13 ఏళ్ల వయసులో కాడిపట్టి ... వందల మందిని నడిపించింది!

పన్నెండేళ్ల క్రితం బబిత కూడా అందరిలా సాధారణ ఆడపిల్లే! కానీ తండ్రి అనారోగ్యంతో ఆమెపై కుటుంబ భారం పడింది. ఆరుగురు తోబుట్టువులు కడుపు నింపడం కోసం కాడిపట్టేలా చేసింది.. కష్టంలోనూ వెన్నుచూపకుండా వందల మంది గ్రామస్తుల్లో స్ఫూర్తినింపి

Updated : 28 Oct 2021 08:47 IST

పన్నెండేళ్ల క్రితం బబిత కూడా అందరిలా సాధారణ ఆడపిల్లే! కానీ తండ్రి అనారోగ్యంతో ఆమెపై కుటుంబ భారం పడింది. ఆరుగురు తోబుట్టువులు కడుపు నింపడం కోసం కాడిపట్టేలా చేసింది.. కష్టంలోనూ వెన్నుచూపకుండా వందల మంది గ్రామస్తుల్లో స్ఫూర్తినింపి ఆడపిల్లల శక్తిని ప్రపంచానికి చాటింది ఉత్తరాఖండ్‌కు చెందిన పాతికేళ్ల బబిత రావత్‌.

రుగురు పిల్లలున్న కుటుంబంలో బబితనే పెద్దమ్మాయి. ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం ఆమెది. తండ్రి అనారోగ్యంతో అనుకోని పెద్దరికాన్ని మోయాల్సి వచ్చింది. 12 ఏళ్లక్రితం తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో వాళ్ల కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అప్పటికి బబిత వయసు 13 ఏళ్లే. బంధువులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకుని తండ్రికి వైద్యం చేయించింది తల్లి. కానీ అతని పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదు. తినడానికే కష్టంగా ఉండేది. ఇక చదువును కొనసాగించే అవకాశమేది? అయినా ఎలాంటి పరిస్థితుల్లోనూ చదువు ఆపకూడదు అనుకుంది తను. అమ్మా అదే మాట చెప్పింది. అంత కష్టంలోనూ స్కూల్లో చేర్పించింది. ఒక్కొక్కరికీ ఒక్క జతే యూనిఫాం మాత్రమే ఉండేది. దాన్నే ఉతుక్కొని వేసుకోవాలి. ఇలా రెండేళ్ల పాటు చేశారు.

తల్లి కూలి పనులకు వెళ్లేది. రోజుగడవడానికి ఎంత కష్టమవుతోందో బబిత గ్రహించింది. కూలికంటే సొంతంగా వ్యవసాయం చేయడం మంచిదనుకుంది. వాళ్లకి అటుఇటుగా ఓ ఎకరా భూమి ఉంది. కానీ అది నెర్రెలు విచ్చిన బంజరు. ఏళ్లతరబడి ఎలాంటి సాగూ లేకుండా పడిఉంది. దాంట్లోనే బంగారం పండించాలనుకున్నారు వాళ్లు. అందరూ కలిసి దాన్ని బాగు చేసుకున్నారు. ఒకదానిపైనే ఆధారపడితే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, వేర్వేరు పంటలను వేశారు. మెల్లగా కొన్ని పాడి పశువులనూ సమకూర్చుకున్నారు. ఉదయం నాలుగు గంటలకు బబిత దినచర్య ప్రారంభమయ్యేది. పొలం పనులు చూసుకుని, పాలు పితికి.. వాటిని అమ్మి ఆ వచ్చిన ఆదాయంతో ఇంటిని నడిపించేది. ఆధునిక యంత్రాలు, వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుని, వాటిని అమలు చేసేది. కూరగాయలతోపాటు పుట్టగొడుగుల సాగూ ప్రారంభించింది. తన అభివృద్ధిని చూసి చుట్టుపక్కల ఆడవాళ్లూ అదేదో మాకూ నేర్పమన్నారు. వాళ్లకోసం బబిత ప్రత్యేక వర్క్‌షాప్‌లనూ నిర్వహించేది. మెలకువలు నేర్పేది. అలా ఆమె సాయంతో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డ మహిళలెందరో ఆ గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలోనూ ఉన్నారు. ఒక్కొక్కరూ నెలకి ఎనిమిది నుంచి పది వేల దాకా సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఒంటి చేత్తో చేస్తూనే... 5 కి.మీ. దూరంలోని స్కూలుకి కాలినడకన వెళ్లేది బబిత.

‘ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ జిల్లా సౌర్ ఉమ్రేలా గ్రామం మాది. నాన్న పరిస్థితి చూశాక నా చదువే కష్టమనుకున్నా. కానీ అమ్మ చదువు ఆపొద్దని చెప్పింది. పట్టుదలగా పీజీ పూర్తిచేశా. ఎవరిమీదా ఆధారపడకూడదని అందరం కలిసి శ్రమపడ్డాం. ఇప్పటికీ 6-8 గంటలు పొలంలోనే గడుపుతా. ముగ్గురు చెల్లెళ్లకి పెళ్లిళ్లయ్యాయి. మరో చెల్లాయి, తమ్ముడు చదువుకుంటున్నారు. మా పొలంలో పండిన పంటని స్థానికంగానే అమ్మేస్తుంటాం. దీంతో రవాణా ఖర్చులు, సమయం కలిసొస్తున్నాయి. నేను చేయగలను అన్న నమ్మకమే ఇక్కడిదాకా నడిపించిందనుకుంటున్నా. అందుకే ఆడవాళ్లకి ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నా’ అంటోందీ 25 ఏళ్ల అమ్మాయి. మహిళలకు ఈమె చేస్తున్న సేవకుగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులతోపాటు యూత్‌ ఐకాన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఓపికతో ప్రయత్నిస్తే దేన్నైనా సాధించొచ్చు అనే బబిత ఈతరం అమ్మాయికి స్ఫూర్తిగా నిలుస్తుందడంలో ఎలాంటి సందేహమూ లేదు కదూ!


ఒకవైపు కాలేజీకి వెళ్తూనే స్వయం ఉపాధిలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించింది బబిత. ఎకరం పొలంలో బఠాణీలు, బెండకాయలు, వంకాయలు, కాలీఫ్లవర్‌, సిమ్లామిర్చి వంటివి పండించింది. పుట్టగొడుగుల ఉత్పత్తిలో లాభాలు కురిపించింది. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ పస్తులున్న వేళ కూడా చుట్టుపక్కల వారికి అండగా నిలిచింది. చుట్టుపక్కల స్త్రీలల్లో ఆమె నింపిన స్ఫూర్తి చిన్నదేం కాదు. ఇవన్నీ గమనించిన రాష్ట్రప్రభుత్వం మహిళా సాధికారత కోసం పాటుపడే వారికి ఇచ్చే తిలూరౌతేలీ అవార్డుతో సత్కరించింది. జిల్లా కలెక్టరు స్వయంగా ఆమె పొలానికే వచ్చి ప్రశంసించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్