close
Updated : 17/11/2021 04:43 IST

మూడో అంతస్తు నుంచి తోసేశారు...

అదనపు కట్నంకోసం భర్త, అత్తమామలు మూడో అంతస్తు నుంచి గెంటేస్తే వెన్నెముక విరిగిపోయింది పూనమ్‌ రాయ్‌కి. 17 ఏళ్లపాటు మంచానికే పరిమితమైపోయింది. అందరూ సానుభూతి చూపించారు. ఆమె మాత్రం కళాకారులకు, తైౖక్వాండో క్రీడాకారులకు మార్గదర్శకురాలిగా నిలిచింది. ప్రధాని మోదీనీ మెప్పించింది... స్ఫూర్తికి నిలువెత్తు రూపంలాంటి పూనమ్‌ కథ చదవండి...

బిహార్‌లోని వైశాలి జిల్లా పూనమ్‌ రాయ్‌ది. తండ్రి బిందేశ్వరిరాయ్‌ ఇంజినీర్‌. ఆయన ఉద్యోగరీత్యా ఆ కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి బదిలీ అయ్యింది. ఇంట్లో ఇద్దరు మగపిల్లల మధ్య ఒక్కతే ఆడపిల్ల కావడంతో గారాబంగా పెరిగింది. చిత్రకళపై ఆసక్తితో బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో తన మనసుకు నచ్చిన కళలోనే డిగ్రీ పూర్తిచేసింది. పట్నాకు చెందిన ఓ ఇంజనీర్‌తో 1996లో ఈమెకు వివాహం జరిగింది. కానీ తర్వాతే తెలిసింది పూనమ్‌ భర్త ఇంజినీర్‌ కాదు, ఇంటర్‌ మాత్రమే చదివాడని. ఆ మోసం చాలదన్నట్టు ఇంకా కట్నం తేవాలని పూనమ్‌ను హింసించేవారు. ఎప్పటికప్పుడు పుట్టింటి నుంచి తెచ్చిచ్చినా వాళ్లు సంతృప్తి పడలేదు. ఈ సమస్యల మధ్యలో పూనమ్‌కు 1997లో ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి.

17 ఏళ్లపాటు... ‘అప్పుడు నా కూతురికి రెండు నెలలు. పచ్చిబాలింతగా ఉన్న నన్ను కొట్టి, మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసింది మా అత్తింటి కుటుంబం. నా వెన్నెముక విరిగిపోయింది. శరీరంలోని అవయవాలన్నీ అచేతనం అయ్యాయి. అమ్మానాన్న చికిత్స చేయించారు. కానీ శవంలా పడి ఉండేదాన్ని. మంచంలో ఉంటూ శారీరకంగా, మానసికంగా నరకం అనుభవించా. ఓవైపు పాప, మరోవైపు అమ్మానాన్నల వేదన నన్ను తీవ్రమైన కుంగుబాటుకు గురిచేశాయి. అలా 17 ఏళ్లు గడిపాను. నేనిక ఎప్పటికీ నడవలేనని వైద్యులు చెప్పారు. జీవితమంతా చక్రాల కుర్చీకి పరిమితమైపోవడం నాకు నచ్చలేదు. నాకు నేనుగా నిలబడాలనుకున్నా. నన్ను నేనే ప్రోత్సహించుకోవడం మొదలుపెట్టా. వైద్యులు చెప్పినదాన్ని మార్చి చూపించాలనిపించింది. ఎలాగైనా అడుగులేయాలని సంకల్పించుకున్నా. 2014లో నాకు నేనుగా స్టాండు సాయంతో లేచి నుంచోవడమే కాదు, అడుగులూ వేయగలిగా. అనుకున్నది సాధించానని ఆనందపడేలోపు నాన్న చనిపోయారు’ అంటుంది పూనమ్‌.

నాన్న జ్ఞాపకార్థం... తనకోసం ప్రతిక్షణం ఆలోచించే తన తండ్రి జ్ఞాపకార్థం ఏదైనా చేయాలనుకుంది. అలా ప్రారంభించిందే ‘బీఆర్‌ ఫౌండేషన్‌’. మరుగునపడిన తన చిత్రకళను వెలికి తీసి, దాన్ని ఇతరులకూ అందించాలనుకుంది. తన భావోద్వేగాలను చిత్రలేఖనాలుగా తీర్చిదిద్దడమే కాదు, చిన్నారులకు ఈ కళలో శిక్షణనివ్వడం మొదలుపెట్టింది. వారణాసిలోని గ్రామీణప్రాంతాల పేద పిల్లలకు ఈ కళను దగ్గరచేయడానికి కృషి చేసింది. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి, వారితో పెయింటింగ్స్‌ వేయించి దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలిచ్చింది.

క్రీడలో... ఓవైపు ఆర్ట్‌తోపాటు మరోవైపు ఆడపిల్లలకు స్వీయరక్షణపై అవగాహన కలిగించాలనే ఆలోచన వచ్చింది పూనమ్‌కు. తనలా మరెవరూ వేధింపులకు గురి కాకూడదనుకుంది. తైక్వాండోలో పిల్లలకు శిక్షణ నిప్పించాలనుకుంది. ఈ క్రీడలో రాణించిన జాతీయస్థాయి క్రీడాకారులతో శిక్షణ అందించింది. అలా 2016 నుంచి ఈ అయిదేళ్లలో ఆమె అందించిన చేయూతతో దాదాపు మూడు వేలమంది పిల్లలు, మహిళలు శిక్షణ పొందారు. అంతేకాదు, వీరిలో దీక్షాపటేల్‌, యశ్విని సింగ్‌, సాధన ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన తైక్వాండో అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణ, కాంస్య పతకాలను సాధించారు. ‘ఓ అమ్మాయి జీవితంలో వచ్చే దశలన్నింటినీ వేయడానికి ప్రయత్నించా. 648 రకాల భావోద్వేగాలను కాన్వాస్‌లో పెయింట్‌ చేయడానికి నాకు 17 రోజులుపట్టింది. ఈ చిత్రలేఖనంతో 2017లో ప్రపంచరికార్డును సాధించా. ప్రధాని మోదీ మిషన్‌ ‘బేటీ బచావ్‌ బేటీ పడావ్‌’ నుంచి స్ఫూర్తి పొందినప్పుడు వచ్చిన ఆలోచనే ఈ పెయింటింగ్‌. ప్రధాని మోదీని కలుసుకున్నప్పుడు నేను గీసిన ఆయన చిత్రలేఖనాన్ని కానుకగా అందించా. ఆయన ప్రశంసలు మరవలేనివి’ అని అంటోంది పూనమ్‌రాయ్‌.


Advertisement

మరిన్ని