13వేల చెరువులు తవ్వించింది!

అమెరికాలో చదువుకుంది.. కుటుంబ వ్యాపారం ఎలానూ ఉంది వీటితో హాయిగా కాలం గడిపేయాలనుకోలేదు మైథిలి. వ్యాపారంతోపాటూ సామాజిక బాధ్యతా అవసరమే అనుకుంది. తెలుగు రాష్ట్రాలతో సహా రాజస్థాన్‌ వంటి చోట్ల ప్రత్యేకమైన ...

Updated : 19 Nov 2021 04:55 IST

అమెరికాలో చదువుకుంది.. కుటుంబ వ్యాపారం ఎలానూ ఉందివీటితో హాయిగా కాలం గడిపేయాలనుకోలేదు మైథిలి. వ్యాపారంతోపాటూ సామాజిక బాధ్యతా అవసరమే అనుకుంది. తెలుగు రాష్ట్రాలతో సహా రాజస్థాన్‌ వంటి చోట్ల ప్రత్యేకమైన వేలాది కృత్రిమ చెరువులని సృష్టించింది. సృజనాత్మకత, సాంకేతికతల ఆలంబనగా వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తోన్న ఈ యువతరంగం స్ఫూర్తి కథ ఇదీ..

కుంభవృష్టి ముంచుకొచ్చే వరదలు... మనకి సాధారణమయ్యాయి. అయినా భూగర్భ జలాలు పెరగడం లేదు. కారణం ఆ నీరంతా సముద్రం పాలవుతోంది. ఒకపక్క కరవు ప్రాంతాలు పెరుగుతున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే రైతులు ఆధునిక పద్ధతులపై దృష్టి పెట్టాల్సిందే’ అనే మైథిలి అప్పల్వార్‌ 2016లో సరికొత్త నీటి నిర్వహణ పద్ధతులకు శ్రీకారం చుట్టింది.

రిలయన్స్‌తో చెయ్యి కలిపి...

మైథిలీ ముంబయిలో పుట్టిపెరిగింది. అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి డిగ్రీ చేసి వచ్చింది. ముంబయిలో వారి కుటుంబ పాలిమర్‌ తయారీ సంస్థ బాధ్యతలు తీసుకుంది. ఆ క్రమంలోనే మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కరవు ప్రాంతాల్లో రైతుల బాధలు ఆమెని కదిలించేశాయి... సామాజిక బాధ్యత వైపు మళ్లించాయి. వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఏం చేయగలనా అని విస్తృత అధ్యయనం చేసింది. అప్పుడొచ్చిన ఆలోచనే జలసంచయ్‌. పొలాల్లోనే చెరువు తవ్వి అందులో ప్లాస్టిక్‌ షీట్లని ఉంచి వర్షపునీటిని ఒడిసిపడితే రైతులకు ఏడాదంతా ఉపయోగపడతాయని అనుకుంది. కానీ అదేమంత తేలిక కాదు. ఎందుకంటే ఎంత నీటిని పట్టినా ఆవిరి అయిపోతాయి. అలా కాకుండా ఉండేందుకు చాలా పరిశోధనలు చేసింది. ఎండని తట్టుకుని, యూవీ కిరణాలని ఫిల్టర్‌ చేసుకొనేలా, నీరు ఆవిరి అవ్వకుండా అడ్డుకునేలా షీట్ల తయారీని మొదలుపెట్టింది. దీనికి రిలయన్స్‌ సంస్థ సాయం తీసుకుంది. వాటిని రైతులకు పరిచయం చేయడానికి వందల గ్రామాలకు తిరిగింది. మొదట్లో రైతులు తన మాటలు పట్టించుకోలేదు. అయినా తను పట్టు వదల్లేదు. దీనికి అవసరం అయిన సొమ్ముని రుణంగా బ్యాంకుల నుంచి ఇప్పించేది. క్రమంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 13 వేలకు పైగా కృత్రిమ చెరువుల్ని అభివృద్ధి చేసింది మైథిలి. వాటి ద్వారా 80 వేలమంది రైతులు లబ్ధి పొందారు. తన వ్యాపారమూ పెరిగి డెబ్భై కోట్లకు చేరింది. ‘మేం చేసిన సూపర్‌ లైనింగ్‌ పాలిమర్‌ షీట్ల వల్ల నీరు త్వరగా ఆవిరి కాదు. లీకేజీలు ఉండవు. ఏడాదంతా నీళ్లు ఉంటే... రైతు కూడా ఉద్యోగుల్లానే ఏడాదంతా సంపాదించుకోగలుగుతాడు. ఈ చెరువుల్లో ఆల్గే, చేపల్ని కూడా పెంచుకుని ఆదాయం పొందవచ్చు. ఇవన్నీ రైతులకు చెప్పడానికి చాలా కష్టపడ్డాను. వాళ్లకు నా భాష అర్థమయ్యేది కాదు. వయసులో చిన్నదాన్ని. పట్టించుకునే వారు కాదు. ఎన్నో ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. వారానికోసారి గ్రామసభలు పెట్టే దాన్ని. సంతలకు వెళ్లి రైతులని కలిసేదాన్ని. నా కష్టం ఫలించి నెమ్మదిగా రైతులు ఈ కృత్రిమ చెరువుల ప్రయోజనాలు తెలుసుకుంటూ వచ్చారు’ అనే మైథిలి తక్కువ నీటితో తక్కువ స్థలంలో కాయగూరలు పెంచుకొనేలా ప్రత్యేక బ్యాగులనీ రూపొందిస్తోంది. నా లక్ష్యం ఒక్కటే... వీలైనంత మంది రైతులకు నీటి నిర్వహణపై అవగాహన కల్పించాలి. తక్కువ ఖర్చుతో నీటిని దాచుకోవడమెలానో తెలియాలి. వాళ్లు లాభాల బాట పట్టాలి అంటోన్న మైథిలి ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్