నాన్నకు... బంగారు కొండ

కూతుర్ని పైచదువులకు పంపాలి.. వ్యవసాయానికి పెట్టుబడి కావాలి..  ఈ రెండింట్లో కూతురు చదువే ఎక్కువ అనిపించిందాయనకు. ఉన్నసొమ్ము సరిపోక అప్పుచేసి మరీ భవానిని పీజీలో చేర్చాడా తండ్రి. ఆయన కష్టం వృథా కాలేదు.

Updated : 28 Oct 2021 06:05 IST

కూతుర్ని పైచదువులకు పంపాలి.. వ్యవసాయానికి పెట్టుబడి కావాలి..  ఈ రెండింట్లో కూతురు చదువే ఎక్కువ అనిపించిందాయనకు. ఉన్నసొమ్ము సరిపోక అప్పుచేసి మరీ భవానిని పీజీలో చేర్చాడా తండ్రి. ఆయన కష్టం వృథా కాలేదు. బుధవారం జరిగిన ఉస్మానియా స్నాతకోత్సవంలో మూడు బంగారు పతకాలు సాధించింది కర్రి భవాని... తన గురించి వసుంధరతో పంచుకుంది

మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గరున్న లచ్చెన్నగూడెం. నాన్న సత్యనారాయణ రైతు. ఏడో తరగతి వరకూ నా చదువు మా ఊళ్లోనే. పదో తరగతి దాకా మర్లపాడులో, ఇంటర్‌, డిగ్రీ సత్తుపల్లిలోని ప్రైవేటు కళాశాలలో చదివాను. ఇంటర్‌ వరకు తెలుగు మీడియం. డిగ్రీలో ఇంగ్లీష్‌ మీడియం తీసుకున్నా. బాగా చదువుతుండటంతో నాన్న తన స్థోమతకు మించినా సరే.. నన్ను పెద్ద చదువులకు పంపాలనుకున్నారు. ఎమ్మెస్సీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదవాలని ఎంట్రన్స్‌ రాశా. నాకు ఇంటర్‌ నుంచి రసాయన శాస్త్రంపై ఆసక్తి ఏర్పడింది. అందుకే ఎమ్మెస్సీ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ ఎంచుకున్నా. కోఠి మహిళా కళాశాలలో సీటొచ్చింది. అప్పుడు హైదరాబాద్‌ రావడానికి కూడా డబ్బులకు ఇబ్బందైంది. మరోవైపు నాన్న వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి. అయినా నా చదువుకు ఇబ్బంది రాకూడదని ఇక్కడా అక్కడా అప్పులు తెచ్చి మరీ నన్ను హైదరాబాద్‌ పంపించారు. ఆయన కష్టం వృథా పోకూడదని ప్రథమ స్థానంలో నిలవాలని నిర్ణయించుకున్నా. ఓయూ క్యాంపస్‌ హాస్టల్‌లో ఉంటూ కోఠిలోని కళాశాలకు హాజరయ్యే దాన్ని. తెల్లవారు జామున 3 గంటలకే లేచి ఏడు వరకు చదివే దాన్ని. రెండేళ్లలో ఒక్క క్లాసుకూ గైర్హాజరవ్వలేదు. తరగతికి నేనొక్కదాన్నే హాజరైన సందర్భాలూ ఉన్నాయి. ముందు రోజు చెప్పిన పాఠాన్ని మరుసటి ఉదయాన్నే లేచి చదువుకుంటూ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నా. వర్సిటీ క్యాంపస్‌ సహా అనుబంధ కళాశాలల్లో ఎమ్మెస్సీలో అత్యధిక మార్కులు సాధించాను. నా కష్టానికి ప్రతిఫలంగా మూడు బంగారు పతకాలు రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. నా భర్త వెంకట రమేశ్‌ ప్రోత్సహంతో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్