ఆమె.. అమ్మవారికి ప్రతీక

నవరాత్రి, దీపావళి.. అమ్మవారిని భక్తితో కొలుచుకునే రోజులివి. విగ్రహాలనే కాదు.. సమాజంలోని ప్రతి అమ్మాయినీ పవిత్రంగా చూడాలంటుంది శిలో శివ్‌ సులేమన్‌. దీనికి గుర్తుగా ఆమె రూపొందించిన ఓ కళాఖండం అంతర్జాతీయ...

Updated : 29 Oct 2021 06:04 IST

నవరాత్రి, దీపావళి.. అమ్మవారిని భక్తితో కొలుచుకునే రోజులివి. విగ్రహాలనే కాదు.. సమాజంలోని ప్రతి అమ్మాయినీ పవిత్రంగా చూడాలంటుంది శిలో శివ్‌ సులేమన్‌. దీనికి గుర్తుగా ఆమె రూపొందించిన ఓ కళాఖండం అంతర్జాతీయ వేదికపై మంచి గుర్తింపునూ తెచ్చుకుంది. 40 లక్షల పైచిలుకు ధరా పలికింది... దాని ప్రత్యేకత ఏంటో... శిలోకి స్ఫూర్తి ఏంటో చదవండి...

శిలో శివ్‌ ఆర్టిస్ట్‌. ‘ఫియర్‌ లెస్‌ కలెక్టివ్‌’ పేరిట సంస్థను స్థాపించి 400 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. తన కళాఖండాలన్నీ లింగ భేదం, మహిళలపై వివక్ష, హింసలను ప్రతిబింబించేలాగే ఉంటాయి. ఈ ఏడాది న్యూయార్క్‌కు చెందిన ఓ ఛారిటీ వేలంలో ఈమెకు పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తొడగడానికి వీలుగా ఉండే ఇత్తడి కళాఖండం (టెంపుల్‌)ని రూపొందించింది. ఈమెది కేరళ. కానీ వీళ్ల కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఈమెకు 12 ఏళ్ల వయసులో వీళ్ల నాన్న వదిలేసి వెళ్లిపోయాడు. వీళ్ల అమ్మ కూడా ఆర్టిస్ట్‌. కుటుంబంలో అకస్మాత్తుగా వచ్చిన కుదుపు నుంచి బయటపడటానికి వీళ్లకి చాలా సమయమే పట్టింది. ఈ సంఘటనే తను స్వతంత్రంగా నిలబడేలా చేసిందంటుంది శిలో. కేరళలో నవరాత్రి సమయాల్లో మగవాళ్లు ఇత్తడి కళా రూపాలను ధరించి అమ్మవారి పూజకు వెళతారు. వీటిని ఆడవాళ్లు ధరించే వీలుండదు. వాళ్లకు ఆ శక్తి లేదని వారి నమ్మకం. ఇంకా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను గమనించింది. అనుకోకుండా రెండేళ్ల క్రితం నవరాత్రి సమయంలోనే వాళ్ల నాన్న తిరిగొచ్చాడు. కానీ ఆయన్ని ప్రశ్నించిన వారే లేరు.

అప్పుడే ఆమెకు ఈ ‘టెంపుల్‌’ ఆలోచన వచ్చింది. గుళ్లలోని విగ్రహాలకే కాదు.. ప్రతి అమ్మాయిలోని దైవత్వాన్నీ గ్రహించాలనీ, వాళ్ల శక్తులను తక్కువ అంచనా వేయొద్దనే సందేశం ఇచ్చేలా అమ్మవారి అవతారాన్ని ప్రతిబింబించేలా ధరించే వీలున్న ఇత్తడి తొడుగును రూపొందించింది. మొదట చేయగలనా అన్న సందేహమొచ్చినా తనకు వచ్చిన అవకాశంతో భారతీయ వృత్తి కళాకారుల పనితనాన్ని అంతర్జాతీయ వేదికపై నిరూపించాలన్న బలమైన కోరికే ముందుకు సాగేలా చేసిందంటుంది 32 ఏళ్ల శిలో. దీన్ని కేవలం ప్రదర్శించడానికే పరిమితమవకుండా దాని వెనకనున్న ఉద్దేశాన్నీ తెలియజేయాలనుకుంది. 40కేజీల బరువున్న దాన్ని ధరించి, నృత్యంతో ఓ వీడియోనూ రూపొందించింది. ఇది వేలంలో రూ. 42.5 లక్షలకుపైగా ధర పలకడంతోపాటు అంతర్జాతీయ ప్రశంసలనూ దక్కించుకుంది. డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి డిగ్రీ పూర్తిచేసిన ఈమె రచయిత కూడా. 16 ఏళ్ల వయసులో మొదటి పుస్తకాన్ని ప్రచురించింది. 18 ఏళ్లు వచ్చేటప్పటికే 10 పుస్తకాలు రాసింది. టెడ్‌ టాక్‌లో ఉపన్యాసాలూ ఇస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్