Updated : 07/11/2021 04:41 IST

పేదింటమ్మాయి.. పర్వతాలు ఎక్కేస్తోంది

పేద కుటుంబంలో పుట్టిన తనకు ఉన్నత స్థాయిలో నిలవాలన్నది కల. ఈ క్రమంలోనే పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. వేల అడుగులెత్తున్న హిమాలయ పర్వతాన్ని అధిరోహించి.. తన కలను సాకారం చేసుకోవడంతోపాటు కన్నవారు గర్వించేలా చేసింది. కర్ణాటకకు చెందిన సుమలత స్ఫూర్తి కథనమిది!

డిపి జిల్లా, మాలా ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టింది సుమలత. తండ్రి బాబు దినసరి కూలీ. తల్లి బిట్టూ గృహిణి. బాల్యం నుంచి చదువుపై ఆసక్తి, ఎప్పుడూ ప్రథమస్థానంలో నిలిచే సుమలతను బాగా చదివించాలనుకున్నారా అమ్మానాన్న. తనూ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాననేది. ఆమె మనసు ఎత్తైన పర్వతాలవైపు మళ్లింది. వాటిని అధిరోహించాలని కలలు కనేది. బీఏ చదువుతున్న ఈమె ఉడిపిలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉండేది. పర్వతారోహణంపై తన ఆసక్తిని హాస్టల్‌ వార్డెన్‌ సుచిత్రా సువర్ణ గుర్తించింది. ప్రోత్సాహాన్నీ ఇచ్చేది.

స్థానిక జనరల్‌ తిమ్మయ్య నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్వెంచర్‌.. ఏటా పర్వతారోహణ యాత్రను నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనే అవకాశాన్ని సుమలతకు సుచిత్ర కల్పించింది. అలా తన కలను నెరవేర్చుకోవడానికి తొలి అవకాశమొచ్చింది. ‘పర్వతారోహణకు ఫిట్‌నెస్‌తోపాటు నగదు, ప్రణాళిక ఎంతో ముఖ్యం. అన్నింటికన్నా ముందు అమ్మానాన్నలను ఒప్పించడం కష్టమైంది. నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకునే వారికి పర్వతాలెక్కుతాననే సరికి భయపడ్డారు. చదువును నిర్లక్ష్యం చేస్తానేమోనని కంగారు పడ్డారు. అదేమీ లేదని చెప్పి ఒప్పించి పర్వతారోహణ చేశా. ఆ అనుభవం నాలో ధైర్యాన్ని నింపింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు వంటి విషయాల్లో అకాడమీ వారి శిక్షణ సాయపడింది. దీంతో మరిన్ని సాహసయాత్రలు చేయాలనుకున్నా. 2017లో 14,800 అడుగులెత్తున్న సికాధర్‌ షికార్‌,  2019లో జమ్మూకశ్మీర్‌, సోనామార్గ్‌లోని 11,500 అడుగులెత్తున్న తజివాస్‌ టేబుల్‌టాప్‌లను అధిరోహించా. ఇటీవల జనరల్‌ తిమ్మయ్య నేషనల్‌ అకాడమీ నిర్వహించిన పర్వతారోహణ యాత్రలో 30 మంది సభ్యులతో కలిసి పాల్గొనే అవకాశం దక్కింది. ఈ జట్టులోని పదిమంది మహిళల్లో నేనూ ఒకరిని కావడం చాలా సంతోషాన్నిచ్చింది. అలా 15,407 అడుగులెత్తున్న హిమాలయ పర్వతంపై పహల్‌గమ్‌ మౌంట్‌ సన్‌సెట్‌ పాయింట్‌ను చేరుకున్నా. అక్కడ మన త్రివర్ణపతకాన్ని ఎగురవేసిన అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేను. ఎత్తైన ప్రాంతాలు అధిరోహించేటప్పుడు మంచు కారణంగా ప్రమాదాలెక్కువ. అక్కడి వాతావరణం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వీటన్నింటినీ తట్టుకుంటూ సాగాలి. ఇక్కడ మహిళలు, పురుషులంటూ తేడా ఉండదు. ఫిట్‌నెస్‌కు మాత్రమే ప్రాధాన్యం. కొన్నిసార్లు మా బృందంలోని మగవారికన్నా వేగంగా ముందుకెళ్లే దాన్ని. అలాగే మానసికస్థైర్యం, సాధన వంటివీ తోడైతేనే అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం’ అని చెబుతున్న 23 ఏళ్ల సుమలతను గ్రామంలో అందరూ గర్వంగా ‘హిమాలయాలెక్కుతున్న అమ్మాయి’ అని పిలుచుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని