ఆత్మవిశ్వాసానికి ప్రతీక మనీషా..

మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఆమె వైపు ఓ అమ్మాయి కన్నార్పకుండా చూసింది. ఎందుకలా చూస్తున్నావంటే మీ ఉంగరాల జుట్టు చాలా బావుందని ప్రశంసించింది. ఆ ప్రశంసలు తనకు మంచి జ్ఞాపకంగా మిగిలాయి. ఎందుకంటే విటిలిగో బాధితురాలైన ఆమె బాల్యం నుంచి ఎన్నో అవమానాలనెదుర్కొంది.

Updated : 11 Nov 2021 14:54 IST

దిల్లీ మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఆమె వైపు ఓ అమ్మాయి కన్నార్పకుండా చూసింది. ఎందుకలా చూస్తున్నావంటే మీ ఉంగరాల జుట్టు చాలా బావుందని ప్రశంసించింది. ఆ ప్రశంసలు తనకు మంచి జ్ఞాపకంగా మిగిలాయి. ఎందుకంటే విటిలిగో బాధితురాలైన ఆమె బాల్యం నుంచి ఎన్నో అవమానాలనెదుర్కొంది. అయితే ఇప్పుడామె అది అనారోగ్యం కాదు కేవలం చర్మ సమస్య మాత్రమే అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. అంతేనా... వ్లోగర్‌గా మారి ఆన్‌లైన్‌ ద్వారా తనలాంటి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది దిల్లీకి చెందిన మనీషా మాలిక్‌. ఆమె వీడియోలకు లక్షల సంఖ్యలో అభిమానులుండటం విశేషం.

మనీషాకు ఆరేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం కలిగింది. చాలా చోట్ల చికిత్స ఇప్పించారామె తల్లిదండ్రులు. ఫలితం దక్కకపోగా మందుల కారణంగా ఆమె చర్మంలోని మెలనోసైట్స్‌ నశించిపోయాయి. దాంతో విటిలిగో సమస్య మొదలై, ముఖం, చేతులు, పాదాలపై మచ్చలు వచ్చాయి. దీన్ని పెద్ద లోపంగా భావించిందామె. మచ్చలు కనిపించకూడదని శరీరమంతా కప్పే దుస్తులను ధరించేది. స్కూల్‌లో తోటి విద్యార్థులూ జీబ్రా అంటూ వెక్కిరించేవారు.

* ఎదిరించి...
చర్మ సమస్యను అంటురోగంగా భావించే వారి మధ్య నాలాంటి వారి గురించి ఆలోచించా అంటుంది మనీషా. ‘బాల్యం నుంచి ఎన్నో అవమానాలెదుర్కొన్నా. పక్కింటి వాళ్లు, బయటి వాళ్లంతా అయ్యో అమ్మాయికి పెళ్లి అవదంటూ సానుభూతి చూపించేవారు. అమ్మానాన్న చాలా బెంగపడేవారు. అయితే నాలో నేనే ఆలోచించుకున్నా. ఇది మన దేశంలో వేల మందిలో ఒకరికి వచ్చే చర్మసమస్య. భయపడి ప్రజలకు దూరంగా దాక్కుని బతకాల్సిన అవసరం లేదనిపించింది. అంతే... నా ఆహార్యాన్ని మార్చుకున్నా. అందరిలాగే నేనూ స్వేచ్ఛగా ఉండటం నేర్చుకున్నా. ఎవరైనా నన్ను వింతగా చూసినా ఎందుకలా చూస్తున్నావని అడిగే ధైర్యం వచ్చింది. నన్ను ప్రేమించిన కార్ల్‌ రాక్‌ను పెళ్లి చేసుకున్నా. నాలాంటి వాళ్లలో ధైర్యాన్ని నింపాలని ‘ఎట్‌ అయామ్‌ మనీషా మాలిక్‌’ పేరుతో బ్లాగ్‌ ప్రారంభించా. ఇందులో ఈ తరహా చర్మ సమస్య నుంచి మహిళలెదుర్కొంటున్న ఎన్నో అంశాలపై మాట్లాడుతున్నా. చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలను చెబుతున్నా. వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగం అంటే నమ్మి ఆర్థిక మోసాలకు గురవుతున్న గృహిణుల్లో అవగాహన కలిగిస్తున్నా. నా భర్త ప్రోత్సాహంతో మేం తిరిగే పర్యాటక ప్రాంతాలన్నింటినీ వీడియోల రూపంలో పొందుపరుస్తున్నాం. అలా గతేడాది నాపై తీసిన ‘సెండింగ్‌ మై ఇండియన్‌ వైఫ్‌ టు పాకిస్థాన్‌’, ‘వాట్స్‌ రాంగ్‌ విత్‌ మై వైఫ్‌’ వీడియోలను 68 లక్షల మందికిపైగా వీక్షించారు. నాలా ఈ చర్మ సమస్యకు గురైన వారికందరికీ చెప్పేదొక్కటే. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం అలవరుచుకోవాలి. అప్పుడే మనల్ని వెక్కిరించే వారికి సరైన సమాధానమవుతుంది’ అంటోన్న మనీషా మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్