురీది పోరాడాలి. అందులో సంతోషం, గర్వం ఉంటుంది’ అంటున్న ధృవీ కథ స్ఫూర్తిదాయకం కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్